ల్యాండ్ టైటలింగ్ యాక్ట్ రద్దు బిల్లుకు అసెంబ్లీ ఆమోదం
posted on Jul 23, 2024 @ 4:48PM
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ల్యాండ్ టైటలింగ్ యాక్ట్ రద్దుకు ఆమోదం తెలిపింది. మంగళవారం (జులై 23) అసెంబ్లీలో ప్రభుత్వం రెండు బిల్లులను ప్రవేశ పెట్టింది. రెండు బిల్లులనూ సభ ఏకగ్రీవంగా ఆమోదించింది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, అలాగే హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు బిల్లులను సభ ఏకగ్రీవంగా ఆమోదించింది.
కాగా ఈ రెండు బిల్లులలూ సభలో ఏకగ్రీవంగా ఆమోదం పొందినట్లు ఏపీ అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు సభలో ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన ఎలాంటి ఆంగ్లపదాన్ని ఉపయోగించకుండా తెలుగులోనే ఈ ప్రకటన చేయడంపై పలువురు సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. ఏ వైసీపీ ఓటమికి కారణాల్లో ల్యాండ్ టైటిలింగ్ కూడా ఒకటన్నది తెలిసిందే. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ద్వారా పేద ప్రజల భూములపై హక్కులను తీసేసుకుంటారంటూ అప్పట్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీలు ఆరోపించిన సంగతి తెలసిందే.
ఇది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కాదని.. ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ అంటూ పెద్దఎత్తున ప్రచారం చేశారు. ఈ క్రమంలోనే తాము అధికారంలోకి వస్తే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేస్తామని చంద్రబాబు అప్పట్లో హామీ ఇచ్చారు. ఇచ్చిన హామీ మేరకు అధికారం చేపట్టగానే చేసిన ఐదు సంతకాల్లో ఒకటి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు. ఆ తర్వాత ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుకు ఆమోదం తెలిపిన మంత్రివర్గం.. ఇవాళ సభలో బిల్లు ప్రవేశపెట్టి ఏకగ్రీవ ఆమోందం పొందింది. అదే విధంగా హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు బిల్లు కూడా. విజయవాడలోని ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం పేరును జగన్ ప్రభుత్వం వైఎస్ఆర్ హెల్త్ వర్సిటీగా మార్చింది.
దీనిపై అప్పట్లోనే పెద్దఎత్తున విమర్శలు వచ్చాయి. తెలుగుదేశం కూడా హెల్త్ వర్సిటీకి వైఎస్సార్ పేరు పెట్టడాన్ని తీవ్రంగా వ్యతిరేకించింది. తాము అధికారంలోకి రాగానే హెల్త్ వర్సిటీ పేరును ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీగా మారుస్తామని అప్పట్లోనే ప్రకటించింది. అన్న మాట మేరకు ఎన్టీఆర్ హెల్త్ వర్టీటీగా పునరుద్ధరిస్తూ బిల్లు ప్రవేశపెట్టింది. దానికి ఏపీ అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది.