తెలంగాణ ప్రభుత్వం నా భూమి లాక్కుంది...
posted on Sep 13, 2016 @ 1:10PM
తెలంగాణ ప్రభుత్వం మా భూమిని లాక్కుంది అని అరకు ఎంపీ కొత్తపల్లి గీత ఆరోపించారు. హైదరాబాద్ రాయదుర్గం ప్రాంతంలో తమకున్న 53 ఎకరాల భూమిని తెలంగాణ ప్రభుత్వం ఆక్రమించిందని.. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా ఎలా కబ్జా చేస్తారని ఆమె ప్రశ్నించారు. రాయదుర్గంలో సర్వే నెం. 83/2లో 53 ఎకరాల భూమిని తాము చట్ట ప్రకారం కొనుగోలు చేశామని.. అలాంటి భూమిని రాత్రికి రాత్రే రెవెన్యూ అధికారులు దొంగల్లా తమ స్థలంలోకి ప్రవేశించి సెక్యూరిటీ సిబ్బంది దాడిచేసి భూమిని కబ్జా చేశారని ఆరోపించారు. టీఎస్‌ఐఐసీ (తెలంగాణ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ) ఎండీ నరసింహారెడ్డి, రంగారెడ్డి జాయింట్ కలెక్టర్ రజతకుమార్ సైనీ కలిసి చేసిన కుట్ర ఇది అని అన్నారు. ఇది కేవలం ఉద్దేశ పూర్వకంగా చేయించిన కబ్జా అని.. ఆ భూమికి సంబంధించిన అన్ని పత్రాలు తన దగ్గర ఉన్నాయని.. ఈ ఆస్తే తమ జీవితాధారమని.. అది లేని నాడు తమ కుటుంబం రోడ్డున పడాల్సి వస్తుందని చెప్పారు. ఇంకా ఈ విషయంపై కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ కు గవర్నర్ నరసింహన్ కు ఫిర్యాదు చేశానని.. వారు కలిసి మస్యను వెంటనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారని వివరించారు.