చిత్రం భళారే విచిత్రం... మహిళ ఫోటో కు బదులు ముఖ్యమంత్రి ఫోటో
posted on Nov 7, 2023 @ 1:42PM
ఆంధ్ర ప్రదేశ్ వోటర్ల జాబితా తప్పుల తడక అని మరో మారు రుజువయ్యింది.
ఓటర్ జాబితా విషయంలో అక్రమాలు జరుగుతున్నాయని ప్రతిపక్షాలు ఆరోపిస్తుండగా.. ప్రస్తుతం ఈ ఆరోపణలకు ఊతమిచ్చే విషయం ఒకటి వెలుగులోకి వచ్చింది.
ప్రకాశం జిల్లాలోని ఓ గ్రామానికి చెందిన ఓటర్ జాబితాలో ఈ దాష్టీకం చోటు చేసుకుంది. అధికారుల నిర్లక్ష్యం మూలంగా రాష్ట్ర ముఖ్యమంత్రి ఫొటో దర్శనమిచ్చింది. అది కూడా ఓ మహిళ ఫొటో ఉండాల్సిన చోట సీఎం జగన్ ఫొటో ఉంది. ఫొటో స్పష్టంగా కనిపిస్తున్నా సరే పోలింగ్ సిబ్బంది పట్టనట్టు వ్యవహరిస్తున్నారు. వారి నిర్లక్ష్యానికి ఇది అద్దం పడుతోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఆంధ్ర ప్రదేశ్ లో ఎన్నికలు కూత వేటు దూరంలో ఉన్నాయి. ఇలా తప్పుల తడకతో ఉన్న వోటర్ల జాబితా చూస్తే ప్రజాస్వామ్యాన్ని వెక్కిరించే విధంగా ఉందని సామాజిక కార్యకర్తలు అభిప్రాయపడుతున్నారు. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రాష్ట్రంలో ఓటర్ జాబితాలో సవరణలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం నియోజకవర్గంలోని చెర్లోపల్లి గ్రామ ఓటర్ జాబితాలో ముఖ్యమంత్రి జగన్ ఫొటో దర్శనమిచ్చింది. గ్రామానికి చెందిన గురవమ్మ అనే మహిళ ఫొటో స్థానంలో సీఎం ఫొటోను ఉంది . దీన్ని ఎవరు అప్ లోడ్ చేశారో వేయి డాలర్ల ప్రశ్న. బీఎల్ వో లో కంప్యూటర్ ఆపరేటర్ నిర్లక్ష్యంతో ఈ ఘటన చోటుచేసుకుందని వినిపిస్తుంది. అయితే, ఓటర్ జాబితాను సిద్ధం చేశాక ప్రింటింగ్ కు ఇచ్చే ముందు బీఎల్ వో తో పాటు రెవెన్యూ అధికారులు కూడా చెక్ చేస్తారు. అధికారుల నిర్లక్ష్యానికి ఇది పరాకాష్ఠ అని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు, ఓటర్ల జాబితాలో అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపిస్తున్న ప్రతిపక్షాలు.. ఈ ఘటనపై తీవ్రంగా విరుచుకు పడుతున్నాయి.