ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ పేరు మార్పుపై భగ్గుమన్న ఏపీ
posted on Sep 22, 2022 @ 1:56PM
ఎన్టీఆర్ హెల్త్ వర్శిటీకి వైఎస్సార్ వర్సిటీగా పేరు మార్చడాన్ని వ్యతిరేకిస్తూ ఏపీ భగ్గుమంది. ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ పేరు మార్పుపై వైసీపీ సర్కార్ పై రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఇదేం దిక్కుమాలిన నిర్ణయం, అనవసరంగా ప్రజల భావోద్వేగాలను జగన్ సర్కార్ రెచ్చగొడుతోందంటూ పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విపక్ష టీడీపీ సభ్యులు అసెంబ్లీ వేదికగా పెద్ద ఎత్తున ఆందోళన, నిరసన వ్యక్తం చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్, జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ జగన్ సర్కార్ నిర్ణయాన్ని తీవ్రంగా తప్పుపట్టారు.
చివరికి వైసీపీ నేతల నుంచి కూడా ఎన్టీఆర్ పేరు తొలగించడంపై అసంతృప్తి వ్యక్తం అవుతోంది. హెల్త్ వర్శిటీని స్థాపించిన దివంగత ఎన్టీఆర్ కుటుంబం వైసీపీ సర్కార్ చర్యను తప్పుపడుతూ ప్రకటన చేసింది. ఇక జగన్ ఏరి కోరి స్వయంగా అధికార భాషా సంఘం, తెలుగు ప్రాధికార సంఘం, హిందీ అకాడమీ అధ్యక్ష పదవులలో నియమించిన యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ ఎన్టీఆర్ వర్సిటీ పేరు మార్పునకు నిరసనగా రాజీనామా చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు స్పందిస్తూ.. హెల్త్ వర్శిటీకి ఎన్టీఆర్ పేరు మార్చడంపై ఫైరయ్యారు. జగన్ సర్కార్ కు చేతనైతే కొత్తగా సంస్థలు ఏర్పాటు చేసి మీ పేరు పెట్టుకోండంటూ నిప్పులు చెరిగారు.
జగన్ సర్కార్ దివాళాకోరు తనానికి ఈ పేరు మార్పు నిదర్శనమని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైద్య విద్యకు ప్రత్యేక విశ్వవిద్యాలయం ఉండాలనే సంకల్పంతో 1986లో అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్ ఈ వర్శిటీని ఏర్పాటు చేశారని అన్నారు. ఎన్టీఆర్ మరణానంతరం ఆయన జ్ఞాపకార్థం 1998లో తమ ప్రభుత్వం ఈ సంస్థకు ఎన్టీఆర్ పేరు పెట్టినట్లు తెలిపారు. జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న హెల్త్ వర్శిటీ పేరును 36 ఏళ్ల తర్వాత ఎన్టీఆర్ పేరు తొలగించి వైఎస్సార్ పేరు పెట్టడం అర్థరహితమని దుయ్యబట్టారు. జగన్ ఏ ఆత్మతో మాట్లాడి ఎన్టీఆర్ వర్శిటీ పేరు మార్పు నిర్ణయం తీసుకున్నారో అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఎద్దేవా చేశారు. తెలుగుజాతి మొత్తం బాధపడే నిర్ణయం జగన్ తీసుకున్నారని విమర్శించారు. ‘మేం అధికారంలోకి వచ్చాక ఇదీ రీతిలో అన్ని పేర్లు మార్చేస్తే పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించుకోండని లోకేశ్ హెచ్చరించారు.
ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు స్పందిస్తూ.. వ్యక్తుల పేర్లు మార్చగలరు కానీ.. చరిత్రను మార్చలేరన్నారు. ఎన్టీఆర్ పేరును హెల్త్ వర్శిటీకి తొలగించడాన్ని వ్యతిరేకిస్తూ టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమ గొల్లపూడిలోని ఎన్టీఆర్ సర్కిల్లో ధర్నా చేశారు. ఎన్టీఆర్ హెల్త్ వర్శిటీకి వైఎస్సార్ పేరు పెట్టే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని సీఎం జగన్ కు గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కోరారు. హెల్త్ వర్శిటీకి ఎన్టీఆర్ పేరు తొలగించడం జగన్ రెడ్డి తుగ్లక్ చర్య అని టీడీపీ ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఎన్టీఆర్ హెల్త్ వర్శిటీ పేరు మార్చి డాక్టర్ వైఎస్సార్ హెల్త్ వర్శిటీగా మారుస్తూ.. అసెంబ్లీలో సవరణ బిల్లు ప్రవేశపెట్టినప్పుడు అడ్డుకునేందుకు టీడీపీ సభ్యులు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. జగన్ సర్కార్ దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతోందంటూ అసెంబ్లీని అట్టుడికించారు. ఎన్టీర్ పేరు మార్చొద్దని, ఎన్టీఆర్ జోహార్ అంటూ సభలో నినాదాలు చేశారు. స్పీకర్ పోడియం వద్దకు వెళ్లి ఆందోళన చేశారు. హెల్త్ వర్శిటీకి ఎన్టీఆర్ పేరు తొలగించడాన్ని వ్యతిరేకిస్తూ ఏపీ అధికార భాషా సంఘం, తెలుగు ప్రాధికార సంఘం, హిందీ అకాడమీ అధ్యక్ష పదవుల నుంచి యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ తప్పుకున్నారు. తెలుగు గంగ ప్రాజెక్టుకు ఇప్పటి సీఎం జగన్ తండ్రి, అప్పటి సీఎం వైఎస్సార్ ‘ఎన్టీఆర్ తెలుగుగంగ ప్రాజెక్టు’గా పేరుపెట్టారని యార్లగడ్డ గుర్తుచేశారు.
ఎన్టీఆర్ హెల్త్ వర్శిటీ పేరును వైఎస్సార్ యూనివర్శిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ గా మార్చడంపై జనసేన అధినత పవన్ కళ్యాణ్ నిప్పులు చెరిగారు. పేర్లు మార్చి ఏం సాధిస్తారని ఆయన ప్రశ్నించారు. సంస్థల పేర్ల మార్పిడితో వివాదాలు సృష్టించాలని వైసీపీ సర్కార్ చూస్తోందని ఆరోపించారు. వర్శిటీ పేరు మార్చడానికి సహేతుక కారణాన్ని జగన్ రెడ్డి సర్కార్ వెల్లడించాలని పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు. వర్శిటీలో మెరుగు పరచాల్సిన మౌలిక వసతులను పక్కన పెట్టి.. పేరు మార్చడం సరికాదన్నారు. ఎన్టీఆర్ స్థానంలో వైఎస్సార్ పేరు వస్తే.. వర్శిటీలో వసతులు మెరుగవుతాయా? అని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. ఇక జగన్ సోదరి వైఎస్సార్ టీపీ అధినేత్రి షర్మిల కూడా ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ పేరు మార్చడాన్ని తప్పుపట్టారు. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చడం సరికాదని ఆమె విస్పష్టంగా పేర్కొన్నారు. పేరు మార్పు వల్ల యూనివర్సిటీ పవిత్రత దెబ్బతింటుందని షర్మిల అన్నారు.
ఇలా ఉండగా ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ పేరు మార్చడం అసెంబ్లీలో సవరణ బిల్లు ఆమోదించినంత తేలిక కాదని బెజవాడకు చెందిన వైద్య ప్రముఖుడు డాక్టర్ అమ్మన్న అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు ఉన్న ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ పేరు మార్పుపై యూజీసీ, ఇండియన్ మెడికల్ అసోసియేషన్(ఐఎంఏ)ల గుర్తింపు రావాల్సి ఉంటుందని, ఇందకు కనీసం నాలుగేళ్లు పడుతుందని ఆయన వివరించారు. ఒక పక్కన హెల్త్ వర్శిటీ నుంచి ఎన్టీఆర్ పేరు తొలగిస్తూనే.. మరో పక్కన చంద్రబాబు కంటే తానే ఎన్టీఆర్ కు ఎక్కువ గౌరవం ఇస్తానం’టూ జగన్ చెప్పడం ఈ ఏటి మేటి జోక్ లలో పెద్ద జోక్ అని సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.