ఏపీ, ఒడిశా ల మధ్య పంచాయితీ..
posted on Feb 12, 2021 @ 3:24PM
ఏపీ, ఒడిశా సరిహద్దు ప్రాంతాల్లో ఉన్న పలు గ్రామాల వివాదం సుప్రీం కోర్టు చేరింది.. ఆ గ్రామాలు తమవే నంటూ ఒడిశా , కాదు ఆ గ్రామాలు మావేనంటూ ఏపీ.. రెండు రాష్ట్రాలు పట్టుబట్టడంతో సుప్రీమ్ కోర్టు జోక్యం చేసుకుంది.. అయితే, ఏపీలో పంచాయతీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఈ గ్రామాల విషయంలో ఒడిశా రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. తమ గ్రామాల్లో ఏపీ ప్రభుత్వం పంచాయతీ ఎన్నికలు జరుపుతోందని, ఇది సుప్రీంకోర్టు ఆదేశాలకు విరుద్ధమని చెబుతూ కోర్టు ధిక్కరణ పిటిషన్ వేసింది ఒడిశా ప్రభుత్వం..
ఏపీ, ఒడిశా రాష్ట్రాల సరిహద్దు ప్రాంతంలోని కోరాపుట్ జిల్లాకు చెందిన మూడు పంచాయతీలను ఏపీ తనవిగా పేర్కొంటోందని, గంజాయ్ పదవర్ ను గంజాయ్ భద్ర అని, పట్టుసెనరీ ప్రాంతాన్ని పట్టుచెన్నూరుగా, ఫగలుసెనరీ ప్రాంతాన్ని పగులుచినేరుగా మార్చి ఆ ప్రాంతాల్లో ఏపీ పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తున్నారని ఒడిశా ఆరోపించింది. ఈ మూడు ప్రాంతాల్లో గతంలో తాము పంచాయతీ ఎన్నికలు జరిపామని ఒడిశా తన పిటిషన్ లో వివరించింది. అందుకు ఆధారాలను కూడా సమర్పించింది. కోర్టు ధిక్కరణ కింద చర్యలు తీసుకోవాలని, ఏపీ ఎస్ఈసీ, సీఎస్ ల వివరణ కోరాలని ఒడిశా ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది.
ఈ పిటిషన్ పై శుక్రవారం సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. ఈ పిటిషన్ ప్రతిని ఏపీ తరఫు న్యాయవాదికి అందించాలని జస్టిస్ ఎంఏ ఖాన్ విల్కర్ ధర్మాసనం తెలిపింది. ఆ పిటిషన్ పై వారంలోగా సమాధానం ఇవ్వాలని ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. అయితే శనివారం ఏపీలో జరిగే రెండో విడత ఎన్నికలపై ఎలాంటి ఆదేశాలు ఇవ్వడం లేదని స్పష్టం చేస్తూ, తదుపరి విచారణను ఈ నెల 19కి వాయిదా వేసింది.
ఇది ఇలా ఉండగా ఓట్ల కోసం పచ్చ కుల నేతలు రెచ్చగొట్టారని, తీరా చూస్తే ఆ గ్రామాలను ఏపీ తీసుకుందంటూ ఒడిశా శుక్రవారం సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిందని తెలిపారు. దీనిపై చంద్రబాబు ఏమంటారో అంటూ వైసిపి ఎంపీ విజయసాయి రెడ్డి ట్వీట్ చేశారు.