ఏపీకి చంద్రబాబే దిక్కు.. డీఎల్ రవీంద్రారెడ్డి

ఏపీకి చంద్రబాబే దిక్కు అంటూ వైసీపీ నాయకుడొకరు సంచలన వ్యాఖ్యలు చేశారు.ముఖ్యమంత్రి జగన్ సామాజిక వర్గానికీ, జగన్ సొంత జిల్లాకు చెందిన ఆ నాయకుడు చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి. ప్రస్తుత అస్తవ్యస్థ పరిస్థితి నుంచి ఏపీని గట్టెక్కించాలంటే చంద్రబాబే దిక్కు.. ఈ మాట అన్నది ఏ తెలుగుదేశం నాయకుడో కాదు.. సాక్షాత్తూ వైసీపీ నేత. రాయలసీమలో గుర్తింపు ఉన్న నాయకుడు డీఎల్ రవీంద్రారెడ్డి. ఔను డీఎల్ రవీందరారెడ్డి బుధవారం (డిసెంబర్ 21) కడపలో మీడియా సమావేశం పెట్టి మరీ సొంత పార్టీపైనా, పార్టీ అధినేతపైనా తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.

జగన్ పై విమర్శించడానికి ఆయన ఎంచుకున్న భాష.. వైసీపీ నాయకులలో వస్తున్న మార్పునకు తార్కానంగా చెప్పుకోవచ్చు. ఎక్కడా పరిధి మీరకుండానే జగన్ అవినీతిని ఎండగట్టారు. వైఎస్ రాజశేఖరరెడ్డి కుమారుడు ఇంత అవినీతిపరుడని అనుకోలేదని సున్నితంగానే అయినా నషాళానికి అంటేలా ఘాటుగా విమర్శించారు. ఇంత విమర్శలు గుప్పిస్తున్న తనను పార్టీ నుంచి బహిష్కరించడం వల్లే తాను ఇలా విమర్శలు గుప్పిస్తున్నానని అనుకుంటారో ఏమో అన్నట్లుగా తాను ఇప్పటికీ వైసీపీలోనే ఉన్నానని, వాళ్లేం తనను పార్టీ నుంచి తీసేయలేదనీ స్పష్టత ఇచ్చారు.

జగన్ అధికారం చేపట్టినప్పటి నుంచీ అవినీతి పాలనే సాగిస్తున్నారని దుయ్యబట్టారు. తమ పార్టీ   వచ్చే  ఎన్నికలలో సింగిల్ డిజిట్ స్థానాలలోనే గెలుస్తుందని జోస్యం చెప్పారు. 2019 ఎన్నికలకు ముందు తన ఇంటికి మనుషులను పంపి బతిమాలి పార్టీలో చేర్చుకున్నారని రివీల్ చేసిన డీఎల్ రవీంద్రారెడ్డి.. .జగన్ పాలన అవినీతి మయం అన్నారు. ఈ పార్టీలో ఉన్నందుకు తన మీద తనకే అసహ్యం వేస్తోందన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో చంద్రబాబు తప్ప మరెవరూ రాష్ట్రాన్ని కాపాడలేరని డీఎల్ రవీంద్రారెడ్డి అన్నారు. వైఎస్ వివేకా హత్య కేసులో ఒంటరి పోరు సాగిస్తున్న డాక్టర్ సునీత ధైర్యాన్ని అభినందించాల్సిందే అన్నారు.

జనవరి 3 నుంచీ వైఎస్ వివేకా హత్య కేసులో కీలక మార్పులు ఉంటాయని అన్నారు. గత ఎన్నికల ముందు తనను బతిమలాడి జగన్ పార్టీలో చేర్చుకున్నారనీ, ఆ సందర్బంగా ఎంతో ఆదర్శవంతంగా మాట్లాడారనీ డీఎల్ వివరించారు. తనకు తండ్రిని మించిన పేరు తెచ్చుకోవాలన్న ఆకాంక్ష తప్ప మరే కోరికలూ లేవని జగన్ అన్నారనీ, కానీ పాలన మొదలు పెట్టిన క్షణం నుంచీ జగన్ పాలన అంతా అవినీతేనని డీఎల్ విమర్శించారు. జనసేనాని నిజాయితీ పరుడే కానీ పాలనాదక్షత ఉందని తాను భావించడం లేదన్నారు. పవన్ కల్యాణ్ చంద్రబాబు కలిసి పని చేస్తే ఏపీకి మేలు జరుగుతుందన్నారు.