మా ఫిలిం ఛాంబర్ మాగావాలె..
posted on Jun 13, 2014 @ 4:05PM
రాష్ట్ర విభజనలో భాగంగా పీటముడిపడున్న ప్రభుత్వ శాఖలను, వాటిలో పనిచేసే ప్రభుత్వోద్యోగులను ఎలాగో అతికష్టం మీద రెండు రాష్ట్రాలకు మధ్య పంపకాలు అయ్యాయి. కానీ హైదరాబాదు కేంద్రంగా ఉన్న తెలుగు సినీ పరిశ్రమలో మాత్రం ఇంకా ఈ పంపకాలు జరగకపోవడంతో తెలంగాణా సినీ పరిశ్రమగా విడిపోయిన కొందరు మా మా ఫిలిం ఛాంబర్ మాగావాలె...అంటూ ఆంధ్రప్రదేశ్ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ భవనం ముందు ఈ రోజు గొడవకు దిగారు. వారు ఇప్పటికే తెలంగాణా ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ను ఏర్పాటు చేసుకొన్నారు. కానీ ఇంతవరకు అన్ని ప్రాంతాలకు కలిపి ఉమ్మడిగా ఉన్న ఆంధ్రప్రదేశ్ ఫిలిం ఛాంబర్ కార్యాలయ భవనంలో తమకు న్యాయంగా దక్కవలసిన వాటా తమకీయమని డిమాండ్ చేస్తూ ధర్నా చేసారు.
వారు విడిపోవాలని గట్టిగా పట్టుబడుతుంటే, కొద్ది రోజుల క్రితం ఇరుప్రాంతాలకు కలిపి కొత్తగా తెలుగు ఫిలిం ఛాంబర్ అనే మరో కొత్త సంస్థను ఏర్పాటు చేసారు. రాష్ట్రాలు విడిపోయినప్పటికీ ఒక రాష్ట్రంలో తీసిన సినిమాలు మరొక రాష్ట్రంలో విడుదల చేయాలంటే, అందుకు రెంటి మధ్య అనుసంధానంగా ఇటువంటి ఏర్పాటు అవసరమనే మంచి ఆలోచనతోనే దీనిని ఏర్పాటు చేసారు. కానీ దానితో తమకు ఎటువంటి సంబందమూ, అవసరమూ లేదని తెలంగాణకు చెందిన కొందరు నిర్మాతలు, డిస్త్రిబ్యుటర్లు వాదిస్తున్నట్లు సమాచారం. ఈ నేపధ్యంలో ఇంకా ఒకే కార్యాలయంలో కలిసి పనిచేయడం అసాధ్యమని వారు వాదిస్తున్నారు. అందుకే ఆంధ్రప్రదేశ్ ఫిలిం ఛాంబర్ కార్యాలయ భవనంలో తమ వాటాగా రావలసిన భాగాన్ని తమకు అప్పగించాలని, లేకుంటే బలవంతంగానయినా ఆక్రమించుకొంటామని హెచ్చరించారు.
ఫిలిం ఛాంబర్ భవనంలో తెలంగాణా సినీ పరిశ్రమవారికి ఈయవలసిన భాగం పంచి ఇచ్చేయవచ్చును. కానీ ఇంత వ్యతిరేఖత ఎదుర్కొంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన తెలుగు సినీ పరిశ్రమ ఎంతోకాలం హైదరాబాదుని అంటిపెట్టుకొని ఉండటం కష్టమే. తెలంగాణా ఉద్యమాలు జరుగుతున్నంత కాలం, సినీ పరిశ్రమ చాలా కష్టాలు ఎదుర్కొంది. చాలా తీవ్రంగా నష్టపోయింది. అయినప్పటికీ అక్కడే కొనసాగుతోంది.
మా అధ్యక్షుడు మురళీ మోహన్ మాట్లాడుతూ “మద్రాసు నుండి హైదరాబాద్ కు సినీ పరిశ్రమ తరలి వచ్చి స్థిరపడిందనుకొంటున్న సమయంలో ఈ సమస్య రావడం దురదృష్టం. ఇప్పటికిప్పుడు హైదరాబాదు నుండి వేరే చోటకు సినీ పరిశ్రమను తరలించడం చాలా కష్టం. అందువల్ల కొన్ని సమస్యలు ఎదురయినా ఇక్కడే కొనసాగుతాము. ఇరు ప్రభుత్వాలు కూడా తెలుగు సినీ పరిశ్రమకు పూర్తి సహకారం అందింస్తాయని ఆశిస్తున్నాము,” అని అన్నారు.
హైదరాబాదులో అనేక ఫిలిం మరియు రికార్డింగ్ స్టూడియోలు, ల్యాబులు, చిత్ర నిర్మాణానికి అవసరమయిన సామాగ్రీ, సాంకేతిక నిపుణులు, జూనియర్ ఆర్టిస్టులు వగైరా అన్నీలభ్యమవుతాయి. అందువల్ల కొన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ సినీ పరిశ్రమ హైదరాబాదులోనే కొనసాగక తప్పదు. కానీ, చేతులు కాలేక ఆకులు పట్టుకోవడం కంటే ముండే మేల్కోవడం మేలని ఇప్పటికే ఒకసారి తెలిసి వచ్చింది. కనుక సినీ పరిశ్రమను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనువయిన ప్రాంతానికి తరలించేందుకు ఇప్పటి నుండే మెల్లగా ఏర్పాట్లు చేసుకొనట్లయితే, రాజధాని విషయంలో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇబ్బందులు పడుతున్నట్లుగా సినీ పరిశ్రమ ఇబ్బందులు పడకుండా తప్పించుకోవచ్చును. సినీ పరిశ్రమ నుండి వచ్చిన మురళీ మోహన్, బాలకృష్ణ వంటివారు స్వయంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఉన్నారు గనుక వారే చొరవ తీసుకొని పరిశ్రమకు కావలసిన సౌకర్యాలన్నిటినీ కల్పించేందుకు కృషి చేస్తే బాగుంటుంది.