ఏపీ మంత్రుల లాబీయింగ్ పురాణం!
posted on Jul 19, 2014 @ 7:05PM
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృషి, ప్రధానమంత్రి నరేంద్రమోడీకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద వున్న ప్రత్యేక శ్రద్ధ కారణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అనేక విద్యా సంస్థలు, పరిశ్రమలు మంజూరు అయ్యాయి. ఆయా విద్యా సంస్థలను, పరిశ్రమలను రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలలో ఏర్పాటు చేయడం ద్వారా అభివృద్ధిని వికేంద్రీకరించాలని, రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలూ సమానంగా అభివృద్ధి చెందేలా చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆలోచిస్తున్నారు. అయితే చంద్రబాబు నాయుడి మంత్రివర్గంలోని వారు మాత్రం అలాంటి విశాల దృక్పథం ప్రదర్శించకుండా తాము తమ ప్రాంత అభివృద్ధికే ప్రాధాన్యమిస్తున్నారన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
ప్రతిష్ఠాత్మకమైన పెట్రోలియం యూనివర్సిటీని కాకినాడలో ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆలోచిస్తున్నారు. అయితే ఈ విశ్వవిద్యాలయలన్ని తమ జిల్లాకు తన్నుకుపోవాలని తూర్పు గోదావరి జిల్లాకు చెందిన మంత్రి యనమల రామకృష్ణుడు, విశాఖ జిల్లాకు చెందిన మంత్రి గంటా శ్రీనివాసరావు పట్టువదలని విక్రమార్కుల్లాగా ప్రయత్నాలు చేస్తూనే వున్నారు.
కేంద్రం ప్రతిపాదించిన కేంద్రీయ వ్యవసాయ విశ్వవిద్యాలయాన్ని గుంటూరు జిల్లాలలోనే ఏర్పాటు చేయాలని వ్యవసాయ శాఖ మంత్రి పత్తిపాటి పుల్లారావు గట్టి పట్టుదల మీద వున్నారు. వేరే మంత్రులు ఎవరైనా వ్యవసాయ విశ్వవిద్యాలయం మీద కర్చీఫ్ వేస్తే ఆయన ఎంతమాత్రం సహించేట్టు లేరు.
కేంద్రం ఆంధ్రప్రదేశ్‌కి మంజూరు చేసిన ఎయిమ్స్.ని గుంటూరు - విజయవాడ మధ్యలో వున్న మంగళగిరిలో ఏర్పాటు చేస్తే బాగుంటుందన్న అభిప్రాయం అందరిలోనూ వ్యక్తమవుతోంది. ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాసరావు మాత్రం ఎయిమ్స్.ని తాను ప్రాతినిధ్యం వహిస్తున్న కృష్ణాజిల్లాకు తరలించుకుపోవాలని ముమ్మరంగా లాబీయింగ్ చేస్తున్నారు.
తిరుపతిలో ఐఐటీ ఏర్పాటు చేయాలని చంద్రబాబు భావిస్తున్నారు. అయితే పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు ఐఐటీ మా నియోజకవర్గంలో పెట్టాంటే మా నియోజకవర్గంలో పెట్టాలని చంద్రబాబు మీద వత్తిడి పెంచుతున్నారు. అలాగే నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్ఐటీ)ని కర్నూలు జిల్లాకి ఇచ్చి తీరాల్సందేనన్న పట్టుదలను ఉప ముఖ్యమంత్రి కె.ఇ.కృష్ణమూర్తి ప్రదర్శిస్తున్నట్టు తెలుస్తోంది. ఇక రాయలసీమకే చెందిన మరో మంత్రి పరిటాల సునీల అనంతపురాన్ని రాష్ట్రానికి రెండో రాజధాని చేసితీరాలని నినదిస్తున్నారు.
అనంతపురం జిల్లాకే చెందిన ఐటీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి తన జిల్లాకు భారీ సంఖ్యలో ఐటీ కంపెనీలను తరలించుకువెళ్ళే ప్రయత్నాలు భారీ స్థాయిలో చేస్తున్నారు. ఇక రాష్ట్రమంతటా అమలు చేసే ఎన్టీఆర్ సుజల స్రవంతి పథకం మొట్టమొదటగా హిందూపురం నియోజకవర్గంలోనే అమలు చేసే విషయంలో నందమూరి బాలకృష్ణ సక్సెస్ అయ్యారు. ప్రభుత్వంలో ఇలా లాబీయింగ్ చేయగలిగినవారు తమ ప్రాంతానికి ఏమేం కావాలో సాధించుకునే ప్రయత్నాలు చేస్తుంటే, తమ ప్రాంతానికి కావలసిన వాటిని డిమాండ్ చేసి సాధించుకునే శక్తిలేని మంత్రులు, ఎమ్మెల్యేలు ఏం చేయాలో అర్థం కాక మథనపడిపోతున్నారు.
ఏది ఏమైనప్పటికీ ఎంతో అభివృద్ధి జరగాల్సి వున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మంత్రులు ఎవరి ప్రాంతం గురించి వాళ్ళు ఆలోచించుకోవడం కాకుండా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలనూ సమదృష్టితో చూస్తే బాగుంటుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లాబీయింగ్‌లకు ఫుల్‌స్టాప్ పెట్టి అన్ని ప్రాంతాల్లోనూ సమాన అభివృద్ధి జరిగేలా చూస్తే బాగుంటుందన్న ఆకాంక్షలూ వినిపిస్తున్నాయి.