‘రాజధాని ఫైల్స్’ లక్ష్యం నెరవేరింది!
posted on Jun 11, 2024 @ 4:07PM
‘‘మనది ప్రజా ప్రభుత్వం.. ఇకపైన మన ప్రభుత్వంలో ప్రజావేదికలా కూల్చివేతలుండవు. మూడు రాజధానులంటూ రాష్ట్ర భవిష్యత్తుతో ఆటలాడే పరిస్థితి వుండదు. మన రాజధాని అమరావతి. అమరావతే రాజధాని’’ అని తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు ప్రకటించడంతో వేలాదిమంది రాజధాని రైతుల హృదయాలు ఆనందంతో ఉప్పొంగాయి. ప్రజాకంటక జగన్ ప్రభుత్వం ప్రజా సునామీకి కొట్టుకుపోవడంతోనే అమరావతి ప్రాంతంలో ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి. ఇప్పటివరకూ గాఢాంధకారంలో వున్న అమరావతి ప్రాంతం ఇప్పుడు గ్రహణం తొలగినట్టుగా చిమ్మచీకటి వేళలో కూడా పట్టపగటిని తలపించేలా వెలిగిపోతోంది. మంగళవారం నాడు ఎన్డీయే కూటమి ఎమ్మెల్యేల సమావేశంలో ‘మన రాజధాని అమరావతి.. అమరావతే రాజధాని’ అంటూ చంద్రబాబు చెప్పిన మాటలు తెలుగు ప్రజలలో ఉత్సాహాన్ని మరింత పెంచాయి. ఇక అమరావతిని ఎవరూ కదిలించలేరన్న దృఢ నిశ్చయం, పటిష్ట సంకల్పం సైతం చంద్రబాబు మాటల్లో వినిపించాయి.
ఈరోజు కోసమే.. ఈ శుభవార్తని రాజధాని ప్రాంత రైతులందరూ వినడం కోసమే ‘తెలుగువన్’ అధినేత కంఠంనేని రవిశంకర్ ‘రాజధాని ఫైల్స్’ చిత్రాన్ని నిర్మించారు. ఏ లక్ష్యాన్ని ఆశించి ఆయన ఆ సినిమా రూపొందించారో, ఈరోజు చంద్రబాబు నాయుడి ప్రకటనతో ఆ లక్ష్యం నెరవేరిందని భావించవచ్చు. చంద్రబాబు నాయుడు మీద నమ్మకంతో రాజధాని కోసం 33 వేల ఎకరాల భూములను ఇచ్చి, ఆ తర్వాత జగన్ ప్రభుత్వం చేత ఎన్నో అవమానాలను ఎదుర్కొన్న పరిస్థితులను, వారు చేసిన అలుపెరుగని పోరాటాన్ని అద్దం పట్టేలా ‘రాజధాని ఫైల్స్’ చిత్రం రూపొందింది. చిత్ర నిర్మాణ సమయంలోనూ, చిత్రం విడుదల సమయంలోనూ ‘రాజధాని ఫైల్స్’ జగన్ ప్రభుత్వం నుంచి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంది. అయినప్పటికీ, నిర్మాత కంఠంనేని రవిశంకర్ వెనకడుగు వేసేదే లేదంటూ ముందుకు వెళ్ళారు. ‘రాజధాని ఫైల్స్’ని విజయవంతంగా విడుదల చేశారు. రాజధాని రైతుల నుంచి మాత్రమే కాదు.. సినిమా చూసిన ప్రేక్షకులందరి నుంచి మంచి సినిమా తీశారనే ప్రశంసలు అందుకున్నారు. అమరావతిని రాజధానిగా నిలపడానికి చంద్రబాబు నాయుడు చేసిన మహా యజ్ఞంలో ‘నేను సైతం సమిధనొక్కటి ధారపోశాను’ అన్నట్టుగా కంఠంనేని రవిశంకర్ నిర్మించిన ‘రాజధాని ఫైల్స్’ సినిమా ఈరోజు యజ్ఞఫలాన్ని అందుకుంది.
ఒక అద్భుత నగరాన్ని ఆంధ్రజాతికి అందించాలని చంద్రబాబు దర్శించిన స్వప్నం త్వరలో నిజం కాబోతోంది. చంద్రబాబు నాయుడు నాయకత్వంతో, అతి తక్కువ కాలంలోనే అంతర్జాతీయ నగరంగా రూపొందే ‘అమరావతి మహానగరం’ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లోని ప్రతి ఒక్కరి ఊహల్లో మెదులుతోంది. ఆ అద్భుత నగరంలో ఎన్నో సినిమా థియేటర్లు భవిష్యత్తులో వస్తాయి. ఆ థియేటర్లన్నిటిలో మొట్టమొదటగా ప్రదర్శించే చిత్రం ‘రాజధాని ఫైల్స్’ అవుతుంది. ఈ మహానగరం రూపొందడానికి ఈ ప్రాంత రైతులు చేసిన త్యాగాలు, పోరాటాలను ‘రాజధాని ఫైల్స్’ సినిమా ద్వారా స్మరించుకుంటూ ఏ సినిమా థియేటర్ అయినా ప్రారంభం అవుతుంది. ఆ మహానగరంలోని మల్టీప్లెక్స్.లలో ‘రాజధాని ఫైల్స్’ చిత్రం మట్టి వాసనలా పరిమళిస్తుంది. త్యాగాల జ్ఞాపకాలను గుర్తుచేస్తుంది. ఈ మహానగరం నిర్మాణం కోసం తమ ముందు తరాలు చేసిన త్యాగాలను రాబోయే తరాలు తెలుసుకునేలా చేస్తుంది. ఇలాంటి అద్భుత నగరాన్ని ఒక దుష్టశక్తి, ఒక అహంభావి మృతనగరంలా మార్చడానికి ప్రయత్నించాడన్న వాస్తవాన్ని భవిష్యత్తు తరాలు తెలుసుకునేలా చేస్తుంది. ఏడాదికి ఒకసారి వచ్చే ‘అమరావతి డే’ రోజున అమరావతిలోని అన్ని థియేటర్లలో ‘రాజధాని ఫైల్స్’ చిత్రం ప్రదర్శితమవుతుంది. అద్భుతమైన భవిష్యత్తు వున్న అమరావతి నగరంలో ‘రాజధాని ఫైల్స్’ సినిమాకి కూడా శాశ్వత స్థానం వుంటుంది. ఇంత మంచి సినిమాని నిర్మించిన ‘కంఠంనేని రవిశంకర్’ పేరు వెండితెరమీద స్వర్ణకాంతులతో మెరుస్తుంది.