Read more!

భయాల స్వరూపాన్ని తెలిపే విశ్లేషణ!!

మనిషిని పిరికివాడిగా చేసేది, లక్ష్యాలకు దూరం చేసేది భయమే. మన భయాలు అర్థరహితం అని చెప్పేందుకు ఓ ప్రయోగం ఉంది. ఓ తరగతిలో టీచర్ చేసిన ప్రయోగం అది. కుర్చీల్లో కూర్చున్న విద్యార్థులను అందరినీ లేచి ఓ వైపు వచ్చి నిలబడమన్నాడు. ఆపై అందరినీ మరో వైపు కు పొమ్మన్నాడు. అడ్డుగా ఉన్న కుర్చీలను దాటుకుంటూ, ఆ వైపు చేరారు విద్యార్థులు. మళ్లీ ఈ వైపు రమ్మన్నాడు టీచర్. అయితే ఈ సారి విద్యార్థుల కళ్లకు గంతలు కట్టాడు. ఆపై నిశ్శబ్దంగా, గదిలో ఉన్న కుర్చీలు తీయించేశాడు. ఇప్పుడు మరో వైపు రమ్మన్నాడు.


ఒక్క విద్యార్థి కూడా కదలలేదు. "దారిలో కుర్చీలు, బల్లలు అడ్డుగా ఉన్నాయి. కళ్లకు గంతలు కట్టారు. వాటిని దాటుతూ ఆ వైపు రావటం కష్టం" అన్నారు. చివరికి ఓ విద్యార్థి ధైర్యంగా ముందుకు వచ్చాడు. తడబడుతూ, లేని టేబిళ్ల కోసం వెతుకుతూ అడుగులు వేయటం ఆరంభించాడు. అతడి వల్ల మరి కొందరు ముందుకు వచ్చారు. అయితే, చేతికి ఏమీ తగలకపోవటంతో సందిగ్ధంలో పడి సగంలో ఆగిపోయారు. అన్ని సందిగ్ధాలను మించి, లేని అడ్డంకులను దాటుకుంటూ, అడ్డేమీ లేదని నిర్ధారించుకుంటూ ఒక విద్యార్థి గమ్యం చేరాడు.


ఇదీ మనలో నాటుకుపోయిన భయాల స్వరూపం! అక్కడెమీ లేకున్నా లేని అనుమానాలతో ఏదో ఉందని తమని తాము మభ్యపెట్టుకునే వారు చాలామంది.


మనం ఏదైనా పని సాధించాలనుకోగానే ముందుగా సందేహాలు ముసురు కుంటాయి. ఆపై అడ్డంకులు గుర్తుకు వస్తాయి. దారిలోని అవరోధాలను స్మరిస్తాం. దాంతో అడుగు ముందుకు వేయం. ఆలోచన ఉంటుంది కానీ అది ఆచరణలోకి రాదు. ఒకవేళ ఆచరణ ఆరంభించినా, మొదటి ప్రతి బంధకంలోనే వెనక్కు తిరుగుతాం. ఎవరైతే ఆలోచనను ఆచరణలో పెట్టటమే కాదు, ప్రతిబంధకాలన్నీ ఊహాత్మకమైనవే తప్ప నిజమైనవి కావు అని గ్రహించి గమ్యం వైపు సాగిపోతారో, వారు తమ గమ్యం చేరుతారు లక్ష్యాన్ని సాధిస్తారు. అందుకే మన పూర్వికులు మనుషులను మూడు రకాలుగా వర్గీకరించారు.


'ఆరంభించరు నీచమానవులు' అన్నారు..


ఎవరైతే ఏదైనా పని చేయాలనుకోగానే, రకరకాల అవరోధాలను ఊహించి, అడ్డంకులను చూసి భయపడుతూ పని ఆరంభించనే ఆరంభించరో వారు అధమస్థాయి మానవులు. ప్రగల్భాలు పలుకుతూ, తాము చేయగల పనులు సాధించగల గొప్ప లక్ష్యాల గురించి మాటలు మాట్లాడతారు తప్ప చేతల దగ్గరకు వచ్చేసరికి అడుగు ముందుకు పడదు. తాము అడుగు ముందుకు వేయకపోవటమే కాదు ఇతరులనూ అడుగు ముందుకు వేయనీయరు వీరు. అందుకే వీరు నీచమానవులయ్యారు.


ఇక్కడ 'నీచం' అంటే 'చెడు' అని కాదు. 'నీచులు' అంటే నేరస్థులు, హంతకులు, మోసగాళ్లు కారు. వారి కన్నా తక్కువస్థాయి వారు వీరు. ఎందుకంటే ప్రతివ్యక్తికీ కర్తవ్యపాలన తప్పని సరిగా పాటించవలసిన ధర్మం అని భగవంతుడు నిర్దేశించాడు. అది సాధించదగ్గదా, అందుబాటులో ఉన్నదా అన్నది కాదు ముఖ్యం. కర్తవ్య నిర్వహణ ముఖ్యం. అటువంటి కర్తవ్యనిర్వహణను విస్మరించే వారంతా నీచులే. వారు ధనవంతులు కావచ్చు, విజ్ఞానవంతులు కావచ్చు. నాయకులు కావచ్చు. ఇంకెవరైనా కావచ్చు. స్వధర్మాన్ని పాటించకుండా, కర్తవ్యనిర్వహణను విస్మరిస్తే వారు నీచులే అవుతారు.


ఇలా మనుషుల్లో మొదటి రకం వారు నీచులుగా గుర్తించబడ్డారు.


                                    ◆నిశ్శబ్ద.