18న తెలంగాణలో అమిత్ షా ఎన్నికల ప్రచారం
posted on Nov 15, 2023 @ 10:40AM
కేంద్ర హోంశాఖ మంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా తెలంగాణ పర్యటన షెడ్యూల్ ఖరారైంది. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కేంద్రమంత్రులు, బీజేపీ అగ్రనేతలు తెలంగాణలో ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా అమిత్ షా తెలంగాణకు రానున్నారు. అదే రోజున సోమాజిగూడలోని బీజేపీ మీడియా సెంటర్‌లో తెలంగాణ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేస్తారు. ఆ తర్వాత నల్గొండ, వరంగల్, గద్వాల, రాజేంద్రనగర్‌లలో నిర్వహించే సభలలో పాల్గొంటారు. ఈ మేరకు బీజేపీ వర్గాలు వెల్లడించాయి.
తెలంగాణలో అధికారమే లక్ష్యంగా బీజేపీ ఎన్నికల ప్రచారంలో జోరు పెంచింది. అగ్రనేతలను ప్రచార బరిలోకి దింపుతోంది. దీపావళి పండుగ తర్వాత ప్రచారాన్ని ఉధృతం చేస్తామని బీజేపీ ఇప్పటికే చెప్పింది. అందులో భాగంగానే అమిత్ షా ఈనెల 18 తెలంగాణలో ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. నిజానికి 17న అమిత్ షా తెలంగాణకు రావాల్సి ఉండగా ఒకరోజు ఆలస్యంగా షెడ్యూల్‌లో మార్పులు చోటు చేసుకున్నాయి. ఒకేరోజు నాలుగు ప్రాంతాల్లో సభలు, రోడ్‌షోలతో కేంద్ర హోంమంత్రి పాల్గొననున్నారు. 18న ఉదయం 9 గంటల ప్రాంతంలో హైదరాబాద్‌కు చేరుకోనున్న అమిత్ షా అక్కడి నుంచి గద్వాలలో, నల్గొండ సభల్లో, వరంగల్ తూర్పు నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి తరపున ప్రచారం చేయనున్నారు. అదే రోజు హైదరాబాద్‌కు చేరుకుని జీహెచ్ఎంసీ పరిధిలోని రాజేంద్రనగర్ నియోజకవర్గంలో అమిత్ షా రోడ్ షో నిర్వహించనున్నారు. సాయంత్రం ఢిల్లీకి తిరుగు ప్రయాణం కానున్నారు. ఎన్నికల ప్రచార సభలు, రోడ్ షోలతో బీజేపీ స్పీడ్ పెంచింది.