అప్పాయింట్ మెంట్ అడగలేదు.. కిషన్ రెడ్డితో కబురుపంపిస్తేనే అమిత్ షానుకలిశా.. లోకేష్ స్పష్టీకరణ
posted on Oct 12, 2023 @ 5:01PM
అమిత్ షాతో భేటీ నేపథ్యాన్ని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ మీడియాకు వెళ్లడించారు. తాను అమిత్ షాను అప్పాయింట్ మెంట్ కోరలేదనీ, ఆయన పిలుపు మేరకే వెళ్లి కలిశాననీ స్పష్టం చేశారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి తనకు ఫోన్ చేసి అమిత్ షా తనను కలవాలని అనుకుంటున్నారని చెప్పారని ఆయన వివరించారు.
హస్తినలో గురువారం (అక్టోబర్ 12) మధ్యాహ్నం మీడియాతో మాట్లాడిన లోకేష్.. అమిత్ షాతో భేటీలో జగన్ సర్కార్ అరాచకాలను వివరించినట్లు తెలిపారు. అంతే కాకుండా చంద్రబాబు అక్రమ అరెస్టు, తనపై కేసుల పేరుతో వేధింపులు సహా అన్ని విషయాలనూ వివరించానని లోకేష్ అన్నారు.
చంద్రబాబుకు జైల్లో భద్రత విషయంపై తమ ఆందోళనను అమిత్ షాకు తెలియజేసినట్లు చెప్పిన లోకేష్ ఈ సందర్భంగా తనను సీఐడీ ఎందుకు విచారణకు పిలిచిందీ, ఎన్నికేసులు పెట్టింది వంటి వివరాలు అడిగారన్నారు.