గ్రేటర్ ఎన్నికల్లో అమరావతి ప్రభావం! కొన్ని పార్టీలకు టెన్షన్
posted on Nov 28, 2020 @ 8:05PM
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశం కీలకంగా మారిందా? అమరావతి అంశమే గెలుపోటములను ప్రభావితం చేయబోతోందా? అంటే అవుననే తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై తెలంగాణలో పెద్దగా చర్చ జరగకపోయినా.. తెలంగాణ రాజధాని హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో మాత్రం ఆంధ్రప్రదేశ్ అంశాలు ప్రచారాస్త్రాలుగా మారాయి. గ్రేటర్ హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో అమరావతి అంశం చుట్టే రాజకీయాలు తిరుగుతున్నాయి. అమరావతి అంశం ఇప్పుడు కొన్ని పార్టీలను షేక్ చేస్తుందని చెబుతున్నారు.
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో సీమాంధ్రులు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో రాజధాని అమరావతి అంశమే ప్రభావితం చూపిస్తోంది. ముఖ్యంగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ నేతలకు అమరావతి అంశం ఎక్కువగా ఇబ్బంది పెడుతోంది. కూకట్ పల్లి, శేరిలింగం పల్లి, ఏఎస్ రావు నగర్, సనత్ నగర్, దిల్ షుక్ నగర్, వనస్థలిపురం ప్రాంతాల్లో.. ఓట్ల కోసం తమ దగ్గరకు వస్తున్న బీజేపీ నేతలను అమరావతి పై ప్రశ్నిస్తున్నారట ఆంధ్రా ఓటర్లు. అమరావతే ఏపీ రాజధానిగా ఉండాలనే విషయంలో బీజేపీ స్టాండ్ ఏంటో చెప్పాలని కోరుతున్నారట. అమరావతి నిర్మాణ శంకుస్థాపన ప్రధాని మోడీ చేతుల మీదుగానే జరిగింది. కాని ఇప్పుడు అమరావతిని మార్చే ప్రయత్నాలు జరుగుతున్నా బీజేపీ ఎందుకు స్పందించడం లేదు. ఏపీ బీజేపీ నేతలు అమరావతికి మద్దతుగా ప్రకటనలు చేస్తున్నా... కేంద్ర సర్కార్ మాత్రం రాజధాని అంశం రాష్ట్ర పరిధిలోకి వస్తుందంటూ కోర్టుల్లో అఫిడవిట్లు వేస్తోంది. దీనిపై ఆంధ్రా ఓటర్లలో ఆగ్రహం వ్యక్తమవుతోందని తెలుస్తోంది.
తమ దగ్గరకు ఓట్ల కోసం వచ్చే బీజేపీ నేతలను అమరావతి పై సూటిగానే ప్రశ్నిస్తున్నారు సీమాంధ్ర ఓటర్లు. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతే ఉంటుందని ప్రధాని మోడీ ప్రకటన చేస్తే తామంతా గంప గుత్తగా ఓట్లు వేస్తామని బీజేపీ నేతలకు చెబుతున్నట్లు తెలుస్తోంది. ఆంధ్రా ఓటర్లు అడుగుతున్న ప్రశ్నలకు సమాధానం చెప్పలేక కమలనాధులు ముఖం చాటేస్తున్నారని చెబుతున్నారు. గ్రేటర్ లో ప్రచారానికి వచ్చిన ఏపీ బీజేపీ నేతలను కొందరు ఓటర్లు అమరావతిపై గట్టిగానే ప్రశ్నించినట్లు తెలుస్తోంది. తాము కూడా అమరావతికి మద్దతుగానే ఉన్నామని, కేంద్ర సర్కార్ నిర్ణయానికి తమకు సంబంధం లేదని కొందరు బీజేపీ నేతలు నచ్చచెప్పే ప్రయత్నాలు చేస్తున్నారట. అయితే అమరావతి మద్దతుగా కేంద్రం నుంచి ప్రకటన వస్తేనే తాము సపోర్ట్ చేస్తామని కొందరు సెటిలర్ ఓటర్లు కమలం నేతల ముఖాల మీదనే నేరుగా చెప్పేసినట్లు చెబుతన్నారు.
నిజానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో సెటిలర్లు తమకు మద్దతుగా నిలుస్తారని బీజేపీ భావించింది. అయితే ప్రచారంలో తమకు ఎదురవుతున్న అనుభవాలతో వారంతా ఇప్పుడు ఆందోళన చెందుతున్నారని తెలుస్తోంది. సీమాంధ్ర ఓటర్ల నుంచి వస్తున్న స్పందనను కొందరు అభ్యర్థులు పార్టీ ముఖ్య నేతలకు చెప్పారట. అమరావతికి అనుకూలంగా పోలింగ్ లోపు ప్రకటన చేస్తే పార్టీకి భారీగా ప్రయోజనం ఉంటుందని కూడా చెప్పారట. కాని అది కేంద్రం పరిధిలోని అంశం కావడంతో తాము ఏమి చేయలేకపోతున్నామని తెలంగాణ బీజేపీ నేతలు అభ్యర్థులకు చెప్పినట్లు తెలుస్తోంది. దీంతో అమరావతి అంశం తమ కొంప ముంచేటట్టు ఉందనే ఆందోళన సెటిలర్లు ఎక్కువగా ఉండే డివిజన్లలో పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థుల్లో పెరుగుతుందని తెలుస్తోంది.
అమరావతి అంశం కీలకంగా మారడంతో టీఆర్ఎస్ కూడా దానిపై ఫోకస్ చేసింది. ఎన్నికల ప్రచారంలో, ఆత్మీయ సమావేశాల్లో మాట్లాడుతున్న మున్సిపల్ శాఖా మంత్రి కేటీఆర్.. కేంద్రాన్నివిమర్శిస్తూ ఏపీ అంశాలను ప్రస్తావిస్తున్నారు. గత ఏరేండ్లుగా మోడీ సర్కార్ తెలంగాణకు ఏమి ఇవ్వలేదని ఆరోపిస్తూ.. అమరావతి నిర్మాణానికి కూడా చిల్ల గవ్వ ఇవ్వలేదని విమర్శిస్తున్నారు.అమరావతి శంకుస్థాపనకు వచ్చిన ప్రధాని మోడీ తట్టెడు మట్టి.. చెంబెడు నీళ్లు ఇచ్చి చేతులు దులుపుకున్నారని ఆరోపిస్తున్నారు. సీమాంధ్రుల ఓట్ల కోసమే కేటీఆర్ ఈ తరహా ప్రచారం చేస్తున్నారనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. మొత్తానికి ఏపీ రాజధాని అమరావతి అంశంపై గుర్రుగా ఉన్న సెటిలర్లు.. గ్రేటర్ ఎన్నికల్లో ఎటువైపు మొగ్గుతారన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది. సెటిలర్ల ఓట్ల ప్రభావం దాదాపు 40 డివిజన్లలో ఉండటంతో.. వారి స్టాండ్ ఏంటో తెలియక పార్టీలు కూడా కలవరపడుతున్నట్లు తెలుస్తోంది. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో సెటిలర్లు ఎలాంటి తీర్పు ఇస్తారో చూడాలి మరీ..