పుష్ప2 విడుదలకు క్వాష్ పిటిషన్ తో కష్టాలను కొనితెచ్చుకున్న అల్లు అర్జున్?

అల్లు అర్జున్ హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేశారు. ఏపీ ఎన్నికల సమయంలో తన నంద్యాల పర్యటేన సందర్భంగా తనపైన నమోదైన కేసును క్వాష్‌ చేయాలని కోరుతూ అల్లు అర్జున్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ ను హైకోర్టు విచారణకు స్వీకరించింది. రేపు విచారణకు వచ్చే అవకాశం ఉంది.

ఇంతకీ అల్లు అర్జున్ పై నమోదైన కేసు ఏమిటంటే... నంద్యాల వైసీపీ అభ్యర్థి శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డికి మద్దతుగా ఎన్నికల వేళ అల్లు అర్జున్ ఆయన నివాసానికి వెళ్లారు. ఆ సందర్భంగా ఒక రోడ్ షో కూడా నిర్వహించారు. అయితే ఎన్నికల వేళ పోలీసు ఆంక్షలను ధిక్కరించి అనుమతి లేకుండా రోడ్ షో నిర్వహించినందుకు నంద్యాల పోలీసులు కేసు నమోదు చేశారు. అల్లు అర్జున్ తో పాటు శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డిపైనా కేసు నమోదైంది. ఆ కేసునే క్వాష్ చేయాలంటూ అల్లు అర్జున్ ఇప్పుడు హైకోర్టును ఆశ్రయించారు.   

అప్పట్లో అల్లు అర్జున్ నంద్యాల పర్యటన వివాదాస్పదంగా మారిన సంగతి తెలిసిందే. మెగా అభిమానులంతా తెలుగుదేశం కూటమికి మద్దతుగా నిలిచిన వేళ, జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్వయంగా కూటమి తరఫున జనసేన అభ్యర్థిగా పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. దాదాపు మెగా ఫ్యామిలీ అంతా పవన్ కల్యాణ్ కు మద్దతుగా నిలిచింది. అటువంటి తరుణంలో తెలుగుదేశం కూటమి ప్రత్యర్థి పార్టీ అయిన వైసీపీ అభ్యర్థికి అల్లు అర్జున్ మద్దతు ప్రకటించడం, ర్యాలీ నిర్వహించడం సంచలనం సృష్టించింది. దీనిపై మెగా బ్రదర్, జనసేన నాయకుడు నాగబాబు సోషల్ మీడియా వేదికగా స్పందించారు. మెగా అభిమానులు అల్లు అర్జున్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పుష్ప2 సినిమాపై వారి ఆగ్రహం ప్రభావం తప్పకుండా పడుతుందన్న అభిప్రాయం కూడా అప్పట్లో వ్యక్తమైంది. ఇప్పుడిప్పుడే ఆ ఆగ్రహం చల్లారుతోంది. పైగా నంద్యాలలో అల్లు అర్జున్ పై నమోదైనది చాలా చిన్న కేసు. పెద్దగా శిక్ష పడే అవకాశం ఉన్నది కూడా లేదు. అసలా కేసు   పురోగతి ఎలా ఉందో కూడా ఎవరికీ తెలియదు.

అటువంటి సమయంలో ఇప్పుడు హఠాత్తుగా అదీ పుష్ప 2 రిలీజ్ కు ముందు ఆ కేసును క్వాష్ చేయాలంటూ అల్లు అర్జున్ హైకోర్టును ఆశ్రయించడం కచ్చితంగా మెగాభిమానుల పాత గాయాలను కెలకడమే అవుతుంది. అల్లు అర్జున్ తన క్వాష్ పిటిషన్ ద్వారా పుష్ప2 రిలీజ్ ముందు  అనవసరంగా ఇబ్బందులను కొని తెచ్చుకున్నారన్న భావన ఆయన అభిమానులలోనే వ్యక్తం అవుతుంది.