పార్టీలు వేరైనా.. ఒకరి కోసం ఒకరు.. కోమటిరెడ్డి బ్రదర్స్ స్టైలే వేరు!
posted on Sep 8, 2022 @ 11:40AM
ఏదో లబ్ధిని ఆశించి రక్త సంబధీకులే ప్రత్యర్థులుగా మారిపోవడం, భార్యాభర్తలే బద్ధ శత్రువుల్లా నటించడం కొత్తేం కాదు. లాండ్ సీలింగ్ చట్టం వచ్చినప్పుడు ఆస్తులను కాపాడుకోవడానికి భార్యా భర్తలు కోర్టు ద్వారా విడాకులు పొంది.. ఆస్తులను కాపాడుకుని హాయిగా కలిసి జీవించిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. అలాగే రాజకీయాలలో కూడా అన్నదమ్ములు, అక్క చెల్లెళ్లు, ఆఖరికి భార్యా భర్తలూ కూడా వేరు వేరు పార్టీల తరఫున పోటీ చేసి పరస్పరం విమర్శలు గుప్పించుకున్న ఘట్టాలు బోలెడు.
కానీ మునుగోడు ఉప ఎన్నిక విషయంలొ కోమటిరెడ్డి బ్రదర్స్ స్టైలే వేరు. ఇరువురూ నిన్నటి వరకూ ఒకే పార్టీ.. ఒకే మాట. అపూర్వ సహోదరులుగా కలిసే ఉన్నారు. సరే కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వంపై అసంతృప్తో, పీసీసీ పదవి దక్కలేదన్న అక్కసో ఇరువురూ కూడా గత కొంత కాలం నుంచీ సొంత పార్టీపై విమర్శలు గుప్పిస్తూ వచ్చారు. కాంగ్రెస్ పార్టీ కనుక అదేం పెద్ద వింత కాదు. కానీ రాజగోపాలరెడ్డి మాత్రం ఒక అడుగు ముందుకు వేసి కమలం పార్టీ పంచన చేరారు. తాను ప్రాతినిథ్యం వహిస్తున్న మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నిక వచ్చేలా శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేసి బీజేపీ అభ్యర్థిగా రంగంలోకి దిగుతున్నారు.
మరి ఆయన అన్నగారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఏం చేస్తున్నారు.. ఆయన కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు. అయినా మునుగోడుతో తనకేం సంబంధం లేదని ప్రకటించేశారు. మునుగోడు ప్రచారానికి వెళ్లేది లేదని శపథం చేశారు. అంతే కాదు..తన , తన తమ్ముడిపై అవమానకరంగా వ్యాఖ్యలు చేసిన రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అదలా ఉంచితే తాజాగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి పార్టీ గెలుపు కోసం కృషి చేస్తారా? లేదంటే తమ్ముడికే జైకొడుతారా? అనే దానిపై పరిశీలకులు పలు రకాల విశ్లేషణలు చేశారు. కాంగ్రెస్ పార్టీలోనే పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి. అయితే వెంకటరెడ్డి వాటన్నిటినీ నిర్ద్వంద్వంగా ఖండించేశారు.
తాను కాంగ్రెస్ వాడిననీ, పార్టీ కోసం ఏమైన చేస్తాననీ ప్రకటనలు గుప్పించారు. మధ్యలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలవడంపై వెంకటరెడ్డిపై కాంగ్రెస్ నాయకులు ఓ రేంజ్ లో విమర్శలు గుప్పించారు. అయితే వాటిని ఖండించిన వెంకటరెడ్డి తెలంగాణ ప్రయోజనాల కోసమే తాను అమిత్ షా ను కలిశాననీ, ఇందులో రాజకీయం ఏమీ లేదనీ వివరణ ఇచ్చుకున్నారు. అయితే మునుగోడు ఉప ఎన్నిక విషయంలో వెంకటరెడ్డి డబుల్ గేమ్ అడుతున్నారన్న అనుమానాలకు బలం చేకూర్చేలా ఆయనపై వస్తున్న ఆరోపణలు ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ నేత మునుగోడు ఉప ఎన్నికల్లో తన తమ్ముడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డినే గెలిపించాలని.. కోమటిరెడ్డి వెంకటరెడ్డి పదే పదే ఫోన్స్ చేస్తున్నారని సంచలనాత్మక ఆరోపణలు చేశారు.
మునుగోడు మండలం ఊడికొండలో జరిగిన గ్రామస్థాయి కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో మండల కాంగ్రెస్ ఇన్ చార్జి, మాజీ ఎమ్మెల్యే విజయరమణారావు సమక్షంలో ఎంపీటీసీ సభ్యురాలు విజయలక్ష్మి భర్త సైదులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి పదే పదే ఫోన్ చేసి రాజగోపాలరెడ్డినే మునుగోడు ఉప ఎన్నికలో గెలిపించాలని పోన్ లు చేస్తున్నారని పేర్కొన్నారు.
ఒక్క తనకే కాదనీ, మండలంలో పలువురు కాంగ్రెస్ నేతలకు వెంకటరెడ్డి ఇదే విధంగా ఫోన్ చేసి ఇబ్బంది పెడుతున్నారనీ ఆరోపించారు. ఈ ఆరోపణలు తెలంగాణ కాంగ్రెస్ లో సంచలనం సృష్టిస్తున్నాయి. ఈ ఆరోపణలను కాంగ్రెస్ హై కమాండ్ కూడా సీరియస్ గా తీసుకుదంటున్నారు.కోమటిరెడ్డి వెంకటరెడ్డి నిజంగానే ఫోన్ కాల్స్ చేశారా? అందులో నిజమెంత? అని ఆరా తీస్తున్నట్లు తెలిసింది. ఒక వేళ తన సోదరుడి విజయం కోసం ఆయన నిజంగా పని చేస్తున్నట్లు తేలితే మాత్రం వెంకటరెడ్డిపై చర్యలు తప్పవని కాంగ్రెస్ శ్రేణులు అంటున్నాయి.