మళ్ళీ కాంగ్రెస్‌లోకి ఆకుల రాజేందర్
posted on Apr 7, 2014 @ 1:21PM
కాంగ్రెస్ పార్టీలో నుంచి టీఆర్ఎస్‌లోకి చేరిన మల్కాజిగిరి కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆకుల రాజేందర్ మళ్ళీ పార్టీ మారారు. ఈసారి ఆయన తన సొంత పార్టీ కాంగ్రెస్‌లోకే చేరారు. పది రోజుల క్రితమే కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్‌లోకి మారిన ఆకుల రాజేందర్ పేరును టీఆర్ఎస్ తన తొలి జాబితాలో మల్కాజిగిరి నుంచి పోటీ చేస్తున్నట్టు ప్రకటించింది. అలాగే మందకష్ణ మాదిగ తనను చంపుతానని బెదిరిస్తున్నాడని, తాను రాజకీయాల నుంచి తప్పుకోవాలని అనుకుంటున్నానని పోలీసులకు ఫిర్యాదు చేసిన ఆకుల రాజేందర్ ఇప్పడు మళ్ళీ కాంగ్రెస్‌లో చేరి సంచలనం సృష్టించారు. దీంతో ఆయనకు మళ్ళీ మల్కాజిగిరి అసెంబ్లీ టిక్కెట్ ఆయనకి ఇవ్వక తప్పనిసరి పరిస్థితి. అయితే ఇక్కడో తిరకాసు వుంది. మల్కాజిగిరి తెలుగుదేశం నాయకుడు ఈరోజే తెలుగుదేశం నుంచి కాంగ్రెస్‌లో చేరారు. ఆయనకి మల్కాజిగిరి ఎమ్మెల్యే స్థానం నుంచి టిక్కెట్ ఇవ్వనున్నట్టు దిగ్విజయ్ సింగ్ హామీ ఇచ్చారు. తాజాగా ఆకుల రాజేందర్ తిరిగి కాంగ్రెస్‌లో చేరడంతో ఇప్పుడు మల్కాజిగిరి టిక్కెట్ కాంగ్రెస్ టిక్కెట్ ఎవరికి ఇస్తారన్నది సస్పెన్స్ గా మారింది.