ఆ విమాన ప్రయాణికులు చాలా లక్కీ
posted on Jul 18, 2014 @ 10:14PM
ఆ విమాన ప్రయాణికులు చాలా లక్కీ మలేసియా విమాన దుర్ఘటనకు సరిగ్గా రెండు రోజుల ముందు అంటే జూలై 15న అమెరికాలో న్యూ జెర్సీ నుండి 313 మంది ప్రయాణికులతో ముంబై బయలుదేరిన ఎయిర్ ఇండియా కూడా అటువంటి ఘోర ప్రమాదం నుండి త్రుటిలో తప్పించుకొన్న సంగతి బయటపడింది. అయితే ఆ ప్రమాదం ఉగ్రవాదుల దాడివలన కాక ఇంజనులో మంటలు అంటుకోవడం వలన జరగేది. కానీ విమాన పైలట్లు గౌతం వర్మ మరియు ఆయన సహచర పైలట్లు చాలా సమయస్పూర్తితో వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పింది.
న్యూజెర్సీ నుండి బయలుదేరిన బోయింగ్-777 ఎయిర్ ఇండియా విమానం, ఎడమవైపు ఉన్న ఇంజన్ నుండి మంటలు అంటుకొన్నట్లు పైలట్ వర్మ గమనించారు. వెంటనే నివార్క్ లిబర్టీ అంతర్జాతీయ విమానశ్రయం ఫ్లయిట్ కంట్రోల్ రూమ్ అధికారులకు సమస్య గురించి చెప్పడంతో వారు విమానంలో ఉన్న ఇంధనాన్ని అవసరమయినంత మేర ఖాళీ చేసి, నిర్దిష్ట ఎత్తుకి విమానాన్ని దింపమని సూచించారు. అయితే ఇంధనం ఖాళీ చేయడానికి దాదాపు 30 నుండి 40 నిమిషాల సమయం, క్రమంగా ఎత్తు తగ్గించుకొంటూ రావడానికి మరో 15-30 నిమిషాలు పడుతుంది.
దాదాపు 80టన్నుల పైగా బరువున్న విమానం ఒక్క ఇంజనుతో గాలిలో అంతసేపు నిలవడం చాలా ప్రమాదమని గ్రహించిన పైలట్ గౌతం వర్మ, విమానాన్ని వెంటనే ఎమర్జన్సీ ల్యాండిగ్ చేయబోతున్నట్లు తెలిపి, దాదాపు గంటకు 370 కి.మీ.ల వేగంతో విమానాన్ని నివార్క్ లిబర్టీ అంతర్జాతీయ విమానశ్రయం రన్ వే పై చాలా నేర్పుగా ల్యాండింగ్ చేసి, 313 మంది ప్రయాణికుల ప్రాణాలు కాపాడారు.
సాధారణంగా అంత భారీ విమానం, ఒక్క ఇంజనుతో సాధారణ వేగం కంటే 100కిమీ అధిక వేగంతో ల్యాండింగ్ చేయడం అసంభవమే. ఆ వేగంలో విమానం టైర్లు పేలిపోయి అదుపు తప్పవచ్చు లేదా రన్ వే దాటి ముందుకు దూసుకుపోవచ్చును, లేదా ఏమయినా జరుగవచ్చును. కానీ పైలట్లు చాలా నేర్పుగా దైర్యంగా విమానాన్ని చాలా భద్రంగా ఎటువంటి ప్రమాదం జరగకుండా దింపగలిగారు. ఆ ప్రయత్నంలో నిజంగానే విమాన టైర్లు పగిలిపోయాయి. కానీ పైలట్లు విమానం మాత్రం అదుపు తప్పనీయలేదు. ఈ ప్రమాదం జరిగి ఉండిఉంటే ఎవరూ బ్రతికి ఉండేవారు కాదని చెప్పవచ్చును. కానీ పైలట్లు సమయస్పూర్తి, దైర్యం, నేర్పు కారణంగా ఘోర ప్రమాదం తప్పింది. ప్రయాణికులు అందరూ క్షేమంగా మరో విమానాలలో తమ గమ్య స్థానాలకు చేరుకొన్నారు కూడా.
ఇందులో కొస మెరుపు ఏమిటంటే ఈ భయంకర ప్రమాదం నుండి 313 మంది ప్రయాణికుల ప్రాణాలు కాపాడిన పైలట్లు, క్యాబిన్ సిబ్బంది చేతిలో సరిపోయినంత డబ్బు లేకపోవడంతో తమ సంస్థ యాజమాన్యానికి ఫోన్ చేసి తమందరికీ భోజనం కోసం ‘కాంప్లిమెంటరీ మీల్స్ టోకెన్లు’ ఇప్పించవలసిందిగా కోరినట్లు సమాచారం.