గడ్డం, మీసాలతో కర్నూలులో ప్రత్యక్షమైన అఘోరీ
posted on Nov 24, 2024 @ 3:03PM
వరంగల్ స్మశాన వాటిక నుంచి గుజరాత్ వెళ్లిపోతానని ప్రకటించిన వివాదాస్పద అఘోరీ మళ్లీ ఎపిలో ఆదివారం ప్రత్యక్షమైంది. తాజాగా నవంబర్ 24 కర్నూలు జిల్లాలో పెట్టుడు మీసం, గడ్డంతో కనిపించి అందరినీ ఆశ్యర్యపరిచింది. వరంగల్ స్మశాన వాటికలో చితా భస్మం పూసుకుని గుమ్మడికాయ పగలగొట్టి క్షుద్ర పూజలు చేసింది. అఘోరీ అంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో భయానక పరిస్థితిని క్రియేట్ చేసింది. సికింద్రాబాద్ ముత్యాలమ్మ గుడిలో నాగసాధుగా పరిచయమైన ట్రాన్స్ జెండర్ శ్రీనివాస్ అలియాస్ పింకి తనకు తాను అఘోరీగా ప్రకటించుకుంది. తాను కేదార్ నాథ్ వెళ్లి గురువు ఆశీర్వాదం తీసుకుంటానని చెప్పి తిరిగి తెలంగాణలో ఎంటరైంది, తన కారులో పెట్రోల్ క్యాన్ కనిపించడంతో అఘోరీ ఆత్మార్పణం చేసుకుంటుందేమోనన్న భయంతో సిద్దిపేట పోలీసులు అదుపులోకి తీసుకుని అఘోరీ స్వస్థలమైన మంచిర్యాలలో వదిలేశారు. అఘోరీకి కౌన్సిలింగ్ ఇచ్చి తెలంగాణ పోలీసులు మహరాష్ట్ర సరిహద్దు ప్రాంతమైన వాంకిడిలో వదిలేశారు. అక్కడ్నుంచి ఎపిలో ఎంటరైన అఘోరీ శ్రీకాళహస్తిలో పెట్రోలు పోసుకుని ఆత్మార్పణం చేసుకునే ప్రయత్నం చేసింది. శ్రీశైలం మల్లిఖార్జున స్వామిని దర్శించుకున్న అఘోరీ అక్కడ్నుంచి విజయవాడ కనకదుర్గను దర్శించుకుంది. ఇక్కడితో రెండు తెలుగు రాష్ట్రాల పర్యటన పూర్తయ్యిందని అందరూ ఊహించారు. అనూహ్యంగా మంగళగిరి రోడ్డులో కనిపించి నానా రచ్చచేసింది. ఎపి పోలీసుల మీద భౌతికదాడి చేసి అరెస్టు అయ్యింది. వ్యక్తిగత బెయిల్ మీద ఎపి పోలీసులు వదిలేయడంతో అఘోరీ మళ్లీ తెలంగాణలో ఎంటరైంది. ఈ సారి వరంగల్ స్మశాన వాటికలో తాంత్రిక పూజలు చేయడంతో అందరి దృష్టినాకర్షించింది. కర్నూలు జిల్లాలోని ఓ గ్రామంలో నిమ్మకాయలతో పూజలు చేయడంతో స్థానికులు అఘోరీని తరిమివేశారు. ఇన్ని రోజులు తాను అమ్మవారి అవతారం అని చెప్పి సడెన్ గా గడ్డం, మీసంతో కనిపించడంతో స్థానికుల అగ్రహానికి గురైంది. ఇప్పుడు మళ్లీ ఎక్కడ ప్రత్యక్షమౌతుందోనని తెలుగు రాష్ట్ర ప్రజలు ఎదురు చూస్తున్నారు. రెండు రాష్ట్రాల పోలీసులు అఘెరీని ఇంత వరకు అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపకపోవడం చర్చనీయాంశమైంది.