జస్ట్ ఆస్కింగ్ .. బీజేపీని నిలదీస్తున్న నటుడు ప్రకాష్‌రాజ్
posted on Sep 1, 2022 @ 10:57PM
ప్రభుత్వాలు సరిగా పనిచేయనపుడు ప్రజాహితం పట్టకుండా ఉన్నపుడు, సామాన్య ప్రజలు ప్రభుత్వాన్ని నిలదీస్తుంటాయి. ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి విపక్షాల నాయకులు, రాజకీయ నాయకులే కానక్కర్లేదు రాజకీయ పరిజ్ఞానం ఉన్న కాలేజీ విద్యార్ధి కూడా కావచ్చు, సినీ నటులయినా కావచ్చు. ఇప్పుడే కాదు చాలాకాలం నుంచి దేశ రాజకీయాల మీద తన అభిప్రాయాలతో, నచ్చని అంశాలను లేవనెత్తి ఘాటు విమర్శలతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ప్రశ్నిస్తున్నారు సినీ నటుడు ప్రకాష్ రాజ్. తాజాగా ఆయన బీజేపీ సర్కార్ విధానాలను ఎండగడుతున్నారు.
జస్ట్ ఆస్కింగ్ అంటూ, ఆయన ట్విటర్ ద్వారా సంధించే ప్రశ్నలు, చేస్తున్న విమర్శలు చాలామంది రాజకీయనాయకులకు మిం గుడు పడటం లేదు. కొందరికి ప్రస్తుత రాజకీయ పరిస్థితులను తెలియజేస్తున్నాయని పరిశీలకులు అంటున్నారు. తాను హిందూత్వానికి వ్యతిరేకిని కానని కేవలం మోదీ, షా ద్వయానికే వ్యతిరేకినని ప్రకాష్ రాజ్ ప్రకటించారు.
వినాయక చవితి సందర్భంగా ఆయన మరొక ట్వీట్ చేశారు. ఆ ట్వీట్‌లో, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ధ్యానం చేసుకుంటూం డగా, వినాయకులు ఆయనకు ఇరువైపులా నిల్చున్నట్లు, వినాయకుడు ఆరెస్సెస్ యూనిఫాం ధరించినట్లు, కేజీఎఫ్, అల్లు అర్జున్ లను గుర్తు చేస్తూ వినాయకుడి విగ్రహాలను రూపొందించడాన్ని గట్టిగా ప్రశ్నించారు. ఇలాంటివాటి వల్ల మనోభావాలు దెబ్బతినవా? అని నిలదీశారు.
ప్రకాశ్ రాజ్ సందర్భం వచ్చిన ప్రతిసారీ కేంద్ర, రాష్ట్రాల్లోని బీజేపీ ప్రభుత్వాల పనితీరును ప్రశ్నిస్తూనే ఉంటారు. గత నెలలో కర్ణాటకలోని మైసూరులో మైసూరు జిల్లా పాత్రికేయుల సంఘం నిర్వహించిన కార్యక్రమంలో ఆయన చాలా ఘాటుగా మాట్లా డారు. విలేకర్ల ప్రశ్నలకు స్పందిస్తూ, అవకాశం ఉంటే కేంద్ర, రాష్ట్రాల్లోని బీజేపీ ప్రభుత్వాలకు తాను మైనస్ మార్కులు ఇస్తాన న్నారు. మైనస్ మార్కులివ్వడానికి వీల్లేదు కాబట్టి, తాను ఆ ప్రభుత్వాలకు సున్నా మార్కులు ఇస్తున్నానని చెప్పారు. 30 కన్నా తక్కువ మార్కులు వస్తే ఫెయిలయినట్లే కదా! అన్నారు. సాగు భూముల కొనుగోళ్ళపై ఆంక్షలన్నీ తొలగించారని, ఉద్యోగ కల్పనకు ఏమాత్రం కృషి చేయడం లేదని, పెట్రోలు, డీజిల్ ధరలు పెరిగిపోతుండటంతో దాని ప్రభావం నిత్యావసరాల ధరలపై పడుతోందని మండిపడ్డారు. దార్శనికత లేకుండా ప్రభుత్వాలను ఎలా నడుపుతారని నిలదీశారు.
ఇంటింటా త్రివర్ణ పతాకంపై మాట్లాడుతూ, స్వాతంత్ర్య వజ్రోత్సవాల సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పిలుపుతో ఇంటిం టా త్రివర్ణ పతాకం కార్యక్రమం గురించి విలేకర్ల ప్రశ్నకు ప్రకాశ్రాజ్ స్పందిస్తూ, నిత్యావసరాల ధరలను తగ్గించడం, ఉద్యోగా లను కల్పించడం ద్వారా దేశ భక్తిని ప్రోత్సహించాలన్నారు. చేనేత పరిశ్రమలోని కార్మికులు ఉపాధి లేక ఇబ్బందులు పడుతూ ఉంటే జాతీయ జెండాలను పాలిస్టర్‌తో తయారు చేయడానికి అనుమతించడంపై మండిపడ్డారు. పాలపై సైతం జీఎస్ టీని విధిస్తున్నారని, ఇటువంటి సమయంలో తాను ఆ ప్రభుత్వాలు అద్భుతంగా పనిచేస్తున్నాయని ఎలా చెప్పగలను అని ప్రశ్నించారు.
నటుడు ప్రకాశ్ రాజ్ 2019 లోక్‌సభ ఎన్నికల్లో బెంగళూరు సెంట్రల్ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి, ఓడి పోయారు. దీనిపై అప్పట్లో ఆయన స్పందిస్తూ, తాను రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి ప్రజా గళంగానే ఉన్నానని, అదే శక్తి మంతమైనదని తాను భావిస్తానని తెలిపారు. తాను గళమెత్తే నటుడిగానే కొనసాగుతానని తెలిపారు. దేశంలో పరిస్థితులపై ఆయన తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూంటారు. వ్యవస్థను తీవ్రంగా దెబ్బతీశారని, దీనిని చక్కదిద్దడం ఏ నాయకుడికీ సాధ్యం కాదని, కేవలం ప్రజలు మాత్రమే దీనిని సరిదిద్దాలని అన్నారు.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కేవలం కొద్ది గంటలపాటు పర్యటిం చేందుకు వచ్చినపుడు కోట్లాది రూపాయలు వెచ్చించి రోడ్లు వేస్తున్నారని, వీథి దీపాలను మరమ్మతు చేస్తున్నారని, హోర్డింగులను తొలగిస్తున్నారని దుయ్యబట్టారు. పన్ను చెల్లించే ప్రజల కోసం రోడ్లు వేయాలన్నారు. నా కోసం రోడ్లు వేయండి, నేను పన్ను చెల్లిస్తున్నానని అన్నారు.