కాంగ్రెస్ మద్దతు ఎందుకు?: కేజ్రీవాల్ వివరణ
posted on Dec 24, 2013 @ 4:09PM
కాంగ్రెస్ పార్టీ మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు అరవింద్ కేజ్రీవాల్ నిర్ణయించుకోవడం సర్వత్రా విమర్శలకు దారితీసింది. బేజీపి అయితే ఒక అడుగు ముందుకు వేసి కాంగ్రెస్‌తో చేతులు కలిపి ఆమ్ ఆద్మీ పార్టీ రానున్న సార్వత్రిక ఎన్నికలలో నరేంద్ర మోదీ ప్రభ౦జనాన్ని ఎదుర్కోవడానికి సిద్ధపడుతోందని ఆరోపించింది. ఆమ్ ఆద్మీ కాంగ్రెస్ పార్టీ రాజకీయ క్రీడలో ఒక పావుగా మారిపోయిందని కూడా బీజేపీ విమర్శించింది. కాంగ్రెస్ పార్టీ అమ్ములపొదిలో ఆమ్ ఆద్మీ పార్టీ ఒక బాణంగా మారిపోయిందని కూడా బీజేపీ నిప్పులు చెరిగింది.
అయితే తాము ఏ పరిస్థితులలో కాంగ్రెస్ పార్టీ మద్దతు తీసుకున్నదీ వివరిస్తూ ఆమ్ ఆద్మీ మంగళవారంనాడు ఒక వీడియోను విడుదల చేసింది. కాంగ్రెస్ పార్టీ కేవలం బయటనుంచి మాత్రమే మద్దతు ఇస్తున్నదని, తమ రెండు పార్టీలకూ మధ్య ఎటువంటి ఒప్పందాలూ లేవని ఆ పార్టీ వివరించింది. కాంగ్రెస్ పార్టీ గనక తమకు మద్దతు ఉపసంహరించుకోవదలిస్తే ఉపసంహరించుకోవచ్చునని, అటువంటప్పుడు తాము మళ్లీ ప్రజల వద్దకు వెళ్తామని ఆమ్ ఆద్మీ పార్టీ పేర్కొన్నది.