ఢిల్లీ అసెంబ్లీలో కేజ్రీవాల్ విశ్వాస తీర్మానం
posted on Aug 29, 2022 @ 10:12AM
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవల్ సోమవారం (ఆగస్టు 29) అసెంబ్లీలో విశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టనున్నారు. ఢిల్లీలో అధికారంలో ఉన్న అమ్ ఆద్మీ ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ ప్రయత్నాలు చేస్తోందన్న ఆరోపణల మధ్య కేజ్రీవాల్ ఈ నిర్ణయం తీసుకవడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. ఆప్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి ఒక్కొక్కరికీ బీజేపీ రూ. 20 కోట్లు ఇవ్వజూపిందని కేజ్రీవాల్ ఆరోపించిన సంగతి తెలిసిందే. సంతలో పశువుల్లో కొనుగోలుకు బీజేపీ సిద్ధపడినా.. తమ పార్టీ వారెవరూ అందుకు సిద్ధంగా లేరన్న కేజ్రీవాల్.. ఆ విషయాన్ని రుజువు చేసేందుకే విశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెడుతున్న్ట్లట్లు పేర్కొన్నారు.
అంతకు ముందు అరవింద్ కేజ్రీవాల్ తన పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి మహాత్మా గాంధీ స్మారక రాజ్‌ఘాట్‌లో ప్రార్థనలకు నాయకత్వం వహించారు, ఆ తర్వాత ఢిల్లీలోని ఆప్‌కి చెందిన 62 మంది ఎమ్మెల్యేలలో 53 మంది ఆయన నివాసంలో సమావేశానికి హాజరైన సంగతి విదితమే. రాజ్‌ఘాట్‌ను సందర్శించిన అనంతరం కేజ్రీవాల్ ఆప్ కు చెందిన 40 మంది ఎమ్మెల్యేలకు బీజేపీవారు లంచం ఇచ్చి తమ పార్టీలో చేరాల్సిందిగా ఒత్తిడి తెస్తున్నరనీ, అయితే ఒక్క ఎమ్మెల్యే కూడా బీజేపీ దుష్టపన్నాగాలకు లొంగకుండా నిలిచినందుకు గర్వపడుతున్నాననీ పేర్కొన్నారు.
బీజేపీ ఆపరేషన్ కమలం అట్టర్ ప్లాప్ అయ్యిందన్నారు. మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక తరహాలో తమ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు బీజేపీ ‘ఆపరేషన్ కమలం కుట్ర పన్నిందని కేజీవాల్ ఆరోపించారు. తాను ఆప్‌ని వదిలేసి కమలం గూటికి చేరితే తనపై ఉన్న అన్ని కేసులను మూసివేస్తామని బీజేపీ ఆఫర్ చేసిందని ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా పేర్కొన్నారు. ఈ ఏడాది ప్రారంభంలో ప్రవేశపెట్టిన ఢిల్లీ మద్యం పాలసీలో అవకతవకలు, అవినీతికి సంబంధించిన కేసులో సిసోడియాపై సీబీఐ కేసు నమోదు చేసిన సంగతి విదితమే. మద్యం పాలసీ ఉల్లంఘనలపై సీబీఐ ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్న 15 మంది నిందితుల జాబితాలో సిసోడియా ప్రథమ స్థానంలో ఉన్నారు. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఆయనపై మనీలాండరింగ్ కేసు కూడా నమోదు చేసింది.
2024 సార్వత్రిక ఎన్నికలు మిస్టర్ కేజ్రీవాల్, ప్రధాని నరేంద్ర మోడీ మధ్య పోటీ అని ఆప్ పేర్కొంది. విద్యారంగంలో చేసిన సేవలకు గానూప్రజాదరణ పొందుతున్న ఆప్ నాయకుడిని ఆపడానికి బీజేపీ కేంద్ర ఏజెన్సీలను దుర్వినియోగం చేస్తోందని ఆమ్ ఆద్వీ పార్టీ ఆరోపించింది.