ముచ్చటగా మూడో రోజు.. టీడీపీ సభ్యుల సస్పెన్షన్
posted on Dec 2, 2020 @ 3:57PM
ఏపీ అసెంబ్లీలో సస్పెన్షన్ల పర్వం కొనసాగుతోంది. మూడో రోజు సమావేశాల్లో కూడా కొందరు టీడీపీ సభ్యులను స్పీకర్ తమ్మినేని సీతారాం సస్పెండ్ చేశారు. ఈరోజు అసెంబ్లీలో పోలవరం ప్రాజెక్టుపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతుండగా టీడీపీ ఎమ్మెల్యేలు అడ్డుపడుతున్నారని అధికారపక్ష ఎమ్మెల్యేలు ఆగ్రహం వ్యక్తం చేశారు. సభకు ఆటంకం కలిగిస్తున్న 9 మంది టీడీపీ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేయాలని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. దీంతో 9 మంది ఎమ్మల్యేలను ఒక్క రోజు పాటు సస్పెండ్ చేస్తున్నట్టు స్పీకర్ ప్రకటించారు. సస్పెండ్ అయిన వారిలో అచ్చెన్నాయుడు, నిమ్మల రామానాయుడు, బాలవీరాంజనేయ స్వామి, బెందాళం అశోక్, వెలగపూడి రామకృష్ణబాబు, జోగేశ్వరరావు, గొట్టిపాటి రవికుమార్, ఏలూరి సాంబశివరావు, అనగాని సత్యప్రసాద్ ఉన్నారు.
మరోవైపు, అసెంబ్లీలో చర్చ జరగకుండా కావాలని అడ్డుపడుతున్నారంటూ టీడీపీ నేతలపై సీఎం జగన్ మండిపడ్డారు. చంద్రబాబు ఉన్న చోట దిగజారిన రాజకీయాలు కనిపిస్తాయని విమర్శించారు. చంద్రబాబు ఏనాడూ పోలవరం గురించి ఆలోచన చేయలేదని సీఎం అన్నారు. గత సీఎంలు పోలవరాన్ని పూర్తి చేయాలనుకోలేదని, 2004లో వైఎస్ సీఎం అయ్యాక 86 శాతం భూసేకరణ చేసి కుడి కాలువ పనుల్ని యుద్ధ ప్రాతిపదికన చేపట్టారని పేర్కొన్నారు. చంద్రబాబు హయాంలో కేవలం 14శాతం పనులు జరిగాయన్నారు. తాము అధికారంలోకి రాకముందు వరకు 29.80 శాతం పోలవరం పనులు పూర్తయ్యాయని సీఎం పేర్కొన్నారు.