బ్యాలెట్ బాక్సుల్లో జై శ్రీరాం, జై పీఆర్సీ..
posted on Mar 18, 2021 @ 11:10AM
తెలంగాణలో రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. ఉదయం 11 గంటల వరకు నల్గొండ-వరంగల్- ఖమ్మం స్థానంలో మూడు రౌండ్లు, హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్ నగర్ స్థానంలో రెండు రౌండ్ల లెక్కింపు పూర్తైంది. పట్టభద్రుల ఎన్నికల్లో భారీగా చెల్లని ఓట్లు వస్తున్నాయి. ఇప్పటివరకు లెక్కించిన ఓట్లలో దాదాపు 6 శాతం ఓట్లు చెల్లకుండాపోయాయి. నల్గొండ స్థానంలో లక్షా 70 వేల ఓట్లు లెక్కించగా.. అందులో దాదాపు 10 వేల ఓట్లు చెల్లలేదు. హైదరాబాద్ స్థానంలో లక్షా 12 వేల ఓట్లు చెల్లించగా.. దాదాపు 6 వేల ఓట్లు చెల్లలేదు. పట్టభద్రుల ఓట్లు చెల్లకుండా పోవడం చర్చగా మారింది.
పట్టభద్రులు ఓటింగులో చాలా తప్పులు చేశారని తెలుస్తోంది . కొందరు నెంబర్ కు బదులుగా టిక్ కొట్టారు. ఇంకొందరు ఒకటే నెంబర్ ను ఇద్దరు, ముగ్గురికి వేశారు. ఇంకొందరు ఎన్నికల సిబ్బంది ఇచ్చిన మార్కర్ కాకుండా.. తమ సొంత పెన్నులతో టిక్ పెట్టారు. ఇవి కాకుండా కొందరు ఓటర్లు అత్యుత్సాహం కూడా .. వాళ్ల ఓటు చెల్లకుండాపోవడానికి కారణమైందని తెలుస్తోంది. కొందరు పట్టభద్రులు బ్యాలెట్ పేపరుపై జై శ్రీరాం.. జై హనుమాన్.. జై పీఆర్సీ నినాదాలు రాశారు. ఎన్నికల రూల్స్ ప్రకారం బ్యాలెట్ పేపర్ పై నెంబర్ కాకుండా ఎలాంటి రాతలు ఉండకూడదు. దీంతో అలాంటి ఓట్లన్ని చెల్లనవిగా ఎన్నికల అధికారులు ప్రకటించారు.
జై శ్రీరాం అని రాసి ఉన్న ఓట్లన్ని బీజేపీ సానుభూతిపరులవిగా భావిస్తున్నారు. ప్రస్తుతం దేశమంతా శ్రీరామ జపం వినిపిస్తోంది. బీజేపీ కార్యకర్తలు జై శ్రీరామ్ నినాదంతో ముందుకు పోతున్నారు. అయితే పార్టీ పట్ల అభిమానం చూపేందుకు అత్యుత్సాహంతో చేసిన పనితో.. వాళ్ల పార్టీకి నష్టం కల్గిందనే చర్చ జరుగుతోంది. ఇటీవల టీఆర్ఎస్ జై హనుమాన్ నినాదం ఎత్తుకుంది. బీజేపీ జై శ్రీరాంకు పోటీగా టీఆర్ఎస్ జై హనుమాన్ స్లోగన్ ను వినిపిస్తోంది. దీంతో జై హనుమాన్ అని బ్యాలెట్ పై రాసిన వారంతా గులాబీ పార్టీ మద్దతుదారులు అయి ఉండవచ్చని అభిప్రాయపడుతున్నారు.
తెలంగాణ ఉద్యోగులు పీఆర్సీ కోసం చాలా కాలంగా పోరాడుతున్నారు. కేసీఆర్ సర్కార్ కూడా ఇస్తాం ఇస్తాం అంటూనే మూడేండ్లుగా పీఆర్సీపై సాగదీస్తూ వస్తోంది. ఈ నేపథ్యంలో కేసీఆర్ సర్కార్ ఉద్యోగులంతా ఆగ్రహంగా ఉన్నారు. సర్కార్ పై ఉన్న కోపాన్ని కొందరు ఉద్యోగులు బ్యాలెట్ పేపర్లపై చూపించారని తెలుస్తోంది. అయితే జై పీఆర్సీ అని రాయడంతో వారి ఓట్లు చెల్లకుండా పోయాయి. మొత్తానికి విద్యావంతులు చెల్లని ఓట్లు వేయడంపై ప్రజల నుంచి విమర్శలు వస్తున్నాయి.