ఒకే కాలేజీలో 163 మందికి వైరస్.. ఏపీలో కరోనా కల్లోలం
posted on Mar 23, 2021 @ 11:21AM
ఆంధ్రప్రదేశ్ లో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. ఫిబ్రవరిలో అదుపులోనికి వచ్చినట్లుగా కనిపించిన వైరస్... గత రెండు వారాలుగా మళ్లీ కోరలు చాస్తోంది. పట్టణాలు, పల్లెలనే తేడా లేకుండా అన్ని ప్రాంతాల్లోనూ కొత్త కేసులు భారీగా నమోదవుతున్నాయి.
తూర్పు గోదావరి జిల్లాలో కరోనా కల్లోలం రేపింది. రాజమహేంద్రవరం రూరల్ పరిధిలో ఉన్న ఓ కాలేజీలో మహమ్మారి విలయతాండవం చేస్తోంది. ఆ కాలేజీలో రెండు రోజులుగా కరోనా కేసులు బయటపడుతున్నాయి. మొదటి రోజు కొందరు విద్యార్థులను టెస్ట్ చేస్తే 13 కేసులు బయటపడ్డాయి. రెండో రోజు 10 కేసులు మాత్రమే నమోదయ్యాయి. దీంతో కేసుల సంఖ్య తగ్గిందని భావించారు.
తాజాగా సోమవారం చేసిన టెస్టుల్లో ఏకంగా 140 కరోనా కేసులు బయటపడటంతో కాలేజీ అంతా ఒక్కసారిగా ఉలిక్కిపడింది.
700 మంది విద్యార్థుల నుంచి నమూనాలను యాజమాన్యం సేకరించింది. వీటిల్లో 140 మందికి కరోనా పాజిటివ్ ఉన్నట్టు నిర్ధారణ అయింది. దీంతో ఆ కాలేజీలో 163 మంది కరోనా సోకినట్లైంది. పాజిటివ్ వచ్చిన వారందరినీ ఒకే క్యాంపస్ లో ఉంచి ఆ ప్రాంతాన్ని కంటోన్మైంట్ జోన్ గా చేశామని అధికారులు వెల్లడించారు. నెగిటివ్ వచ్చిన 450 మందిని వేరే హాస్టల్ కు తరలించినట్టు వివరించారు. ఈ పరిణామంతో తూర్పు గోదావరి జిల్లా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. విద్యార్థుల్లో కరోనా కేసులు రావడంతో తల్లిదండ్రులు భయపడిపోతున్నారు.