శేరిలింగంపల్లి నుండి నారా లోకేష్ ?
posted on Dec 7, 2012 @ 11:12AM
తెలుగు దేశం పార్టీ అధినేత నారా చంద్ర బాబు నాయుడు కుమారుడు లోకేష్ రంగా రెడ్డి జిల్లా శేరిలింగంపల్లి అసెంబ్లీ నియోజక వర్గం నుండి పోటీ చేయడానికి సిద్దపడినట్లు తెలుస్తోంది. ఈ విషయంలో మీడియాలో కధనాలు కూడా వచ్చాయి.
ఈ నియోజక వర్గ ప్రాంతంలోనే హై టెక్ సిటీ ఉండటం, కోస్తా, రాయలసీమ ప్రాంతాల ప్రజలు ఇక్కడ అధిక సంఖ్యలో ఉండటం కూడా ఇందుకు కారణమని తెలుస్తోంది. అనేక ఇతర కారణాల వల్ల లోకేష్ ను ఇక్కడ నుండి బరిలోకి దింపటం మంచిదని పార్టీ నేతలు నామా నాగేశ్వర రావు, సుజనా చౌదరి బాబుకు సూచించినట్లు సమాచారం.
కూకట్ పల్లి, చందా నగర్, కొత్త గూడ లు ఈ నియోజక వర్గ పరిధిలోనే ఉన్నాయి. గత ఎన్నికల్లో ఇక్కడ నుండి పోటీ చేసిన తెలుగు దేశం అభ్యర్ధి కేవలం వెయ్యి ఓట్ల తేడాతోనే ఓడిపోవడంతో ఇక్కడపోటీ చేసే పార్టీ అభ్యర్ధికి ప్రస్తుతం విజయావకాశాలు ఉంటాయనేది పార్టీ నేతల విశ్లేషణ. ఇక్కడ నుండి పోటీ చేస్తే, తెలంగాణా నుండి పోటీ చేసినట్లు గా కూడా ఉంటుందని పార్టీ నేతలు విశ్లేషించినట్లు ఆ కధనం వెల్లడించింది.
లోక్ సభకు కాకుండా, అసెంబ్లీ కే తన కుమారుడిని పంపించడానికి బాబు ఆసక్తి చూపిస్తున్నాడని బాబు సన్నిహితులు అంటున్నారు. ఇక్కడ నుండి పోటీ చేయడంతోనే లోకేష్ తన రాజకీయ అరంగేట్రం చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. లోకేష్ సన్నిహితులు ఈ నియోజక వర్గం ఫై ప్రత్యెక పర్యవేక్షణ చేస్తుండడమే ఈ ఊహాగానాలకు కారణం.