తెలంగాణాతో ఎవరికీ నష్టం లేదు !
posted on Dec 27, 2012 @ 11:59AM
ప్రత్యేక తెలంగాణా రాష్ట్రం విషయంలో అన్ని రాజకీయ పార్టీలు తమ తమ వైఖరులను ఖరారు చేసుకోలేక ఇబ్బందులు పడుతున్న సమయంలో కొంత మంది తెలంగాణా వాదులు ఓ ఆసక్తికరమైన వాదనను తెరపైకి తెచ్చారు. అదేమిటంటే, ప్రత్యెక తెలంగాణా రాష్ట్రంతో ఎవరికీ ఇబ్బంది లేదట !
రేపు ఢిల్లీలో జరగనున్న అఖిల పక్ష సమావేశంలో కాంగ్రెస్, తెలుగు దేశం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలన్నీ కలిసి తెలంగాణాకు అనుకూల వైఖరిని ప్రకటిస్తే, ఈ పార్టీలకు పెద్దగా ఇబ్బంది ఉండదట. ఈ పార్టీలన్నీ తెలంగాణా ను అంగీకరిస్తే, సీమంద్రా ప్రజలకు మరో ప్రత్యామ్నయం అంటూ ఉండదు కాబట్టి వారు ఈ మూడు పార్టీల్లో దేనికో ఒకదానికి మద్దతు ఇవ్వక తప్పదు. ఆలాంటి పరిస్థితుల్లో, వారు వీటిలో మంచి పార్టీ ఏదో అలోచించి దానికి మద్దతు ఇస్తారు. ఈ పరిస్థితి రాష్ట్రం సమైఖ్యంగా ఉన్నా జరిగేదే కదా అనేది వారి వాదన.
ఇది నాణానికి ఒక వైపు పరిస్థితి. మరోవైపు ప్రత్యెక రాష్ట్రం వస్తే, తెలంగాణా రాష్ట్ర సమితి గుత్తాధిపత్యం ముగుస్తుంది కాబట్టి, ఈ మూడు పార్టీలకు ఆ ప్రాంతంలో మంచి భవిష్యత్ ఉంటుంది. తెలంగాణా కోసమే ఉన్నామన్న టిఆర్ఎస్ మాటకు అప్పుడు ఇక కాలం చెల్లినట్లే అవుతుంది. ఇంకా చెప్పాలంటే, ఈ సమావేశంలో తెలంగాణకు మద్దతుగా ఏకాభిప్రాయం వచ్చినప్పటికీ, ప్రత్యెక రాష్ట్రం ఏర్పాటు కావడానికి ఇంకా చాలా సమయం పడుతుంది. అంటే, ఈ మూడు పార్టీల్లో ప్రజలు మంచి పార్టీగా భావించినదానికి అప్పటివరకూ భవిష్యత్ ఉంటుంది.
ఇదే కొంత మంది తెలంగాణా వాదుల ‘సలహా’ !