పార్టీల్లో అఖిలం ఫీవర్ !
posted on Dec 26, 2012 @ 11:27AM
తెలంగాణాఫై ఢిల్లీ లో జరగున్న అఖిల పక్ష సమావేశానికి ఇంకా సరిగ్గా రెండు రోజుల సమయం మాత్రమే ఉంది. దీనితో రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీల్లో దీనిఫై ఫీవర్ ప్రారంభం అయింది. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష తెలుగు దేశం మినహా, మిగిలిన అన్ని రాజకీయ పార్టీలు తమ ప్రతినిదులను ఇప్పటికే ప్రకటించాయి. ప్రతినిధుల విషయమే కాదు, తమ వైఖరులను ఖరారు చేసుకొనే విషయంలో కూడా ఇంకా ఈ రెండు పార్టీలు వెనుక వరుసలోనే ఉన్నాయి.
తెలంగాణా రాష్ట్ర ఉద్యమం కోసమే పుట్టిన టిఆర్ఎస్, బిజెపి, సిపిఐ లు ప్రత్యేక రాష్ట్రానికి అనుకూలంగా తమ వాదనను వినిపించనున్నాయి. సిపిఎం మాత్రం తెలంగాణాకు వ్యతిరేకంగా తన అభిప్రాయం చెప్పనుంది. తెలుగు దేశం పార్టీ మాత్రం తెలంగాణాకు తాను వ్యతిరేకం కాదని చెపుతూనే, ముందుగా కాంగ్రెస్ తన అభిప్రాయం చెప్పాలని పట్టు బట్టే అవకాశం ఉంది.
ముందుగా కేంద్రం తన వైఖరి చెప్పాలని జగన్ పార్టీ వాదించే అవకాశం ఉంది. రాయల తెలంగాణా అయితే, తమకు ఆమోదయోగ్యమని ఎంఐఎం అంటోంది.
ఈ సమావేశం ఆధారంగా తెలంగాణా విషయంలో ఎలాంటి నిర్ణయం జరగదని దాదాపు అన్ని పార్టీలు భావిస్తున్నా, ఆయా రాజకీయ పార్టీల వైఖరి ఈ సమావేశంలో స్పష్టం కానుంది. దీనితో, భవిష్యత్తులో ఆయా పార్టీల వైఖరులు రాష్ట్ర రాజకీయాలఫై ప్రభావం చూపే అవకాశం ఉంటుందనడంలో సందేహం ఉండక పోవచ్చు.
తెలంగాణఫై ముందుగా తన నిర్ణయం చెప్పాలని షిండే సమక్షంలో అన్ని పార్టీలు అధికార కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేసే అవకాశం కూడా ఉంది.