నేనే గనక హోం మంత్రినైతే : టిజి

 

తాను గనక హోం మంత్రి పదవిలో ఉండి ఉంటే రాష్ట్రవ్యాప్తంగా తెలంగాణ అవతరణ దినోత్సవం వేడుకల్ని ఘనంగా జరిపించి ఉండేవాడినని మంత్రి టి.జి. వెంకటేష్ వ్యాఖ్యానించారు. అసలు రాష్ట్ర అవతరణ దినోత్సవం వేడుకల్ని వ్యతిరేకించేవాళ్లకి అసెంబ్లీలో అడుగుపెట్టే అర్హతకూడా లేదని విమర్సించారు. అప్పట్లో రాజధానిని కర్నూలు నుంచి హైదరాబాద్ కి మార్చడంవల్లే ఇప్పుడిన్ని ఇబ్బందులు తలెత్తుతున్నాయన్నారు. కర్నూలు రాజధానిగా ఉండుంటే సీమాంధ్ర ప్రాంతం ఈ పాటికి ఎంతో అభివృద్ధి చెంది ఉండేదని ఆవేదన వ్యక్తం చేశారు.

 

ఇంకా ఇలాంటి రాష్ట్ర అవతరణ దినోత్సవాల్ని చాలా చాలా జరుపుకుని తీరతామన్న నమ్మకం తనకు బలంగా ఉందని విజయవాడ పార్లమెంట్ సభ్యుడు లగడపాటి రాజగోపాల్ వ్యాఖ్యానించారు. జాతీయ జెండాని ఆవిష్కరించి వేడుకల్నిప్రారంభించిన లగడపాటితోపాటు కార్యక్రమంలో పాల్గొన్నవాళ్లంతా సమైక్యాంధ్రకు అనుకూలంగా నినాదాలు చేశారు. కలిసి ఉంటేనే రాష్ట్రం అభివృద్ధి చెందడం సాధ్యమని
ఆయన అన్నారు.

క్రికెట్‌లో సంచలనం... వైభవ్‌కు అరుదైన పురస్కారం

  బిహార్‌కు చెందిన 14 ఏళ్ల క్రికెట్ సంచలనం వైభవ్ సూర్యవంశీ మరో అరుదైన గౌరవాన్ని అందుకున్నాడు. తన దూకుడు బ్యాటింగ్‌తో ఇప్పటికే దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న వైభవ్‌కు ఇప్పుడు ప్రధాన మంత్రి రాష్ట్రీయ బాల పురస్కారం దక్కింది. ఈ పురస్కారాన్ని న్యూఢిల్లీ వేదికగా జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా వైభవ్ స్వీకరించాడు. పురస్కార ప్రదానోత్సవం అనంతరం, వైభవ్‌తో పాటు ఇతర అవార్డు గ్రహీతలు ప్రధాని నరేంద్ర మోడీని ప్రత్యేకంగా కలుసుకున్నారు. దేశ యువతలో ప్రేరణ నింపే లక్ష్యంతో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. క్రికెట్ రంగంలో అద్భుత ప్రతిభను కనబరిచినందుకుగాను ఈ పురస్కారం వైభవ్‌కు దక్కింది. చిన్న వయసులోనే జాతీయ స్థాయిలో గుర్తింపు రావడం అతడి కెరీర్‌లో ఓ చారిత్రక ఘట్టంగా నిలిచింది. అవార్డు కార్యక్రమంలో పాల్గొనడం కారణంగా వైభవ్ విజయ్ హజారే ట్రోఫీ మిగతా మ్యాచ్‌లకు అందుబాటులో ఉండడు. ఫీల్డ్‌లో ఆడే అవకాశం కోల్పోవడం ఏ ఆటగాడికైనా కష్టమే అయినా, దేశ స్థాయిలో గౌరవం అందుకోవడం జీవితంలో అరుదైన అవకాశం అని క్రికెట్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఇటీవల అరుణాచల్ ప్రదేశ్‌తో జరిగిన విజయ్ హజారే ట్రోఫీ తొలి మ్యాచ్‌లో వైభవ్ చేసిన ప్రదర్శనతో రికార్డులు బద్దలయ్యాయి. కేవలం 84 బంతుల్లో 190 పరుగులు చేసి, బిహార్‌ను భారీ స్కోర్ దిశగా నడిపించాడు.  ఆ ఇన్నింగ్స్‌తో వైభవ్ దేశీయ క్రికెట్‌లో అత్యంత దూకుడు బ్యాటర్లలో ఒకడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. చిన్న వయసులోనే పెద్ద రికార్డులు నెలకొల్పుతూ, భవిష్యత్ భారత క్రికెట్‌కు ఆశాజనకంగా మారాడు. సీనియర్ జట్టులోకి కూడా వైభవ్‌ను తీసుకోవాలనే వాదన కూడా వినిపిస్తోంది. ప్రధాన మంత్రి రాష్ట్రీయ బాల పురస్కారం అనేది 5 నుంచి 18 ఏళ్ల పిల్లలకు ఇచ్చే భారతదేశ అత్యున్నత పౌర గౌరవం. సాహసం, కళ - సంస్కృతి, పర్యావరణ పరిరక్షణ, ఆవిష్కరణలు, సైన్స్ అండ్ టెక్నాలజి, సామాజిక సేవ, క్రీడల్లో ప్రతిభ చూపిన బాలలకు ఈ అత్యున్నత పురస్కారాన్ని అందజేస్తారు.  

ముగిసిన ప్రభాకర్‌రావు కస్టోడియల్ విచారణ

  ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడు మాజీ ఎస్ఐబీ చీఫ్ ప్రభాకర్‌రావు విచారణ ముగిసింది. శుక్రవారం వేకువజామునే ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించి అనంతరం ప్రత్యేక దర్యాప్తు బృందం ఆయన్ని విడిచిపెట్టింది. అక్కడి నుంచి ఆయన నేరుగా ఇంటికి వెళ్లిపోయినట్లు సమాచారం. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు ఈ కేసులో 14 రోజుల పాటు కస్టోడియల్ విచారణ జరిపారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం హయంలో రాజకీయ ప్రత్యర్థులు, కీలక నేతలు, వ్యాపారవేత్తలు, మీడియా ప్రతినిధులు తదితరుల ఫోన్లను అక్రమంగా ట్యాప్ చేసినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.  అధికారిక అనుమతులు లేకుండా, నిబంధనలను ఉల్లంఘిస్తూ నిఘా సాగినట్లు సిట్ అధికారులు భావిస్తున్నారు. ఫోన్ ట్యాపింగ్ ద్వారా సేకరించిన సమా చారాన్ని రాజకీయ ప్రయో జనాల కోసం ఉపయోగిం చారన్న ఆరోపణలు ఈ కేసుకు మరింత ప్రాధాన్యం తెచ్చాయి. ఈ వ్యవహారంలో మాజీ ఐపీఎస్ అధికారి ప్రభాకర్ రావు పాత్రపై సిట్ ప్రత్యేక దృష్టి సారించింది. ఇప్పటికే ఆయనను కస్టడీ లోకి తీసుకొని విచారించిన అధికారులు, పలు కీలక ప్రశ్నలకు సమాధానాలు రాబట్టినట్లు సమాచారం.   ప్రభాకర్ రావు ను 14 రోజుల పాటు కస్టడీలకు తీసుకొని జరిపిన విచారణలో ఫోన్ ట్యాపింగ్‌కు సంబంధించిన సాంకేతిక వ్యవస్థ, ఆదేశాల పరంపర, ఎవరి అనుమతి తో నిఘా సాగిందన్న అంశాలపై సిట్ లోతైన విచారణ జరిపింది. ఈ కేసులో మరికొందరు ఉన్నతాధికా రుల పాత్రపై కూడా సిట్ దృష్టి సారించినట్లు తెలుస్తోంది. సిట్ అధికారుల దర్యాప్తులో భాగంగా రాష్ట్రంలోని కీలక రాజకీయ నేతల పేర్లు వెలుగులోకి రావడం ఈ కేసుకు మరింత రాజకీయ వేడి పెంచింది. ఎంపీ ఈటెల రాజేందర్, కేంద్ర మంత్రులు బండి సంజయ్, కిషన్ రెడ్డి, సీఎం రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, హరీష్ రావు వంటి ప్రముఖ నేతల ఫోన్లు నిఘాకు గురయ్యాయా? అన్న కోణంలో సిట్ అధికారులు ఆధారాలు సేకరిస్తున్నారు. అదేవిధంగా పలువురు ప్రముఖ పారిశ్రామిక వేత్తలు, ఇతర ప్రభావవంతమైన వ్యక్తుల కమ్యూనికేషన్లపై కూడా నిఘా పెట్టినట్లు అనుమానాలు వ్యక్తమవు తున్నాయి. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక సాక్షిగా మారిన ప్రముఖ సెఫాలజిస్ట్ ఆరా మస్తాన్‌ను సిట్ ఇప్పటికే రెండు సార్లు విచారించింది. ఆయన ఫోన్ సంభాషణలు, వివిధ రాజకీయ నేతలు, పారిశ్రామిక వేత్తలతో జరిగిన కమ్యూనికేషన్ల వివరాలను అధికారులు ఆయన ముందు ఉంచారు. గత ప్రభుత్వం నిఘా పెట్టిన కొద్ది మంది ముఖ్యుల్లో ఆరా మస్తాన్ ఒకరని సిట్ భావిస్తోంది.   రానున్న రోజుల్లో మరికొందరు కీలక వ్యక్తులను విచారణకు పిలిచే అవకాశం ఉందని అధికార వర్గాలు చెబుతు న్నాయి. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఎవరి ఆదేశాలతో నిఘా సాగిందన్న అంశం తేలితే, రాజకీయంగా మరియు పరిపాలనా పరంగా ఈ కేసు సంచలనం గా మారే అవకాశముంది. ఫోన్ ట్యాపింగ్ కేసు చివరికి ఎవరి మెడకు చుట్టుకుంటుందన్న ఉత్కంఠ మధ్య, సిట్ విచారణపై రాష్ట్రం మొత్తం దృష్టి సారించింది.

అనుమానంతో భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించిన భర్త

  హైదరాబాద్ నల్లకుంట పోలీస్‌స్టేషన్ పరిధిలో దారుణమైన హత్య ఘటన చోటుచేసుకుంది. అనుమానంతో భార్యను పిల్లల ముందే పెట్రోల్‌ పోసి తగలబెట్టిన భర్త, అడ్డుకోవడానికి ప్రయత్నించిన కూతురిని కూడా మంటల్లోకి తోసి పారిపోయాడు. నల్గొండ జిల్లాకు చెందిన వెంకటేష్‌–త్రివేణి దంపతులు ప్రేమ వివాహం చేసుకుని నల్లకుంటలో తమ ఇద్దరు పిల్లలతో కలిసి నివాసం ఉంటున్నారు. భర్త వెంకటేష్‌ అనుమానంతో వేధిస్తున్నాడని త్రివేణి ఇటీవల పుట్టింటికి వెళ్లిపోయింది. ఇక నుంచి మారతానని నమ్మించి కొద్ది రోజుల క్రితమే వెంకటేష్ ఆమెను తిరిగి హైదరాబాద్‌కు తీసుకొచ్చాడు. అయితే, అనుమానం మళ్లీ తలెత్తడంతో వెంకటేష్ త్రివేణిపై పెట్రోల్‌ పోసి నిప్పంటించి దారుణంగా హత్య చేశాడు. ఈ ఘటనను అడ్డుకునేందుకు ప్రయత్నించిన కూతురిని కూడా మంటల్లోకి తోసివేయడంతో తీవ్ర కలకలం రేగింది. బాధితుల అరుపులు, కేకలు విన్న స్థానికులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని వారిని ఆసుపత్రికి తరలించారు. అప్పటికే త్రివేణి మృతి చెందగా, కూతురు స్వల్ప గాయాలతో ప్రాణాలతో బయటపడింది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడు వెంకటేష్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఘటనపై విచారణ కొనసాగుతోంది.  

కెనడాలో దారుణం... భారతీయ విద్యార్థి కాల్చివేత

  కలల దేశం కెనడాలో భారతీయ విద్యార్థుల నెత్తురు మరోసారి చిందింది. హిమాన్షి ఖురానా అనే విద్యార్థిని దారుణ హత్యకు గురైన విషాదం నుంచి కోలుకోకముందే.. టొరంటో యూనివర్సిటీ సాక్షిగా మరో ఘోరం జరిగింది. 20 ఏళ్ల భారతీయ విద్యార్థి శివాంక్ అవస్థీని గుర్తు తెలియని దుండగుడు అతి సమీపం నుంచి కాల్చి చంపారు. పట్టపగలే పారిపోయారు. యూనివర్సిటీ ప్రాంగణానికి కూతవేటు దూరంలోనే ఈ కాల్పులు జరగడం అక్కడి ప్రవాస భారతీయులను, ముఖ్యంగా విద్యార్థి లోకాన్ని వణికేలా చేస్తోంది. కెనడాలో ఉన్నత చదువుల కోసం వెళ్లిన భారతీయ విద్యార్థులపై దాడులు ఆందోళనకరంగా మారుతున్నాయి.  తాజాగా టొరంటోలో మరో భారతీయ విద్యార్థి దారుణ హత్యకు గురయ్యాడు. 20 ఏళ్ల శివాంక్ అవస్థీ అనే యువకుడిని గుర్తు తెలియని దుండగులు టొరంటో విశ్వవిద్యాలయం సమీపంలోనే కాల్చి చంపారు. హిమాన్షి ఖురానా అనే మరో భారతీయ విద్యార్థిని హత్య జరిగిన కొద్దిరోజుల వ్యవధిలోనే ఈ ఘటన చోటుచేసుకోవడం అక్కడి ప్రవాస భారతీయులను, విద్యార్థి లోకాన్ని తీవ్ర భయాందోళనలకు గురిచేస్తోంది. పోలీసుల సమాచారం ప్రకారం.. 20 ఏళ్ల వయసు కల్గిన శివాంక్ అవస్థీ టొరంటో విశ్వవిద్యాలయం సమీపంలో నడుచుకుంటూ వెళ్తుండగా ఈ ఘాతుకం జరిగింది.  దుండగుడు అతి సమీపం నుంచి శివాంక్‌పై కాల్పులు జరిపాడు. తీవ్ర రక్తస్రావంతో పడి ఉన్న శివాంక్‌ను గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పారామెడిక్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని ప్రాథమిక చికిత్స అందించినప్పటికీ.. అప్పటికే ఆయన మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు. నిందితులు కాల్పులు జరిపిన వెంటనే అక్కడి నుండి చాకచక్యంగా పరారయ్యారు. కెనడాలో భారతీయులను లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న దాడులు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.  కొద్ది రోజుల క్రితమే హిమాన్షి ఖురానా అనే విద్యార్థిని దారుణంగా హత్యకు గురైంది. ఆ కేసులో దర్యాప్తు కొనసాగుతుండగానే.. ఇప్పుడు శివాంక్ అవస్థీ బలికావడం భద్రతా లోపాలను ఎత్తిచూపుతోంది. కాల్పులు జరిగిన ప్రదేశం విశ్వవిద్యాలయానికి చాలా దగ్గరగా ఉండటంతో విద్యార్థులు బయటకు రావాలంటేనే వణికిపోతున్నారు. ఈ హత్యపై టొరంటో పోలీసులు కేసు నమోదు చేసి లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఘటనా స్థలంలోని సీసీటీవి ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. నిందితుడి ఆచూకీ కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.

బీఆర్‌ఎస్ ముఖ్యనేతలతో నేడు కేసీఆర్ సమావేశం

  బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ శుక్రవారం పార్టీ ముఖ్యనేతలతో సమావేశం కానున్నారు. ఉమ్మడి మహబూబ్‌నగర్, నల్గొండ, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల మాజీ మంత్రులతో సమావేశమవనున్నారు.  పాలమూరు-రంగారెడ్డి పథకంపై కేసీఆర్ చర్చించానున్నట్లు సమాచారం. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఈ ప్రాజెక్టుకు భారీగా నిధులు కేటాయించి పనులు దాదాపు పూర్తి స్థాయికి తీసుకొచ్చినా, ప్రస్తుత రేవంత్ సర్కార్ నిర్లక్ష్యం వహిస్తోందనే విషయాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లే అంశంపై చర్చించనున్నారు.  పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు డీపీఆర్‌ను కేంద్రం ప్రభుత్వం తిరస్కరించడంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మౌనంగా ఉందని ఈ విషయాన్ని ఎండగట్టాలని భావిస్తున్నట్లుగా తెలుస్తోంది.కృష్ణా నది నీటి వాటా విషయంలో సీఎం రేవంత్ రెడ్డి , నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి  తెలంగాణ ప్రయోజనాలను తాకట్టు పెట్టారని బీఆర్ఎస్ నాయకులు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. ముఖ్యంగా పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి కేవలం 45 టీఎంసీల నీరు సరిపోతుందని కేంద్రానికి లేఖ రాయడం దారుణమని బీఆర్‌ఎస్ నాయకులు విమర్శలు గుప్పిస్తున్నారు. 

ఐసిస్ లక్ష్యంగా నైజీరియాలో యూఎస్ భీకర దాడులు

  గత కొంత కాలంగా ఇజ్రాయెల్-పాలస్తీనా, ఉక్రెయిన్ - రష్యా, ఇరాన్ - ఇజ్రాయెల్ మధ్య యుద్దాలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ట్రంప్ ఆదేశాల మేరకు అమెరికా సైన్యం నైజీరియా ఐసీస్ టెర్రరిస్టులపై అటాక్ చేసింది. నైజీరియాలో ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులే లక్ష్యంగా అమెరకా భారీగా దాడులు ప్రారంభించింది. ఆ దేశంలోని క్రైస్తవులపై జరుగుతున్న హింసను అరికట్టడంలో భాగంాఈ చర్యలు తీసుకుంటున్నట్లు ట్రంప్ ట్రూత్ సోషల్ వేదికగా పోస్టు పెట్టారు. అమెరికా అధ్యక్షుడిగా డోనాల్డ్ ట్రంప్ రెండోసారి పదవీలోకి వచ్చిన తర్వాత పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు.  తాజాగా  ట్రంప్ ఆదేశాల మేరకు అమెరికా సైన్యం నైజీరియా ఈశాన్య ప్రాంతంలోని సొకోటో రాష్ట్రంలో ఐసీస్ ఉగ్రవాదులపై వైమానిక దాడులు నిర్వహించింది. ఆ దేశంలోని క్రైస్తవులపై జరుగుతున్న హింసను అరికట్టడంలో భాగంగా ఈ చర్యలు తీసుకున్నట్లు ట్రంప్ పేర్కొన్నారు. అమాయక క్రైస్తవులపై మారణహోమం సృష్టిస్తున్న ఉగ్రవాదులపై చర్య తీసుకున్నామని ట్రంప్ తన సోషల్ మీడియా ఫ్లాట్ ఫాం ‘ట్రూత్ సోషల్’ లో పోస్ట్ చేశారు. నైజీరియాలో క్రైస్తవ మతం అస్తిత్వానికి ముప్పు ఉందని ట్రంప్ అన్నారు.  పశ్చిమ ఆఫ్రికా దేశంలో క్రైస్తవ వర్గాలను లక్ష్యంగా చేసుకొని ఉగ్రవాదులు హింస కొనసాగిస్తున్నారని చెప్పారు. అలా చేస్తే భవిష్యత్ లో నరకం అనుభవించాల్సి వస్తుందని ఐసిస్ ని ముందే హెచ్చరించినట్లు పేర్కొన్నారు. మా యుద్ద వీరులు అద్భుతంగా తమ వ్యూహాలను అమలు పరిచారు. అది కేవలం యునైటెడ్ స్టేట్స్ మాత్రమే చేయగలదు. నా నాయకత్వంలో అమెరికా రాడికల్ ఇస్తామిక్ ఉగ్రవాదాన్ని పెరగనివ్వదు. క్రైస్తవులపై దాడులు కొనసాగిస్తే మరింత కఠిన చర్యలు తీసుకుంటా. చనిపోయిన ఉగ్రవాదులతో సహా అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు' అంటూ ట్రంప్ స్పందించారు. కాగా, ఈ దాడులను యూఎస్ ఆఫ్రికా కమాండ్ ధృవీకరించింది. కాకపోతే ఎంతమంది చనిపోయారన్న విషయం వెల్లడించలేదు. ఇటీవల క్రైస్తవులపై ఐసీస్ దారుణంగా దాడులు చేసింది. మారణహోమం సృష్టించి వేల మందిని హతమార్చింది. ఈ క్రమంలోనే నైజీరియా అధికారుల అభ్యర్థన మేరకు ఐసిస్ పై దాడి జరిగినట్లు యూఎస్ మిలిటరీ ఆఫ్రికా కమాండ్ తెలిపింది.

తిరుపతి వేదికగా భారతీయ విజ్ణాన సమ్మేళనం

తిరుపతి వేదికగా శుక్రవారం (డిసెంబర్ 26) నుంచి సోమవారం (డిసెంబర్ 29) వరకూ నాలుగు రోజులపాటు భారతీయ విజ్ఞాన సమ్మేళనం జరగనుంది.  తిరుపతిలోని జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో జరిగే ఈ సమ్మేళనానికి  32 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి 1500 మంది ప్రతినిధులు హాజరుకానున్నారు. సంప్రదాయ విజ్ఞానాన్ని ఆధునిక శాస్త్రంతో అనుసంధానించి, సమగ్ర అభివృద్ధి కోసం భారతీయ దృక్పథాన్ని ప్రోత్సహించే జాతీయ స్థాయి కార్యక్రమం.  సంప్రదాయ శాస్త్ర విజ్ఞానాన్ని వెలుగులోకి తెచ్చి ప్రపంచ స్థాయి ఆధునిక శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం తో అనుసంధానం చేసి భావితరాలకు అందించే ఆశయం తో విజ్ఞన భారతీ ఈ కార్యక్రమం నిర్వహిస్తుంది. 2007 నుంచీ ప్రతి మూడేళ్లకు ఒకసారి ఈ సమ్మేళనాన్ని నిర్వహిస్తున్నారు. తొలి సమ్మేళనం భూపాల్ లో జరిగింది. ఆ తరువాత  2009 లో ఇండోర్, 2012 లో జలంధర్, 2015లో పనాజీ, 2017లో పుణే, 2023 లో అహ్మదాబాద్ లో భారతీయ విజ్ణాన సమ్మేళనాలు జరిగాయి. ఈ ఏడు తిరుపతి వేదికగా జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో నాలుగు రోజుల పాటు కార్యక్రమం జరుగనుంది. ఇందులో సదస్సులు, మేధావుల చర్చలు, చర్చా గోష్టిలు, విజ్ఞాన ప్రదర్శనలు ఉంటాయి. సైన్స్ అండ్ టెక్నాలజీ పై ఎక్స్ పో లో  వివిధ రంగాల్లో నూతన ఆవిష్కరణలు,  80 పైగా ప్రదర్శనలు ఏర్పాటు చేయనున్నారు.  ఈ  భారతీయ విజ్ణాన ప్రదర్శన ప్రారంభ సభకురాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ముఖ్య అతిధులుగా హాజరౌతారు.  కేంద్ర శాస్త్ర సాంకేతిక మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్, సీఎస్ఐఆర్ మాజీ డైరెక్టర్ జనరల్ డాక్టర్ శేఖర్ మాండే,  డీఆర్డీవో  మాజీ డైరెక్టర్ జనరల్, రక్షణ శాఖ సలహాదారులు డాక్టర్ సతీష్ రెడ్డి, ఎన్ఐఎఫ్  డైరెక్టర్ అరవింద్ రాణాడే,  దేశవ్యాప్తంగా ఉన్న పరిశోధన సంస్థల డైరెక్టర్లు, వివిధ యూనివర్సిటీల వీసీలు, పరిశోధకులు  పాల్గొంటారు. ఇక 29న జరిగే ముగింపు కార్యక్రమానికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హాజరౌతారు.

గ్రేటర్ విజయవాడ మునిసిపల్ కార్పొరేషన్ సాకారం కానుందా?

ఆంధ్రప్రదేశ్ ప్రస్తుతం దేశంలోనే వేగంగా అభివృద్ది చెందుతున్న రాష్ట్రంగా వార్తలలో ఉన్న సంగతి తెలిసిందే. పెట్టుబడులు, పరిశ్రమలకు కేంద్రంగా మారుతోంది. ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరం ప్రాజెక్టు, రాజధాని అమరావతి నిర్మాణ పనులు వేగంగా సాగుతున్నాయి. ఈ తరుణంలోనే  దీర్ఘకాలికంగా పెండింగ్ లో ఉన్న ఓ ప్రతిపాదన తెరపైకి వచ్చింది. విజయవాడ కార్పొరేషన్ ను విస్తరించి గ్రేటర్ విజయవాడ మునిసిపల్ కార్పొరేషన్ గా చేయాలన్నదే ఆ ప్రతిపాదన. ఇందుకు విజయవాడ నగరానికి ఆనుకుని ఉన్న 74 గ్రామాలను   విలీనం చేసి.. గ్రేటర్ విజయవాడ కార్పొరేషన్ ను ఏర్పాటు చేయాలన్నదే ఆ ప్రతిపాదన. అమరావతికి ఆనుకుని ఉన్న నగరం విస్తరణ అత్యంత ముఖ్యమన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తం అవుతోంది. తాజాగా ఆ ప్రతిపాదనలో ఒక కదలిక వచ్చింది. విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని, ఎమ్మెల్యే గద్దె రామ్మెహన్ లు ముఖ్యమంత్రి చంద్రబాబుతో గురువారం (డిసెంబర్ 25) భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వారు ఆయనకు గ్రేటర్ విజయవాడ మునిసిపల్ కార్పొరేషన్ ప్రతిపాదనను వివరించారు.శరవేగంగా అభివృద్ధి చెందుతున్న అమరావతికి తోడుగా, ఇప్పటికే అభివృద్ధి చెందిన విజయవాడను విస్తరించాలని విజ్ణప్తి చేశారు. ఈ ప్రతిపాదనపై సీఎం చంద్రబాబు సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది.  వాస్తవానికి చాలా కాలంగా  గ్రేటర్ విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటు అంశం పెండింగ్ లో ఉంది. ఆ అంశాన్నే ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకు వెళ్లి సత్వరమే విజయవాడ గ్రేటర్ మునిసిపల్ కార్పొరేషన్ ఏర్పాటుకు చర్యలు తసుకోవాలని కోరారు. తక్షణమే దాని ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని కోరారు. ఎన్టీఆర్ జిల్లా, కృష్ణా జిల్లాల మధ్య   ఆ ప్రతిపాదనలపై సీఎం చంద్రబాబు సానుకూలంగా స్పందించారని కేశినేని చిన్ని తెలిపారు. జీవీఎంసీపై ప్రభుత్వం త్వరలోనే సానుకూల నిర్ణయం తీసుకునే అవకాశముందని చిన్ని అన్నారు.

బంగ్లాదేశ్ లో మరో హిందూ యువకుడి హత్య

బంగ్లాదేశ్ లో హిందువులే లక్ష్యంగా దాడులు కొనసాగుతున్నాయి. తాజాగా బంగ్లాదేశ్‌లో మరో హిందూ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు.  ఆ దేశంలో దీపూ చంద్ర దాస్ దారుణ హత్య మరవకముందే, రాజ్‌బర్ జిల్లాల్లో మరో హిందూ యువకుడిని గ్రామస్థులు కొట్టి చంపిన ఘటన వెలుగు చూసింది. బుధవారం (డిసెంబర్ 24 రాత్రి ఈ దారుణం జరిగింది.   రాజ్‌బర్ జిల్లాలోని పంగ్షా సర్కిల్‌లో   29 ఏళ్ల అమృత్ మొండల్ అలియాస్ సామ్రాట్‌పై బుధవారం రాత్రి గ్రామస్థులు దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వెంటనే  అమృత్ మొండల్  ఆసుపత్రికి తరలించారు. అయితే అక్కడ చికిత్స పొందుతూ అతడు మరణించాడు.  అమృత్ మండల్ సామ్రాట్ బహిన్ అనే సంస్థను నిర్వహిస్తున్నాడు. అయితే అతడు ఆ సంస్థ పేరిట సొమ్ములు వసూలు చేస్తూ, దౌర్జన్యాలకూ, హింసాకాండకూ పాల్పడుతున్నాడన్న అభియోగాలు ఉన్నాయి. అతడిపై   హత్యా నేరం సహా రెండు కేసులు ఉన్నాయి. అదలా ఉంచితే  గత కొంత కాలంగా అజ్ణాతంలో ఉన్న అమృత్ మొండల్ ఇటీవలే గ్రామానికి తిరిగి వచ్చాడు. ఈ నేపథ్యంలోనే అతడిపై దాడి జరిగింది.  ఇదలా ఉండగా హిందువులు లక్ష్యంగా బంగ్లాదేశ్ లో దాడులు కొనసాగుతున్నాయి. గత ఐదు రోజుల వ్యవధిలో బంగ్లాదేశ్ లో హిందువులకు కుటుంబాలు లక్ష్యంగా ఏడు దాడులు జరిగాయి. ఏడు గృహాలు దగ్ధమయ్యాయి. 

అమరావతిలో హైకోర్టు శాశ్వత భవన నిర్మాణానికి శంకుస్థాపన

ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. కొనసాగుతున్న నిర్మాణాలకు తోడు కొత్త నిర్మాణాలకూ శంకుస్థాపనలు జరుగుతున్నాయి. తాజాగా ఏపీ హైకోర్టు శాశ్వత భవన నిర్మాణ పనులకు మంత్రి నారాయణ గురువారం (డిసెంబర్ 25)శంకు స్థాపన చేశారు. ఈ ఐకానిక్ భవన నిర్మాణాన్ని 2027 నాటికి పూర్తి చేస్తామని ఈ సందర్భంగా చెప్పారు అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ఈ హైకోర్టు భవనాన్ని నిర్మిస్తున్నట్లు చెప్పిన ఆయన  రెండు బేస్‌మెంట్ అంతస్తులు, గ్రౌండ్ ఫ్లోర్‌తో పాటు మరో 7 అంతస్తులతో ఈ నిర్మాణం ఉంటుందన్నారు. 52 కోర్టు హాళ్లు ఉంటాయన్నారు. ఇందు కోసం 45 వేల టన్నుల ఇనుము వినియోగిస్తున్నట్లు వివరించారు. హైకోర్టు శాశ్వత నిర్మాణ పనుల ప్రారంభాన్ని ఒక చారిత్రక ఘట్టంగా మంత్రి నారాయణ అభివర్ణించారు.  ప్రపంచ ప్రఖ్యాత ఆర్కిటెక్చర్ సంస్థ  నార్మన్ ఫోస్టర్స్ అండ్ పార్టనర్స్ రూపొందించిన అద్భుతమైన డిజైన్‌తో ఈ హైకోర్టు భవనం రూపుదిద్దుకుంటోంది. 21 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మితమయ్యే ఈ హైకోర్టు శాశ్వత భవనానికి రాఫ్ట్ ఫౌండేషన్ పద్ధతిని అనుసరిస్తున్నారు. రాఫ్ట్ ఫౌండేషన్ అంటే.. భవనం మొత్తం బరువును నేల అంతటా సమానంగా పంపిణీ చేయడానికి ఒక పెద్ద కాంక్రీట్ స్లాబ్‌ను పునాదిగా వేస్తారు. దీనినే  రాఫ్ట్   ఫౌండేషన్ అంటారు. నేల స్వభావం మెత్తగా ఉన్నప్పుడు లేదా భవనం బరువు భారీగా ఉన్నప్పుడు ఈ పద్ధతిని ఉపయోగిస్తారు. ఇది భవనానికి  పటుత్వాన్ని ఇస్తుంది.