నా వారసుడు స్టాలిన్ : కరుణానిధి
posted on Jan 4, 2013 5:22AM
తమిళనాడులోని డిఎంకె పార్టీలో ఓ సస్పెన్స్ కు తెర పడింది. తన రాజకీయ వారసుడు స్టాలిన్ అని ఆ పార్టీ అధినేత కరుణానిధి నిన్న అధికారికంగా ప్రకటించారు. చాలా కాలంగా కరుణానిధి తర్వాత పార్టీ పగ్గాలు చేపట్టడానికి ఆయన కుమారులు అళగిరి, స్టాలిన్ ల మధ్య అంతర్యుద్ధం నడుస్తున్న విషయం తెలిసిందే.
స్టాలిన్ మొదటి నుండి పార్టీలో చురుగ్గా వ్యవహరిస్తుండగా, చాలా ఆలస్యంగా పార్టీలోకి వచ్చిన అళగిరి ప్రస్తుతం కేంద్ర మంత్రిగా ఉన్నారు. డిఎంకె పార్టీ అంతా ప్రస్తుతం స్టాలిన్, అళగిరి వర్గాలుగా విడిపోయి ఉంది. ‘దళిత సమాజ అభివృద్ధి కోసం నా చివరి శ్వాస ఉన్నంతవరకూ పాటు పడతా. నేను చివరి వరకూ పార్టీని చూసుకొంటాను. నా తర్వాత అన్నీ స్టాలిన్ చూసుకొంటారు’, అని కరుణానిధి నిన్న అన్నారు.
స్టాలిన్ కు పార్టీ పగ్గాలు ఇవ్వాలంటూ కొంత మంది పార్టీ నాయకులు కరుణ కు సూచిస్తున్నా, ఆయన ఇంత వరకూ మౌనం వహిస్తూ వచ్చారు. పిఎంకె పార్టీకి చెందిన సుమారు రెండు వేల మంది కార్యకర్తలు తన పార్టీలో చేరిన చేరిన సందర్భంగా కరుణానిధి మాట్లాడుతూ తన వారసుడిగా స్టాలిన్ అన్నారు. ఇప్పటివరకూ,పార్టీలోని నేతలంతా ఏదో ఒక వర్గానికి మద్దతుదారులుగా ఉన్నారు. ఇక ఎలాంటి పరిణామాలు చోటు చేసుకొంటాయో వేచి చూడాల్సిందే.
తన వారసునిగా ఎవరిని ఎంపిక చేస్తారనే విషయంలో ఎప్పటి నుండో పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న విషయం తెలిసిందే.