వీళ్ళు సీమసింహాలు కాదు..!

 

 

 

సింహం అవసరమైతే ఆకలితో చస్తుంది కానీ, గడ్డి మాత్రం తినదంటారు. కానీ, రాయలసీమ కాంగ్రెస్ రాజకీయ సింహాలు అవసరమైతే గడ్డి, ఇంకా అవసరమైతే చెత్తాచెదారం తినడానికి కూడా సిద్ధమయినట్టున్నాయి. నిన్న మొన్నటి వరకూ రాష్ట్రం సమైక్యంగా వుండాల్సిందేనని గర్జించిన రాయలసీమ కాంగ్రెస్ నాయకులు ఇప్పుడు రాష్ట్రాన్ని ఎన్నిముక్కలు చేసినా పర్లేదంటూ మ్యావ్‌మంటున్నారు. రాయల తెలంగాణా ఇచ్చేయాలని దారుణమైన ప్రతిపాదన కేంద్ర ప్రభుత్వం ముందుంచారు.

 

రాయలసీమ అంటే పౌరుషానికి ప్రతీక అంటారు. ఇప్పుడు అక్కడి కాంగ్రెస్ నాయకుల తీరు సీమ పరువును గంగలో కలిపేలా తయారైంది. ఇదేనా సీమ పౌరుషం అని నలుగురూ  నవ్వుకునే పరిస్థితి తెచ్చారు. వీరి తీరు ‘రాయలసీమ’ ఉనికికే ప్రమాదంగా మారింది. రాయల తెలంగాణ ప్రతిపాదన తెచ్చిన కాంగ్రెస్ నాయకులు నాలుగు రాయలసీమ జిల్లాలను తెలంగాణలో కలిపి రాయల తెలంగాణ ఏర్పాటు చేయాలని ప్రతిపాదిస్తే ఒక పద్ధతిగా వుండేది. అలా కాకుండా కర్నూలు, అనంతపురం జిల్లాలను మాత్రమే తెలంగాణలో కలపాలని డిమాండ్ చేయడం చాలా దారుణమైన, అవకాశవాదంతో కూడిన ధోరణికి పరాకాష్ట అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.



రాయలసీమ రెండు జిల్లాలు తెలంగాణలో కలసిపోయి సంతోషంగా వుంటే, రాళ్ళు తప్ప నీళ్ళులేని చిత్తూరు, కడప జిల్లాల పరిస్థితేంటి? కోస్తాంధ్ర జిల్లాల గురించి ఆలోచించకపోతే ఆలోచించకపోయారు.. కనీసం రాయలసీమలో వున్న మిగతా రెండు జిల్లాల గురించి కనీసం ఆలోచించని మీ స్వార్థానికి ఏ పేరు పెట్టాలి? కర్నూలు, అనంతపురం జిల్లాలకు చెందిన కాంగ్రెస్ నాయకులు మాత్రమే ఈ రెండు జిల్లాలు తెలంగాణలో కలవాలని కోరుతున్నారుగానీ, ప్రజలు మాత్రం ఈ ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇలాంటి ప్రతిపాదను చేయడానికి కాంగ్రెస్ నాయకులకు నోరెలా వస్తోందని తిట్టిపోస్తున్నారు. రాయలసీమ ఉనికికే ప్రమాదం ఏర్పడే ప్రయత్నాలు చేస్తున్న కొంతమంది రాయలసీమ కాంగ్రెస్ నాయకులు తమ దృష్టిలో సీమసింహాలు కాదని.. గ్రామసింహాలని రాయలసీమవాసులే విమర్శిస్తున్నారు. ప్రాణాలైనా అర్పిస్తాంగానీ, రాష్ట్రాన్ని, రాయలసీమని ముక్కలు కానివ్వమని నినదిస్తున్నారు.