ఏమిటిది ఎర్రబెల్లీ?!
posted on Nov 8, 2013 @ 3:39PM
తెలుగుదేశం పార్టీ అంటే క్రమశిక్షణకు మారుపేరు. కాంగ్రెస్ పార్టీలో తరహాలో ఎవరుపడితే వాళ్ళు నోటికొచ్చినట్టు మాట్లాడటం, మీడియాలోకి ఎక్కి రచ్చచేయడం తెలుగుదేశం పార్టీలో ఉండదు. ఈ క్రమశిక్షణే ఆ పార్టీకి ప్రజల్లో గౌరవాన్ని పెంచింది. ఆ క్రమశిక్షణే తెలుగుదేశం పార్టీకి పెట్టని కోటలాంటి కేడర్‌ని సంపాదించిపెట్టింది. అలాంటి తెలుగుదేశం పార్టీలో క్రమశిక్షణ గల కార్యకర్తగా పేరు తెచ్చుకున్న ఎర్రబెల్లి దయాకరరావు ఈమధ్యకాలంలో గీతదాటి మాట్లాడటం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.
పయ్యావుల కేశవ్, కోడెల శివప్రసాద్ వంటి తన సహచరుల మీద ఎర్రబెల్లి మాటల దాడి చేయడం చాలామందిని విస్మయానికి గురి చేసింది. తెలుగుజాతి క్షేమంగా వుండాలని, రాష్ట్ర విభజన కారణంగా ఏ ప్రాంతంలోని తెలుగువారూ నష్టపోకూడదని తన శాయశక్తులా కృషి చేస్తున్న చంద్రబాబుకు తన తమ్ముడు ఎర్రబెల్లి ధోరణి కొంత ఇబ్బందికరమే. అయినప్పటికీ, ఎర్రబెల్లి ఆవేదనను అర్థం చేసుకున్న ఆయన ఎర్రబెల్లి గీత దాటడాన్ని సహించారు.
అయితే తెలుగుదేశం పార్టీలో వున్న తెలంగాణ నాయకులు కూడా ఎర్రబెల్లి అంత బాహాటంగా తన సహచరుల మీద విమర్శల వర్షం కురిపించడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీకి ఏర్పడిన ఇబ్బందికర పరిస్థితులను సరిదిద్దడానికి, ప్రమాదంలో పడిన తెలుగుజాతిని కాపాడటానికి ఓవైపు చంద్రబాబు నాయుడు శ్రమిస్తుంటే, మరోవైపు ఎర్రబెల్లి ఇలా గీత దాటి మాట్లాడటం న్యాయం కాదని అంటున్నారు.
ఇలాంటి విపత్కర సమయంలో నాయకుడి వెంట నిలబడి నైతిక మద్దతు ఇచ్చి సమస్యల పరిష్కారానికి సహకరించాలే తప్ప తానే ఒక సమస్య కావడం ఎర్రబెల్లికి తగదని అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికైనా ఎర్రబెల్లి తన దూకుడును తగ్గించుకుంటే మంచిదని సూచిస్తున్నారు. తెలంగాణ అభివృద్ధి చెందడానికి ఎంతో కృషి చేసిన చంద్రబాబు చిత్తశుద్ధి ఎర్రబెల్లికి తెలియనిది కాదని అంటున్నారు.