తూర్పు-విశాఖ మధ్య వాటర్ వార్
posted on Feb 25, 2012 @ 3:03PM
రెండు జిల్లాల మధ్య చిచ్చుపెట్టిన ముఖ్యమంత్రి కిరణ్
విశాఖపట్నం: తాండవ జలాశయం నుంచి తాగునీటి తరలింపు వివాదం రెండు జిల్లాల మధ్య చిచ్చు రగిలిస్తోంది. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఎవరి సలహాలు తీసుకోకుండా నిధులు మంజూరు చేయడంతో విశాఖ జిల్లా ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ జిల్లానుంచి చుక్కనీటిని తరలించినా సాహించబోమంటూ హెచ్చరికలు చేస్తున్నారు. ఉద్యమాలు చేపడుతున్నారు.ఇక తామేమీ తక్కువ తినలేదేన్నట్లు తూర్పుగోదావరి జిల్లా నాయకులు కూడా బ్లాక్ మెయిల్ రాజకీయాలకు దిగుతున్నారు. తాండవ నీటిని విడిచిపెట్టకపోతే ఏలేరును అడ్డుకుంటామని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. తాండవ జలాశయంలో ఉన్న డెడ్ స్టోరేజీ 0.56 టిఎంసి నుంచి 0.5 టిఎంసి నీటిని తుని నియోజకవర్గానికి, 0.15 టిఎంసి నీటిని పాయకరావుపేటకు కేటాయిస్తూ తాగునీటి ప్రాజెక్టులను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఇందుకోసం రూ.80కోట్లు మంజూరు చేసింది. ఈ విధంగా తాండవనుంచి ఈ రెండు నియోజకవర్గాల్లో గల 207 గ్రామాలకు తాగునీటిని అందించాలన్నది ప్రభుత్వ నిర్ణయం. వాస్తవానికి వర్షాలు పూర్తిస్థాయిలో కురిస్తే తప్ప తాండవ నీరు చివరి ఆయకట్టుకు అందడం లేదన్నది రైతాంగం వాదన. ఇలాంటి పరిస్థితుల్లో ఇందులోని నీటిని తరలిస్తే ఆయకట్టు భూములన్నీ బీళ్లుగా మారతాయని వారంటున్నారు. ఈ నీటిని తరలిస్తే సహించేది లేదని హెచ్చరిస్తున్నారు.
మరోవైపు 22 ఏళ్లనుంచి తూర్పుగోదావరి జిల్లా ఏలేరు నుంచి విశాఖ తాగునీటి అవసరాలతోపాటు స్టీల్ ప్లాంట్ కు 5 టిఎంసిల నీటిని తరలిస్తున్నారు. ఇప్పటివరకు దీనిపై ఎటువంటి రాద్దాంతం చేయని తూర్పుగోదావరి జిల్లావాసులు తాండవ ప్రాజెక్టులను అడ్డుకుంటే ఏలేరు నీటిని నిలిపివేస్తామని హెచ్చరిస్తున్నారు. తాగునీటి సమస్య చివరకు రెండు జిల్లాల మధ్య వివాదం సృష్టించింది.