అరుణాచల్ ప్రదేశ్ గవర్నర్ గా మోత్కుపల్లి...
posted on Sep 14, 2016 @ 10:16AM
నిన్న మొన్నటి వరకూ తెలంగాణ టీడీపీ నేత మోత్కుపల్లి నర్సింహులను తమిళనాడు గవర్నర్ గా నియమిస్తారు.. ఈ మేరకు వినాయక చవితి తర్వాత కేంద్రం ఉత్తర్వులు జారీ చేస్తుంది అన్న వార్తలు జోరుగా సాగాయి. అయితే ఇప్పటి వరకూ అలాంటి ఆదేశాలు ఏమాత్రం రాలేదు. ఇదే తమిళనాడు గవర్నర్ పదవికి గుజరాత్ మాజీ సీఎం ఆనంది బెన్ పటేల్ కూడా పోటీ పడుతుండటంతో ఇద్దరిలో ఎవరికి ఇవ్వాలో కేంద్రం పెండింగ్లో పెట్టింది. దీంతో మోత్కుపల్లి కూడా ఒకింత నిరాశ చెందినట్టు వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు తాజా సమాచారం ప్రకారం.. మోత్కుపల్లిని అరుణాచల్‌ప్రదేశ్ గవర్నర్‌గా నియమితులు కానున్నట్టు సమాచారం. దీనిపై కేంద్రం కూడా త్వరలో నిర్ణయం తీసుకోనున్నట్టు తెలుస్తోంది.
ప్రస్తుతం ఖాళీ అయిన తమిళనాడు, అరుణాచల్ ప్రదేశ్, మధ్యప్రదేశ్ గవర్నర్ పదవులు త్వరలో భర్తీ చేయాలని భావిస్తున్న కేంద్రం ఇప్పటికే మోత్కుపల్లి బయోడేటాను తెప్పించుకున్నట్లు తెలిసింది. దీనిపై పీఎంవో అధికారులు, సీఎం చంద్రబాబుతో, మోత్కుపల్లితో సంప్రదింపులు జరిపినట్లు తెలిసింది. కాగా, తమిళనాడు గవర్నర్‌గా గుజరాత మాజీ సీఎం ఆనందిబెన్ పటేల్‌ను నియమించే అవకాశాలు ఉన్నాయి.