ఇజ్రాయిల్ మాజీ ప్రధానిని లోపలేశారు
posted on May 13, 2014 @ 5:12PM
చేతికొచ్చినట్టు అవినీతికి పాల్పడిన ఇజ్రాయిల్ మాజీ ప్రధాని యెహుద్ ఒల్మర్టకి టెల్ ఇజ్రాయిల్ చట్టాలకి అడ్డంగా దొరికిపోయాడు. ఈ అవినీతి తిమింగలం జెరూసలెం మేయర్‌గా, ఇజ్రాయిల్ పరిశ్రమలు, వాణిజ్య శాఖ మంత్రిగా వున్న సమయంలో భారీ స్థాయిలో అవినీతికి పాల్పడ్డాడని ఆయనపై ఆరోపణలు వచ్చాయి. అలాగే జెరూసలెంలో కూడా రియల్ ఎస్టేట్ కుంభకోణంలో కూడా ఈ సార్ హస్తం వుందట. యెహుద్ అవినీతి భాగోతం అంతా 2009లో బయటపడింది. అప్పటికి ఇజ్రాయిల్ ప్రధానమంత్రి హోదాలో అధికారం వెలగబెడుతున్న ఈ పెద్దమనిషి ప్రధాని పదవి నుంచి తప్పుకోక తప్పలేదు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయన అవినీతి మీద సుదీర్ఘ విచారణ జరిగింది. చిట్ట చివరికి ఆయనని కరుడుగట్టిన అవినీతిపరుడిగా తీర్మానించి ఆరేళ్ళు జైలు శిక్ష విధించారు. తీసుకెళ్ళి జైల్లో పడేశారు. ఇజ్రాయిల్ దేశంలో ఈ అవినీతి తిమింగలాన్ని తిట్టుకోనివాళ్ళే లేరు. ఇతగాడికి ఆరేళ్ళు జైలుశిక్ష పడటం ఇజ్రాయిల్ జనాలకి ఎంతో సంతోషం కలిగిస్తోంది. అయితే ఇంత జరిగినా యెహుద్ ప్రశాంతంగా జైల్లో కూర్చుంటానని అనడం లేదు. తనకు పడిన శిక్ష మీద పై కోర్టుకు అప్పీలు చేసుకుంటానని చెబుతున్నాడు. ఇలాంటి వ్యవహారాల్లో బాగానే ముదిరినట్టున్నాడు.