Previous Page Next Page 
కట్నమివ్వననకండి పేజి 12


    ఆ ఊళ్ళో నాన్నగారికి మొత్తం మూడిళ్ళున్నాయి. ఒకింట్లో మా వాళ్ళుంటున్నారు. మిగతా రెండూ అద్దెల కిచ్చారు. చంద్రం అనేది నాకు కొంత సబబుగానే తోచింది. "మేము అద్దె ఇంట్లో వుంటున్నాం . ఎలాగూ అద్దె ఇస్తున్నాం. అదే అద్దె మా నాన్నగారింటికీస్తే?"---
    ఇల్లూ బాగుంటుంది. ఇంట్లో స్వతంత్రంగానూ వుంటుంది.
    నేను నాన్నగారికి నా అభిప్రాయం చెప్పాను. "ఈ అభిప్రాయం నీదా - అతనిదా?" అనడిగారు నాన్నగారు . ఆయనలా అడిగినందుకు కోపం వచ్చింది తప్పితే అందులోని లోతు నాకర్ధం కాలేదు. వివాహమైన మా ఇద్దర్నీ అయన వేరుచేసి మాట్లాడడం నాకు బాధ కూడా అనిపించింది. ఆ క్షణంలో నాదేనని చెప్పాను.
    ఒకిల్లు ఆఫీసుకిచ్చారు. రెండో ఇంట్లో ఐదేళ్ళుగా ఒకాయన కుటుంబంతో వుంటున్నాడు. ఆయన్ను ఖాళీ చేయ్యమనడానికి నాన్నగారికి మనసొప్పడం లేదు.
    ఇది విని అమ్మ మండిపడింది. కట్నం లేకుండా పెళ్ళి చేసుకున్న ఉత్తముడైన అల్లుణ్ణి నాన్నగారు అకారణంగానే తక్కువ కట్టేశారని నిష్టూరమాడింది.
    ఫలితం చెప్పనక్కర్లేదు. ఓ రెండు మాసాల అనంతరం మేము ఆ ఇంట్లోకి మారాం.
    ఇంట్లో నెల్లాళ్ళు గడిచాక , "ఈ ఇంటికి అద్దె ఎంత ఇవ్వాలోయ్?" అనడిగారాయన.
    అంతవరకూ ఈ ఇల్లు మాకిచ్చి నాన్నగారెంతగా నష్టపోయారో నా బుర్రకు తట్టలేదు. మాకు వచ్చే జీతంలో మేమివ్వగలిగిన అద్దె రెండు వందలు మాత్రమే. నాన్నగారికీ ఇంటికి అరువందలు వచ్చేది.
    "పూర్వంలాగే రెండువందలు ఇద్దాం" అన్నాను. మాట్లాడకుండా అయన నాకు రెండువందలిచ్చారు. అవి తీసుకుని మా ఇంటికి వెళ్ళాను నేను.
    'ఇంటికి రేటు ఎవరు కట్టారు? అతనా - నువ్వా ?" అనడిగారు నాన్నగారు.
    "అయన కట్టమన్నారు. నేను కట్టాను." అన్నాను.
    'అతని తీరే వేరు. లోకంలో ఇలాంటి వారు ఎక్కడో గానీ వుండరు." అంది అమ్మ.
    నేను తిరిగి ఇంటికెళ్ళి ఈ విషయం చెబితే అయన ఆశ్చర్యపడలేదు. సంతోషించారు. అందుకు నేను ఆశ్చర్యపడ్డాను. అంతా అయన ముందే ఊహించినట్లుంది.
    డిశంబర్ లో కాబోలు అయన తన చేతీ వాచీ అమ్మేశారు. 'అదేంటండీ?" అంటే "ఇది ఫాషనై పోయింది. డిజిటల్ వాచీ కొనుక్కోవాలి " అన్నారు.
    జనవరిలో పెద్ద పండుగ వచ్చింది. మా పెళ్ళయ్యాక అదే మొదటి సంక్రాంతి. నాన్నగారాయనకు మోటారు సైకిల్ కొని ఇచ్చారు బహుమతిగా. నేనందుకు ఎంతో మొహమాటపడితే, "నా తాహతు కొద్ద్దీ అల్లుడికి బహుమతిగా ఇచ్చుకుంటున్నాను. ఇది నేను మనస్పూర్తిగా ఇస్తున్నది" అన్నారు.
    అప్పటికాయన చేతికి వాచీ లేదు. అందుకని మోటారు సైకిల్ తో పాటు ఆయనకు డిజిటల్ వాచీ కూడా కొన్నారు.
    మేమా ఊళ్ళో రెండు సంవత్సరాలున్నాం. తర్వాత ట్రాన్స్ ఫరయింది. ఈ రెండేళ్ళ లోనూ నాన్నగారు మమ్మల్ని ప్రతి పండుగకూ ఆహ్వానించి బట్టలు కాక వేరే ఏదో బహుమతి ఇస్తుండేవారు. దాని వెల కనీసం ఓ వంద రూపాయలుండేది.
    ట్రాన్స్ ఫరై ఊరు మారేక ఓ సారి హటాత్తుగా నాన్నగారి దగ్గర్నుంచి ఉత్తరం వచ్చింది.
    ఆయనకు వ్యాపారంలో అనుకోని పెద్ద నష్టం వచ్చింది.
    నేనూ, ఆయనా చూడటానికి వెళ్ళాం. వాళ్ళు మాకు బట్టలు పెట్టారు.
    "ఏమిటిది నాన్నా- ఇబ్బందుల్లో కూడా!" అని బాధపడ్డాను నేను"
    'చూడమ్మా! అంతా కట్నం దేబరించే రోజుల్లో అతను కట్నం లేకుండా పెళ్ళి చేసుకున్నాడు. అందుకతను చిన్నబుచ్చుకోకూడదు. ఖర్చులాంటావా? మీ కోసం పెట్టె ఖర్చు తోటి నా దరిద్రం తీరేది కాదు " అన్నారాయన.
    తర్వాత మాయింటి పరిస్థతి మారింది. ఆర్ధిక వైభవం అణగారింది.
    అప్పుడు నేను - నా భర్త అసలు స్వరూపాన్ని చూశాను.
    ఏ పండుగకు నాన్నగారాయన్ను పేక్షించినా , "పాతబడిపోయాను కదా - ఇంక నన్నెందుకు పట్టించుకుంటారు?' అనేవాడు. మా వాళ్ళ ఆర్ధిక పరిస్థితి గురించి ఆయనకు కించిత్తు కూడా సానుభూతి ఉండేది కాదు. మామగారి ఎదుటపడి అవీ యివీ కావాలని అడగరు కానీ, ఇస్తారన్న ఆశా, ఇవ్వాలన్న కోరికా ఉంది.
    నాన్నగారీయన న్నుపేక్షించడం లేదు. చేతనైనంతలో ఈయనకు డబ్బు పంపిస్తూనే ఉండేవారు. ఇలా ఏళ్ళు గడిచాయి.
    ఒకరోజాయన నా దగ్గరకు వచ్చి , "కళ్యాణి ! నువ్వు తలచుకుంటే చిన్న హెల్ప్ చేయగలవు " అన్నారు.
    'చెప్పండి ?" అన్నాను.
    "మనకు కారు అలవెన్సుంది . అలాంటప్పుడు ఈ వెధవ మోటారు సైకులేందుకు? ఓ సెకండ్ హాండ్ కారు అమ్మకాని కొచ్చింది. మోటారు సైకిల్ అమ్మగా, బ్యాంక్ వాళ్ళిచ్చే లోను పోగా, మనకింకా అయిదువేలు తక్కువయింది. మీ యింటి కుత్తరం రాస్తావా? ఎంత - రెండేళ్ళలో వాళ్ళ అప్పు తీర్చేద్దాం !" అన్నారాయన.
    అప్పటికి ఇంతవరకూ అన్ని అప్పులు తీర్చినట్లు....ఇప్పుడు తీర్చబోతున్నట్లు......
    "ఒక్కసారి అయిదు వేలు వాళ్ళు మాత్రం ఎక్కణ్ణుంఛి తెస్తారులెండి ? నా బంగారం తాకట్టు పెడితే...."
    అయన నా మాట పూర్తీ కానివ్వలేదు ---"భార్య బంగారం తాకట్టు పెట్టి కారుకొంటే , అదీ ఆప్ట్రారాల్ అయిదువేల కోసం..... మనకు అవమానం కళ్యాణీ" అన్నాడు.
    నేను ఇంటికి ఉత్తరం రాశాను. నా బంగారం తాకట్టు పెట్టడం ఈయనకు అవమానం కానీ, నా కోసం నా తల్లి బంగారం తాకట్టు పెట్టడం నాకు అవమానంకాదు.
    నాన్నగారి దగ్గర్నుంచి నా పేరున డ్రాప్ట్ వచ్చింది. ఈ  విషయం ఆయనకు ఫోన్ చేసి చెప్పాను. వెంటనే అయన ఉత్సహంగా ఇంటికి వచ్చేశారు.
`    సాయంత్రం ఇద్దరం కలిసి డబ్బు తీసుకుని, కారు అమ్మే అయన ఇంటికి వెళ్ళాం. అయన శేఖర్ కావడమూ, ఒకప్పటి నా స్నేహితురాలు లక్ష్మీని ఆ విధంగా కలుసుకోవడమూ నాకొక మరపురాని అనుభూతి.
    "మీరీ ఊళ్ళోనే ఉంటున్నారా?" అంది లక్ష్మీ ఆశ్చర్యంగా.
    "లేదు. ట్రాన్స్ ఫరయి నాలుగు నెలలైంది." అన్నాను.
    లక్ష్మీ భర్త శేఖర్ ని నేను తిరస్కరించాను. అతడు కొంత కాలం వాడి అమ్మబోతున్న కారును నా భర్త కొనాలని నన్నిక్కడకు తీసుకొచ్చాడు. ఏదో అపశ్రుతిలా ధ్వనించింది నాకు.
    మేమిద్దరం తెలిసిన వాళ్ళమని అయన మమ్మల్ని వదిలి శేఖర్ ని పట్టుకున్నాడు. వాళ్ళ కబుర్లు వాళ్ళవి, మా కబుర్లు మావి.
    కాసేపు అవీ యివి కబుర్లయ్య్యేక "ఏమిటీ - కారమ్మేస్తున్నారు....కష్టాలోచ్చాయా?" అన్నాను.
    "కంపెనీ వాళ్ళు అలవెన్సిస్తున్నారు గదా అని కారు కొన్నారు. ఇప్పుడు కంపెనీ ఈయన వాడకం కోసం కారు కూడా ఇస్తున్నది. కంపెనీ కారుండగా స్వంత కారెందుకనీ .....' అని అర్ధోక్తిలో ఆపింది లక్ష్మీ.
    "బాగుంది. అంత మాత్రాన స్వంత కారమ్ముకుంటారా/ కంపెనీ కారు స్వంత కారు కాదు గదా?"
    'అవుననుకో. కాని చెల్లెలి పెళ్ళికి డబ్బు కూడా అవసరమైంది. చేతిలో ఇది తప్ప లేదు" అంది లక్ష్మీ.
    'శేఖర్ కేంతమంది చెల్లెళ్ళు ఏమిటి ?" అనడిగాడు. నేను నన్ను లక్ష్మీతో పోల్చుకుంటూ చంద్రాన్ని శేఖర్ తో పోలుస్తున్నాను. చంద్రానికి లేని బాధ్యతలు శేఖర్ కున్నాయంటే అదో తృప్తి.
    "పెళ్ళి శేఖర్ చెల్లెలిది కాదు. నా చెల్లెలిది" అంది లక్ష్మీ.
    "నీ చెల్లెలి పెళ్ళికి శేఖర్ కారమ్మేస్తున్నాడా?" ఆశ్చర్యపోయాను.
    "ఇందులో ఆశ్చర్యమేముంది? ఇంటికి పెద్దల్లుడీయన . మా నాన్నకా మగపిల్లలు లేరు. అల్లుడైనా, కొడుకైనా ఈయనే కదా! పెళ్ళి వారు పదిహేను వేలు కట్న మడిగారని నాన్న తూగలేనన్నారు. అప్పుడీయన ధైర్యం చెప్పారు" అంది లక్ష్మీ.
    సంభాషణ మార్చాలని 'అయితే , మగళ్ళకి కట్నమిచ్చే పాడుబుద్ధి మీ యింట్లోంచి ఇంకా పోలేదన్నమాట?" అన్నాను.
    లక్ష్మీ నవ్వి, "ఏం కట్నమో లెద్దూ! కట్నం తీసుకున్న పేరాయనకు వచ్చింది. ఆయనకు ఆడపిల్లలన్నా వారి పరిస్థితులన్నా అంతులేని జాలి ఉంది. అయన కట్నమెందుకు తీసుకున్నారో నీకు తెలుసు. పాపం! ఆ తర్వాత నుంచి అయన మా యింటి నుంచి ఓ గుడ్డ ముక్క కూడా ఆశించలేదు. మా నాన్న మొదటి పండక్కి బట్టలు పెట్టాడని మరో రూపంలో ఆ ఖర్చు ముట్ట చెప్పారు. తర్వాత నుంచి ఈయన నాన్నకు చేసిందే తప్ప - నాన్న ఈయనకు చేసిందేమీ లేదు."
    నాకు కళ్ళు తిరిగాయి. ఆలోచిస్తే నాన్న ఆదర్శంలో లోపమున్నదనిపించింది. అయన కట్నాలను నిరసించారు. కానీ ఆశలను రోజు రోజుకీ నీరు పోసి పెంచి - ఇప్పటికీ ఓ మ్రానులా తయారు చేశారు. ఆయనకట్నం తీసుకోక పోయినా, మర్యాదల పేరిట ఆయనకు ముట్టిన డబ్బు సామాన్యమా? తల్చుకుంటే నా వళ్ళు జలదరించి పోతోంది.
    పెద్దవాళ్ళం మేమిలా కబుర్లు చెప్పుకుంటుంటే , పిల్లలు లోపల వాళ్ళ ఆటలు ఆడుకుంటున్నారు. మధ్యన ఏమయిందో ఏమో - నా కూతురు పరుగున వచ్చి , "అమ్మా! వీళ్ళ పాప కాన్వెంట్ డ్రెస్ టేరిలిన్ దే! ఎంత చెప్పినా నువ్వు వినవు. నాకు కాటన్ దే కుట్టిస్తావు" అంది.
    దాని అభియోగం అర్ధం చేసుకోడానికి నాకు కొద్ది క్షణాలు పట్టింది. తర్వాత నెమ్మదిగా - "కాన్వెంట్ డ్రస్సుకి నువ్వు టేరిలిన్ బట్టలు కొంటావా? అందం చందం లేని ఆ డ్రస్సు అంత డబ్బు వృధా కదూ" అన్నాను.
    లక్ష్మీ నవ్వి , 'ఆలోచిస్తే ఏది లాభమో నీకు తెలుస్తుంది. కాటన్ ని కుట్టించామనుకో, ప్రతి రోజూ శుభ్రంగా ఉంచకపొతే కాన్వెంట్ వాళ్ళు ఒప్పుకోరు కాటన్ గుడ్డల మురికి ఇంట్లో వదలదు. ఒకవేళ వదిలినా ఇస్త్రీ బాగా రాదు. అందుకని వారంలో అయిదు రోజులకీ అయిదు జతలు కుట్టించాలి. ఎందుకంటె ఏరోజుకారోజు ఉతికిచ్చే చాకలి ఉండడు. ఇంత జరిగాక ఆర్నెల్లు తిరక్కుండా అవి చిరుగు పట్టేస్తాయి. అదే టెర్లిన్ డ్రస్సులు తీయించావనుకో ----రెండంటే రెండు తీయిస్తే చాలు! ఇంట్లో ఉతుక్కోవచ్చు. ఇస్త్రీ అక్కర్లేదు. కనీసం రెండేళ్ళు మన్నుతాయి. అప్పుడైనా పోట్టాయినందుకు తీసేయాలి తప్పితే చిరిగి పోవు. ఆరంభంలో కాస్త ఖర్చెక్కువైనా చివర్లో ఇవే లాభంగా ఉంటాయి." అంది.
    ఈ మాటలు నాకు మామూలుగా అనిపించలేదు. ఏదో జీవిత సత్యం వాటిలో నిగూడంగా దాగి ఉన్నట్లు అనిపించింది.
    అప్పుడే నా భర్త చంద్రం, లక్ష్మీ భర్త శేఖర్ - ఏవో కబుర్లు చెప్పుకుంటూ ఓసారి లోపలకు వచ్చారు.
    నేను ఇద్దర్నీ చూశాను.
    నాకు నా భర్త ధరించినవి కాటన్ బట్టలుగానూ, శేఖర్ ధరించినవి టెర్లిన్ బట్టలుగానూ కనిపించాయి.

                                             ***

 Previous Page Next Page