కట్నమివ్వననకండి
వసుంధర
ఎవరో తలుపు తట్టారు.
ఇంట్లో మగాళ్ళంతా భోజనాలు చేస్తున్నారు.
"నువ్వెళ్ళి తలుపు తీయవే!" అంది అమ్మ.
వెళ్ళి తలుపు తీశాను. ఎదురుగా ఉన్న ఆయనకు సుమారు యాభై ఏళ్ళు ఉండవచ్చు. ముఖం చూడగానే వయసు స్పురించింది గానీ , ఎక్కడా చూసినట్లు అనిపించలేదు.
"నాన్నగారున్నారా అమ్మా?" అన్నాడాయన.
"భోంచేస్తున్నారండీ ! లోపలకు రండి!' అంటూ ఆహ్వానించాను.
కొత్తగా ఎవరైనా ఇంటికి వస్తే ముందు నాకే కుతూహలం అందుకని --- "నాన్నగారికి చెబుతాను మీ పేరు చెబుతారా?" అనడిగాను.
'పుగాకు కంపెనీ బాపన్న గారని చెప్పు. మీ నాన్నగారికి తెలుస్తుంది.
ఆ పేరు వినగానే ఆయనెవరో నాకు తెలిసిపోయింది. లక్ష్మీ తండ్రి అయన. లక్ష్మీ నా క్లాస్ మెట్. ప్రాణ స్నేహితురాళ్ళం కాకపోయినా మంచి స్నేహమే మాది. లక్ష్మీ తో పరిచయమై ఆర్నెల్లయింది. వాళ్ళ నాన్నగారు ట్రాన్స్ ఫర్ మీద పది నెలల క్రితం ఈ ఊరు వచ్చారుట. బియ్యే మొదటి సంవత్సరంలో నా గ్రూపులోనే చేరింది. అమెది కూడా నాకులాగే పెళ్ళి చదువు.
నేను లోపలకు వెళ్ళి నాన్నగారికి చెప్పాను. నాన్నగారు ఆశ్చర్యపడుతూ -----'ఆయనకు నాతొ పని ఏమిటి చెప్మా?" అని కాస్త పైకే అనుకున్నారు. నాన్నగారాశ్చర్య పడగానే నా కుతూహలం పెరిగింది.
నాన్నగారూ ఆయనా ఎప్పుడో ఒకసారి క్లబ్బులో కలుసుకున్నారుట. ఎవరో పరస్పర పరిచయాలు చేశారుట. ఇద్దరూ ఒకరికొకరు నమస్కారాలు పెట్టుకున్నారుట. ఆ తర్వాత మళ్ళీ కలుసుకోలేదుట.
నాన్నగారు త్వరగా భోం చేసి ఆయన్ను కలుసుకోడానికి వెళ్ళారు. ఏ గది తలుపు పక్కనో నిలబడి వాళ్ళ సంభాషణ వినడమే నా కర్తవ్యం.
ఇద్దరూ పరస్పరం కుశల ప్రశ్నలు వేసుకున్నాక, "మా ఇల్లు మీకెలా తెలిసిందండీ?" అనడిగారు నాన్నగారు. అంతకంటే సున్నితంగా అడగడం ఆయనకు చేత కాదు.
బాపన్న గారాట్టే నోచ్చుకున్నట్లు లేరు ---- "ఆడపిల్ల తండ్రిని, ఎన్ని అడ్రసు లైనా తెలుస్తాయి నాకు. ఇందులో ఆశ్చర్య మేముంది?" అన్నాడాయన.
నాన్న ఉలిక్కిపడి -----"కానీ నాకు పెళ్ళి కావలసిన అబ్బాయిలు లేరే!" అన్నాడు.
'చల్లకు వచ్చి ముంత దాచాడమెందుకు? ఇటీవల మీరు మీ అమ్మాయి కళ్యాణి కో పెళ్ళి సంబంధం చూశారుట కదా?' అన్నాడు బాపన్నగారు.
'అవును, ఈ సంగతి మీకెలా తెలిసినది?" అన్నారు నాన్నగారు ఆశ్చర్యంగా.
లక్ష్మీ నా క్లాస్ మేట్ . పెళ్ళి చూపులైన మర్నాడు నేను లక్ష్మీకి అన్నీ వివరంగా చెప్పాను.
కుర్రాడి పేరు శేఖర్. బియ్యే ప్యాసయ్యాడు. ప్రైవేట్ కంపెనీలో నెలకు ఏడువందల జీతం. ఉద్యోగం వచ్చాకనే పెళ్ళి సంబంధాలు చూడడం మొదలు పెట్టాడు . నాదే మొదటి కేసు.
శేఖర్ మనిషి బాగానే ఉన్నాడు. మాటల్లో కూడా సంస్కారం కనబడింది . కానీ....
మా నాన్నగారు ఆదర్శవాది. అన్నయ్య పెళ్ళికి కట్నం తీసుకోలేదు. నా పెళ్ళికి కట్న మివ్వదల్చుకోలేదు. అలాగని మాకు డబ్బు లేకపోలేదు. తలచుకుంటే అయన నాకు ఇరవై వేల దాకా కట్న మివ్వగలరు. కాని ఇవ్వరు. ఈయన ఆశయం కారణంగా నాకు పెళ్ళి కాదేమోనని అమ్మకు భయం. కానీ నాకు భయం లేదు. కట్నం ఆడదానికి అవమానం. మగవాడికి ఆడదాని తోడు అవసరం. పెళ్ళంటే ఒక ఆడది తన వాళ్ళందర్నీ వదులుకుని జీవితాంతం ఒక మగవాడికి తోడుగా ఉండడం కోసం వెళ్ళిపోవడం. అందుకు ఇస్తే గిస్తే మగవాడే కట్న మివ్వాలి. అడదివ్వడ మేమిటి ?
నేను జీవితాంతం కన్యగానైనా మిగిలిపోతాను గానీ కట్న మివ్వడానికి ఒప్పుకోను. నాన్నగారి ఆదర్శాన్ని నేను మనస్పూర్తిగా ఆమోదిస్తున్నాను.
శేఖర్ కి కట్నం కావాలి ఎనిమిదివేలు. అందుకు యేవో కుంటి సాకులు చెప్పాడు. ఏ పరిస్థితుల్లో తను కట్నం తీసుకోబోతున్నాడో అతడి తండ్రి వివరించాడు.
కట్నం మాటల దగ్గరే ఆ సంబంధం చెడిపోయింది.
నేనీ వివరాలన్నీ లక్ష్మీకి చెప్పాను. లక్ష్మీ తండ్రికి చెప్పింది. బాపన్నగారిక్కడకు వచ్చారు.
'అయితే మా అమ్మాయి నుంచి వచ్చిందన్న మాట మీకు సమాచారం." అంటూ నవ్వారు నాన్నగారు.
"అవునండీ !" అని ఓసారి ఇబ్బందిగా దగ్గి ----"మీరా సంబంధం వదులుకున్నారని తెలిసింది. అందుకు కారణాలు తెలుసుకుందామని వచ్చాను " అన్నాడు బాపన్న గారు.
'అంటే?"
"కుర్రాడి వివరాలన్నీ బాగానే ఉన్నాయి. అడిగిన కట్నం కూడా ఎక్కువ లేదు. ఆ సంబంధం మీరు వదులుకున్నారంటే ఆశ్చర్యమేసింది?"
"కారణాలకు ఏముందండీ! కుర్రాడి క్కట్నం కావాలి. నేను కట్నమిచ్చే టైపు కాదు. నాపిల్లను చూసి పెళ్ళి చేసుకోవాలి గానీ, దాని వెనుక ఉన్న డబ్బును చూసేవాడికి నేను పిల్ల నివ్వదల్చు కో లేదు "అన్నారు నాన్నగారు.
'ఇంతేనా ? ఇంతకుమించి కారణాలేమీ లేవా?" అన్నాడు బాపన్నగారు.
'అంటే?"
"కుర్రాడిలో ఏమైనా లోపాలు కుర్రాడి వంశంలో ఏమైనా...."
"అలాంటి వుంటే నేను వ్యవహారాన్ని పెళ్ళి చూపుల దాకా రానిచ్చే వాడిని కాదు" అన్నారు నాన్నగారు.
మాయింట్లో నేనేపెద్ద ఆడపిల్లను. నాన్నగారు కట్నమివ్వనని చెబుతుంటే పెళ్ళిళ్ళ పేరయ్య కూడా అంత సీరియస్ గా తీసుకోలేదు. అన్నీ సరిపోతే ఆ మాత్రం కట్నమివ్వరా అనుకున్నాట్ట. లేకపోతే శేఖర్ నన్ను చూడడం జరిగి ఉండేది కాదు.
బాపన్నగారి ముఖం వికసించింది. "అయితే మీరీ సంబంధం వదులుకున్నట్లేగా?"
"ఏం? మీరు చూసుకుందామనా?" అడిగారు నాన్నగారు. అంతకంటే సున్నితంగా అడగడమాయనకు చేతకాదు.
"అవునండీ! మంచి సంబంధాలు దొరకడమే కష్టంగా ఉన్నాయి. ఈమాత్రం సంబంధం ఏడెనిమిది వేలలో ఉందంటే ఆశ పుట్టింది. మీరు వదులుకున్నారంటే కుర్రాడిలో ఏమన్నా లోపాలున్నా యేమో ననుకుని భయపడ్డాను. చాలా థాంక్స్ అండీ ! మీకు శ్రమ ఇచ్చి నందుకు మన్నించండి" అంటూ లేచాడు బాపన్నగారు.
నాన్నగారయన వంక ఆశ్చర్యంగా చూశారు. బాపన్నగారు వెళ్ళిపోయాడు.
ఈ సంబంధం లక్షికి చూస్తున్నారంటే నాకు ఓ రవ్వ అసూయ లాంటిది కలిగింది. ఎంత విలువ లేని వస్తువు కి కూడా ఎవరో ఒకరు దానిపట్ల ఆసక్తి చూపిస్తే విలువ వస్తుంది. శేఖర్ ని నేను కోల్పోతున్నానని భయం కూడా వేసింది. అయితే నా భయాన్నబద్దం చేస్తూ చంద్రం నీ జీవితంలో ప్రవేశించాడు.
చంద్రం బ్యాంకులో గుమస్తా. మనిషి నాకు నచ్చేటంత బాగుంటాడు. ఓరోజు బస్ స్టాప్ లో చూసినన్ను పలకరించాడు. నేను బదులిచ్చాను. ఆతర్వాత ఒకరోజు కాలేజీ గేటు దగ్గర పలకరించాడు. అతని వరస నాకు నచ్చక, "మీకు నాతొ మాట్లాడాలని ఉంటే మా యింటికి రాకూడదూ?" అన్నాను.
"అడ్రసు చెబితే అలాగే వస్తాను." అన్నాడతను తాపీగా.
నేను అడ్రసు చెప్పాను. అతను వచ్చాడు.
అయితే నేనతడితో మాట్లాడలేదు. నాన్నగారతనితో మాట్లాడారు.
"కట్నమా? అదంటేనే నాకు అసహ్యం!" అన్నాడతను.
చంద్రానికి తల్లీ తండ్రీ లేరు. బరువు బాధ్యతలు లేవు. చీకూ చింతా లేని జీవితం.
చంద్రం ఇంటికి పేరుకు పెద్దగా అతడి బాబాయివున్నాడు. నాన్నగారాయన కుత్తరం రాశారు. పేరుకు పెళ్ళి చూపులు జరిగాయి. సింపుల్ గా మా వివాహం జరిగి పోయింది.
అన్నట్లు అదే ముహూర్తానికి బాపన్న గారి కూతురు లక్ష్మీకి పెళ్ళి కూడా అయింది శేఖర్ తో.
చంద్రం మంచివాడు. అతడు నన్నెంతో అపురూపంగా చూసుకుంటున్నాడు.
అతడికి నేను తప్ప లోకం లేదు. కానీ.....
అతడికి తాహతుకు మించిన కోరికలున్నాయి. పగటి కలలు కనే లక్షణాలున్నాయి.
చంద్రం లేమిలో పుట్టి, లేమిలో పెరిగాడు. ఉద్యోగం రాగానే అతడి జీవితం మారిపోయింది. ఒకప్పుడు అతనంటే నిర్లిప్తత వహించే బంధువుల్లో ఇప్పుడతని పట్ల గౌరవ భావం పెరిగింది. అందుకే అతను వారందరికీ దూరంగా వుంటూ నన్ను కట్నం లేకుండా వివాహం చేసుకున్నాడు.
ఇప్పుడతని కోరిక బంధువుల్లో తన హోదా గుర్తించబడాలని "
కాని అతడింకా బ్యాంక్ గుమస్తాయే! అంతకుమించిన గుర్తింపు అతనికి కావాలి?
పెళ్ళి కాగానే మామగారింట్లోకి మకాం మార్చాలని అతడికుంది. ఆ ఆహ్వానం మామగారి నుంచి రావాలని అతడు ఆశించాడు. ఆ ఆశ నెరవేరకపోవడంతో భార్య ద్వారా సూచించాడు.