Previous Page Next Page 
పిట్ట తగవూ పేజి 13

                                 


                                         పిట్ట తగవూ
                                                                        వసుంధర

                             

        
    
    శారదమ్మ మరిది వద్దనే ఉంటున్నది. ఆమెకు భర్త లేడు. మరిది ఆమె కంటే రెండు సంవత్సరాలు చిన్న, శారదమ్మకు పిల్లలు కూడా లేరు.
    శారదమ్మ మరిది సొంబాబుకు వదిన గారంటే ఎంతో గౌరవం. అందుక్కారణం ఆమె ఆస్తి అని కొందరంటారు. కానీ అది నిజం కాదు. ఎటొచ్చీ సోంబాబు భార్య గౌరీ ఆమెను గౌరవించడానికి అదే కారణమంటే అందులో పొరపాటు లేదు.
    ఆ యింట్లో నాలుగు కాలాలపాటు శాంతియుతంగా తను మనగలగాలంటే గౌరిని మంచి చేసుకోనడం అవసరమని శారదమ్మకు తెలుసు. అందుకోసం ఆమె గౌరీ కోసం ఏటా అయిదారు వేలదాకా ఖర్చు చేస్తుంది.
    శారదమ్మ తండ్రికి ఒక్కగానొక్క కూతురు. తల్లిని అయిదో ఏటనే కోల్పోయింది . తండ్రి ఆరోగ్యం అంతంత మాత్రం. అందుకని అయన మాధవరావుని ఇల్లరికం తెచ్చుకున్నాడు. ఆయనకు పాతికేకరాల మాగాణీ ఉన్నది. మూడు లక్షల క్యాషు బ్యాంక్ లో ఉన్నది. యాభై తులాల బంగారం , లంకంత కొంప !
    మాధవరావు లేని కుటుంబం నుంచి వచ్చాడు. మెట్రిక్ ప్యాసు కాగానే తండ్రి అతణ్ణి ఉద్యోగంలో పెట్టాడు. ఆయనకు నలుగురు కూతుళ్ళు. ఇద్దరు కొడుకులు. పెద్దవాడు మాధవరావు. రెండోవాడు సోంబాబు.
    మాధవరావుకు శారదమ్మ సంబంధం రావడం చాలా అదృష్టంగా అతడి బంధు వర్గంలో వారంతా అసూయగా చెప్పుకున్నారు. అతడత్తవారింట పాదం పెట్టిన ఆర్నెల్లకు మామగారు పొతే అది ఇంకా అదృష్టమని చెప్పుకున్నారు. ఇంత అదృష్టాన్ని మాధవరావు భరించలేక పోయాడో - ఏమో - మాధవరావు వివాహమైన రెండేళ్ళకు మోటార్ సైకిలు ఏక్సిడెంట్లో మరణించాడు. అప్పుడు శారదమ్మ ఆరునెల్ల గర్భంతో ఉన్నది. దురదృష్టం అమెదేనని అంతా చెప్పుకున్నారు. శారదమ్మ మాత్రం ఆశలన్నీ తనకు పుట్టబోయే కొడుకు మీద పెట్టుకున్నది. అయితే అదృష్టం ఆమెను మరో సారి పరిహసించింది. ఆమెకు మృత శిశివు జన్మించాడు. అతి కష్టం మీద ఆమె బ్రతికి బయట పడింది. అది అదృష్టమో దురదృష్టమో ఆమెకు తెలియలేదు.
    శారదమ్మ ఆస్తి మీద చాలామంది కన్నేశారు. ఆమె మాత్రం ఆస్తి సొంబాబును రప్పించుకుంది. నలుగురూ రకరకాల అనుకున్నా ఆమె లెక్క చెయ్యలేదు. సొంబాబుకు గౌరితో వివాహమై- భార్య కాపురానికి వచ్చేక కొన్నాళ్ళు అతడి కిబ్బందిగా ఉన్నది. గౌరీ శారదమ్మ పట్ల అపోహను కలిగి ఉండడం అందుకు కారణం. తనది అపోహ అని తెలుసుకొనేందుకు గౌరీకి ఎంతో కాలం పట్టలేదు. అయితే గౌరీకి, శారదమ్మకూ ఎవరూ ఊహించని విధంగా మరో అందుకు గొడవలు వచ్చాయి.
    వివాహమైన ఏడాదికి గౌరికి పండంటి కొడుకు పుట్టాడు. వాడికి మాధవరావు అనే పేరు పెట్టారు. తన ప్రేమను ఎవరికి పంచి పెట్టాలో తెలియక అల్లాడి పోతున్న శారదమ్మకు మాధవరావొక ఆసరాగా అనిపించాడు. తన ప్రేమతో ఆమె వాడిని ఉక్కిరి బిక్కిరి చేయసాగింది. శారదమ్మ తన కొడుకును ముద్దు చేయడం గౌరికి ఇష్టమే! మొదట్లో ఆమె ఆ విషయాన్నంత సీరియస్ గా తీసుకోలేదు.
    రెండు సంవత్సరాల తర్వాత కాబోలు గౌరికి చిన్న యాక్సిడెంటయింది. అందుకు ఆపరేషన్ చేయవలసి వచ్చింది. ఆమెకు ఇంక గర్బం రాదనీ డాక్టర్లు చెప్పారు.
    అప్పుడు గౌరీ తన కొడుకు మీద దృష్టిని కేంద్రీకరించింది. వాడొక్కడే తన కొడుకు. వాడిని తన నుంచి ఎవరూ వేరు చేయరాదు. మాధవరావు శారదమ్మ చుట్టూ తిరుగుతుంటే గౌరీ సహించలేక పోయేది. శారదమ్మ, గౌరీ ప్రేమాభిమానాలతో మాధవరావును ముంచెత్తి ఉక్కిరిబిక్కిరి చేస్తుండేవారు.
    నేను మాధవరావు వయసువాడినే . మాది వాళ్ళకు ఎడురిల్లు. వాడికి అయిదో యేట నుంచీ నాకు చాలా విషయాలు గుర్తున్నాయి. మేమిద్దరం మంచి స్నేహితులం. అయినా నాకు వాడంటే అసూయగా ఉండేది. శారదమ్మ కు డబ్బున్నది . సోంబాబుకు ఆమె అంటే ఎంతో గౌరవమున్నది. ఈ రెంటికీ అభిమానాన్ని జతపరచి మాధవరావును పూర్తిగా తన వాడిని చేసుకోవాలని శారదమ్మ అత్రపడేది. గౌరీ కి తను వాడి కన్న తల్లి నాన్న గర్వం, అహంకారం ఉన్నవి. శారదమ్మ వాడిని పూర్తిగా తన వాడిని చేసుకుంటుందేమోనన్న భయం ఉన్నది. వీటికి తన అభిమానాన్ని జతపరిచి వాణ్ణి చూసుకునేదేమో!
    సమక్షంలో ఇద్దరూ బాగానే ఉండేవారు. మాధవరావు కాస్త కనుమరుగు కాగానే ఆ తల్లులిద్దరూ కాట్లాడుకునేవాడు.
    "వాడు నా ఆస్తికి వారసుడు....' అనేది శారదమ్మ!
    "వాడికి మాకులా బానిస బతుకు వద్దు. వాడికి మంచి ఉద్యోగం వస్తే మేమంతా వాడితో వెళ్ళిపోతాం " అనేది గౌరీ.
    వాళ్ళంతా తన్ను నిజంగా వదలి వేళ్ళీపోతారేమోనని శారదమ్మ భయపడేది. వాడికి బాగా చదువు రాకూడదని ఆమె కోరుకునేది. వాడు పరీక్షల్లో సినిమాకు వెడతానన్నా తను ప్రోత్సహించేది.
    ఇంత ఆస్తి వదులుకుని వెళ్ళి పోవాల్సోస్తుందని గౌరీ భయపడేది. కొడుక్కు బాగా చదువు రాపోతే ఆ వంకతో ఇక్కడుండి పోవచ్చునని ఆమె అనుకునేది. అయితే ,మాటల్లో అహం మాత్రం తగ్గేది కాదు.
    క్లాసులో మాధవరావు పాఠల పట్ల శ్రద్ధ వహించేవాడు కాదు. చెడు అలవాట్లు అంట లేదు కానీ, దర్జాగా ఉండేవాడు. వాడు నా స్నేహితుడు కావడం నా అదృష్టమే! నా ఖర్చులు చాలా వరకూ వాడు భరించేవాడు. టెన్త్ క్లాసులో ఇద్దరం విడిపోయాం.
    నేను పట్నం వెళ్ళి పోతుంటే మాధవరావు దిగులుగా - "నేనూ పరిక్ష ప్యాసై ఉంటె దర్జాగా పట్నం వచ్చి బ్రతికేవాణ్ణి ' అన్నాడు. మాధవరావుది ఒక్కటే కోరిక - తల్లులిద్దరూ తనకోసం పోట్లాడుకోకుండా అన్యోన్యంగా ఉండాలని. ఎన్నో ఏళ్ళుగా ఆ తల్లులిద్దర్ని చూసిన మీదట నాకు వాడి కోరిక సాధ్యపడేదిగా తోచలేదు.
    నేను క్రమంగా మాధవరావుకు దూరమై పోయాను. నా జీవితం నాది. వేరే పట్నంలో ప్రభుత్వద్యోగంలో స్థిరపడ్డాను. ఉద్యోగం రావడం తోనే నాకు పెళ్ళి సంబంధాలు రావడం మొదలు పెట్టాయి. పెళ్ళి చూపుల కని నేను ఇంటికి వచ్చాను.
    అప్పుడు నా కళ్ళబడింది - ఓ అద్భుత దృశ్యం.
    శారదమ్మ , గౌరీ - వాళ్ళింటి అరుగు మీద కూర్చుని - ఎంతో అన్యోన్యంగా కబుర్లు చెప్పుకుంటున్నారు. నా కళ్ళను నేనే నమ్మలేక పోయాను. ఓసారి వెళ్ళి పకలరించాలనిపించింది.
    ఇద్దరూ నన్ను ఆప్యాయంగా పలకరించారు.
    "మాధవరావేడీ?" అన్నాను.
    దాంతో యిద్దరి ముఖాలు అదోలా అయిపోయాయి.
    "వెధవకి - వాళ్ళమ్మ ఎంత చేసింది ? కళ్ళలో వత్తులు వేసుకుని పెంచింది. అయినా కృతజ్ఞత లేదు" అన్నది శారదమ్మ.
    "కన్నతల్లిని నేనా, తనా అని అనుమానం వచ్చేటంతలా మా అక్కయ్య వాణ్ని చూసుకుంది. వెధవకి- ఆవిడ ఊసే అక్కర్లేకుండా పోయింది." అన్నది గౌరీ.
    "ఏం జరిగిందండీ ?" అన్నాను.
    "ఏం జరిగితే ఏంలే నాయనా? నువ్వైనా పెళ్ళయ్యాక నిన్ను కని పెంచిన వాళ్ళను కాస్త గుర్తుంచుకో. యిరవై నాలుగ్గంటలూ పెళ్ళాం కొంగు పట్టుకుని - అదేం చెబితే అదే చేయాలనుకోడం గొప్ప కాదు ' అన్నది గౌరీ.
    విషయం నాకు అర్ధమైంది. మాధవరావు వీళ్ళను నిర్లక్ష్యం చేస్తున్నాడని నేననుకోను. పెళ్ళయ్యాక వాడు భార్య ఆకర్షణలో పడి ఆమె సమక్షాన్ని ఎక్కువగా కోరడం వీళ్ళీద్దరూ సహించలేక ఒకటయ్యారన్న మాట!

                                             ***

 Previous Page Next Page