అనుపమ లక్కబుడ్డిలాంటి నోరుతేరిచి దానిమ్మగించలలాటి పలువరుస కనపడేటట్లు ఫక్కున నవ్వింది.
" అనూ! నువ్వు నవ్వితే యింకా బాగుంటావు.పెద్ద పెద్దకళ్లు మూసుకుపోయి,బుగ్గలు సొట్టపడి భలే అందం వస్తుంది. ఎంత సేపయినా నిన్ను చూస్తూ కూర్చోవచ్చు" రాజు కళ్ళార్పకుండా అనుపమను చూస్తూ అన్నాడు.
"రాజూ !అబద్ధం ఆడుతున్నావు. నేను బాగుంటానా? ఎలా బాగుంటాను. నాకు కళ్లులేవుగా?" అనుపమ రెట్టిస్తూఅంది.
రాజు బాధగా అనుపమవైపు చూచాడు.
"అనూ!నీకు కళ్లున్నాయి, చూడలేవు, అంతే,....నీ కళ్ళెంత అందంగవుంటాయె తెలుసా? సన్నగా, విల్లంబులాగా ఒంకుతిరిగి కనుబొమ్మలుంటాయి. కళ్లు పెద్దపెద్దవి. కనుగుడ్లు తెల్లగా.... పాపలు నల్లటి నలుపుతో వుంటాయి. నీకళ్లు లాటికళ్లు ఎవరికీలేవు......" రాజు చెప్పకు పోతున్నాడు.
"విల్లంబు, నలుపు తెలుపు...." అనుపమ తనలోతాను మననం చేసుకుంటున్నది.
శబ్దం బైటకురాకుండా కదులుతున్న అనుపమ పెదవులు చూచి ఏకధోరణిలో చెప్పుకుపోతున్న రాజు ఆగిపొయ్యాడు. అలాగే పెదవుల వైపు చూస్తూ కూర్చున్నాడు. పెదవుల కదలిక గమనిస్తు.
అనుపమ యింకా తన లోతాను విల్లంబు... నలుపు... తెలుపు గురించి ఆలోచిస్తున్నది.
"నలుపంటే ఎలావుంటుంది? రాజేశ్వరి అయితే తనకి నల్ల జాకిట్టు యిష్టం ఎప్పుడు నల్ల జాకిట్టే కుట్టించుకుంటాను అంటుంది. పాలు తెల్లగా ఉంటాయని ఓ రాజు అమ్మ చెప్పింది. జాకిట్లు అన్నిరంగుల్లో వుంటాయి. కానిపాలు తెల్లగామాత్రమే వుంటాయట. మరో రంగులో వుండవట. కొందరికి నలుపు యిష్టంకదా! పాలుకూడా నలుపురంగులోవుంటే బాగుండేది. అసలు నలుపు, తెలుపు, రంగులంటే ఏమిటో?ఎలావుంటాయో? విల్లంబు ఏ రంగుల్లో వుంటుందో, నల్లగానా? తెల్లగానా?"
" విల్లంబు ఏరంగులో వుంటుంది రాజా?
అనుపమ ప్రశ్న విని ఉలిక్కిపడ్డాడు రాజు.
"తెల్లగా ఉంటుందా? పోనీ నల్లగావుంటుందా?" అనుపమ తిరిగి అదేప్రశ్న వేసింది.
"విల్లంబు ఏరంగుగా ఉంటుందంటే ,అది,అది ఆ విల్లంబు కర్రరుంగులో ఉంటుంది. చెక్కలు కర్రలు ఒకేరంగుగా ఉంటాయి. పల్లంబు ఆరంగన్నమాట" విల్లంబురంగేదో చెప్పగలిగానన్నట్లు తృప్తి పడ్డాడు రాజు.
"తెలుపు, నలుపు ఎరుపు యిలా టిరంగులుగాక చెక్కరంగుకూడా వుంటుదన్నమాట.చెక్కరంగు జాకిటు బాగుంటుందా రాజూ?"
"ఓ ! బాగుంటుంది. విల్లంబులా అందంగా?"రాజు పెదవులు బిగపట్టి చెప్పాడు.
"ఎందుకు నవ్వుతున్నావ్ రాజూ?" చూడ లేక పోయినా శబ్ద గ్రహణ శక్తివల్ల వెంటనే అడిగింది అనుపమ.
"ఆ రంగుజాకిట్లు ఎవరూ వేసుకోరు," రాజు చిన్నగా చెప్పాడు.
" అందుకున్నమాట నువ్వు నవ్వింది"
రాజు మౌనంవహించాడు.
కాసేపు ఆగి అనుపమ అంది.
"రాజూ! నువు రోజూ ఆడుకోవటానికి రావటం లేదెందుకని?"
"మామయ్య ప్రైవేటు మాష్టారుని కుదిర్చాడు.స్కూలుకాంగానే ప్రైవేటు సమయం సరిపోతున్నది." వెంకట్, రామం వాళ్ళలాగా మిడిమిడి చదవులు చదువుతావా? పెద్దచదువులు చదివి గొప్ప ఉద్యోగం చెయ్యాలి. వాళ్ళతో ఆటలేమిటి? "అని మామయ్య కోప్పడ్డాడు."
"అయితే రోజూ ఆడుకోవటానికి రావా"? అనుపమ ఆతృతగా అంది.
"ఉహు! ఆడుకోటానికి రాను. నిన్ను చూడటానికి వస్తాను."
"తప్పకుండా రావాలి రాజా! నీవు రాకపోతే నాకు ఎలాగో ఉంటుందీ."
"నిన్ను చూడకపోతే నాకూ అలాగే ఉంటుంది అనూ! తప్ప కుండావస్తాను." రాజు స్థిరంగా అన్నాడు.
రాజు అలా అంటే ఎందుకో అనుపమకు సంతోషం కలిగింది.
రాజు ఎలావుంటాడో అనుపమ తెలియదు. చక్కగా కబుర్లు చెపుతాడు. తననెవరయినా ఆటలు పట్టిస్తే కోప్పడతాడు. అంతే తెలుసు. కబుర్లు చెపుతాడు. కధలుచెపుతాడు, నవ్విస్తాడు.
రాజు మంచివాడు .అనుపమ మనసులో ముద్రపడిపోయింది.
"చీకటి పడబోతున్నది . వెళదామా అనూ!" అన్నాడు రాజు నలువైపులా ఓసారి చూచి.
అనుపమ కు చీకటి వెలుతురుకు భేదం తెలియదు. చీకటి పడ్డతరువాత బైటతిరిగితే తల్లికోప్పడుతుంది. అందుకే రాజు వెళదాం అనగానే లేచి నిలబడింది.
అనుపమ చెయ్యిపుచ్చుకుని రాజు బలరామయ్యగారి దొడ్లోంచి బైటకు వచ్చాడు.
అనుపమ చెయ్యి వదిలేశాడు రాజు.
"జాగ్రత్తగా వెళతావుగా?"
అలాగే అన్నట్లు అనుపమ తల ఊపింది.
అనుపమ వెళుతుంటే చూస్తూనుంచున్నాడు రాజు.