Previous Page Next Page 
విరాజి పేజి 22

   

  ఒక నవల రాసేటప్పుడు రచయితపడే సంఘర్షణ, మానసిక వేదన పాఠకులు అర్ధంచేసుకోలేరు. పాత్రల్ని చెప్పుచేతల్లో వుంచుకొనేందుకు రచయితా ఎంత శ్రమపడుతూ వుంటాడో,అని తమ కంట్రోల్ తప్పిపోకుంటా ఎలా తపించి పోతూవుంటాడో వాటిని లేక ఇతివృత్తాన్ని సర్వంగాసుందరంగా తీర్చిద్దిద్దటానికి ఎలా సర్వశక్తులు కూడదీసుకుంటాడో వాళ్ళు ఊహించలేరు.

    గౌతమ్ ఇంకో ఉత్తరం వచ్చింది.

    "నువ్వు మమ్మల్ని మరచిపోయావో లేదోగాని మేము మాత్రం ఎప్పుడూ నిన్నే తలుచుకుంటూ వుంటాము. మీ నాన్నగారు నీ ప్రసక్తి వచ్చినప్పుడల్లా చాలా బాధపడుతూ వుంటారు. పత్రికల్లో నీ పేరు చూసి నప్పుడల్లా మేము మురిసిపోతూవుంటాము. ఆ మధ్య నీకు సన్మానం జరిగిందని విని సంతోషించాము. నీ చెల్లెళ్ళు, నీ పేరు పత్రికల్లో చూసి నప్పుడల్లా ఎగిరి గెంతులేస్తూ వుంటారు __ 'మా అన్నయ్య' అని గర్వంగా చెప్పుకుంటూ.

    నిన్ను కనకపోయినా __ నా పిల్లల్తో సమానంగానే చూసుకున్నాను. గౌతం నిన్ను అప్పటికీ యిప్పటికీ నా బిడ్డగానే భావిస్తున్నాను. నిన్నేడు చూడాలా అని కలవరిస్తున్నాను.

    అవకాశ మొస్తే కనిపిస్తావుకదూ?

    నీవు యింకా పైకి రావాలని ఆకాంక్షిస్తూ __

                                                                                                                                         నీ తల్లి
                                                                                                                                     ఈశ్వరమ్మ

    అతని కంట్లోంచి ఓ కన్నీటి చుక్క రాలి పడింది.

                                  ***     

    ఆక్రందన నవలకు యిచ్చిన బహుమతి అయిదువేలు రూపాయలు అతనికి చేరాయి.

    "ఈ డబ్బు ఏంచేద్దాం?" అనడిగాడు విరాజిని.

    "మొదట కడుపునిండా భోజనం చేద్దాం."

    గౌతం నవ్వాడు. " అది సరే! మనమిద్దరం భోజనం చెయ్యగా యింకా చాలా డబ్బు మిగులుతుంది. అది ఏం చేద్దామని?"

    "ఏం చేద్దామబ్బా!"

    అంది కనుబొమ్మలు ముడిచి ఆలోచిస్తున్నట్టు .

    "నాకో ఆలోచనవచ్చింది."

    "ఏమిటబ్బా?"

    "నువ్వు కాదనకూడదు ."

    "అవును."

    "ప్రామిస్?"

    "ప్రామిస్ "అంటూ అతని చేతిలో చెయ్యివేసింది.

    "ఇద్దరం కలసి ఓ బ్యాలే తయారుచేద్దాము. ఒక సామాజిక ప్రయోజనం గల ఇతివ్రుతాన్ని ఎన్నుకుందా౦."

    "రవీంద్రభారతిలో ప్రజలు కలకాలం మరచిపోలేని ఓ అపురూపమైన నృత్యప్రదర్శనాన్ని యిద్దాం. బ్యాలేలో ముఖ్యపాత్ర నీది, నీవు అంతా నీ ఆధ్వర్యంలో నడుస్తుంది. నేను తెరవెనుక వుంటాను."

    "గౌతం ! నా గురించి ఎంత ఆలోచిస్తున్నావు నువ్వు" అంది విరాజి అర్దస్వరంతో, ఆమె కన్నుల్లో ఓ మెరుపు మెరిసింది.

    ఆమె చిరకాల వాంఛ జీవితాశయం నెరవేరేరోజు చివరకు దగ్గరలో పడింది.

    అతని చేతిలో ఆమె చెయ్యి అలాగేవుంది. ఆ చేతిలో ఏదో స్పందన .

    ఆత్మీయతతో ఆప్యాయతలో అనురాగంతో పులకించి ఆ చేతిని తన పెదవుల దగ్గరకు చేర్చి మృదువుగా చుంభించింది.

                              *    *    *       

    అప్పట్నుంచీ రోజూ యిద్దరూ కలసుకునే వాళ్ళు. మొదటివారం పదిరోజులూ యితివృత్తి గురించి చర్చించారు. సగటు మనిషి జీవితం కదావస్తువుగా తీసుకున్నారు. సంసారచక్రంలో పడి నలిగిపోతున్న ఇల్లాలు, మొదట పెళ్ళంటే మధురస్వప్నాలు . జీవితంమీద ఎన్నో ఆశలు, పెళ్ళి తొలిరోజుల్లో పారవశ్యం. తర్వాత కొన్నాళ్ళకు నిజజీవితం. విరుచుకు పడుతోన్న సమస్యలు, అడుగడుక్కి ఆర్ధిక బాధలు , సంసారమనే విషచక్రంలో ఇరుక్కుపోయినట్లు అనుక్షణం  నిస్సహయంగా నలిగిపోయే జీవితాలు,. ఎప్పటికప్పుడు వడ్డున పడదామని ఎంత ప్రయత్నించినా పగబట్టినట్లు కాటువేస్తున్న ఆర్ధికసమస్యలు ..... అనుక్షణం ....  డబ్బు .... డబ్బు .... డబ్బు .... భార్యకూ భర్తకూ మధ్య డబ్బు , పేరెంట్సుకూ పిల్లలకూ మధ్య  డబ్బు ..... సమాజానికీ తమకూ మధ్య డబ్బు .....   ఆ డబ్బు అనే సమస్య కరిచిచ్చులా కాల్చుకు తినేస్తుంటుంది.చివరకు ఆశలు అణగారిపోయి ఈ అగ్నిగుండం విముక్తిలేదని తెలుసుకుని జీవిచ్చవాలుగా మిగిలిపోయిన జీవాలు.

    మొదట ఈ ఇతివృత్తానికి కావ్యత్వాన్నిచ్చే గేయాలను సమకూర్చే శక్తి తమకు వున్నదా అనుకున్నారు. వేరే కవిని ఎవర్నయినా పిలిచి సహాయం తీసుకుందామా అని కూడా ఆలోచించారు. కాని ప్రయత్నించి చూద్దాం అని అభిప్రాయపడి ఇద్దరూ కూర్చుని చెరో చరణం అనుకుంటూ ఒక్కొక్క పదం కూడబలుక్కుంటూ ముందుకు పోసాగారు. గౌతంకు గేయాలు రాయదమలవాటులేదు. కాని అవకాశమున్నప్పుడల్లా  చదివే అలవాటుంది. కృష్ణశాస్రీ కవిత్వమంటే చెవి కోసుకుంటాడు శ్రీ శ్రీ గేయాలంటే ప్రాణమిస్తాడు. వేదుల, బసవరాజు అప్పారావు అబ్బూరి, విశ్వనాధల కవిత్వమంటే చాలా ఇష్టపడతారు. విరాజిలో భావావేశం చాలా ఎక్కువగా వుంది. ఇద్దరూ కలిసి పదిపదిహేను రోజులు కష్టపడి బ్యాలేకు కావాల్సిన సాహిత్యాన్ని సమకూర్చారు.

    విరాజి గాలించి గాలించి తమకు కావాల్సిన ఆర్టిస్టులను ఎన్నుకుంది. విరాజి యింట్లో రిహర్సల్స్ మొదలుపెట్టారు. రవీంద్రభారతి తర్వాత దొరకటం కష్టమనీ నెలా నెలా పదిహేనురోజులు  ముందుగానే గౌతం బుక్ చేసేశాడు.

    సరీగ్గా అదేరోజుల్లో నాదముని దగ్గర్నుంచి విరాజికి కబురొచ్చింది.

    ఈ బ్యాలే రిహార్సిల్స్ హడావుడిలో విరాజి కొన్ని రోజులుగా వాళ్ళింటికి త్రిపురకు ట్యూషన్ చెప్పడానికి వెళ్ళటంలేదు. కబురు రాగానే వెళ్ళింది.

    నాదముని యింట్లోనే వున్నాడు. త్రిపుర విరాజిచూసి లోపల్నుంచి పరిగెత్తుకుంటూ వచ్చి విరాజిని చుట్టేసుకుంది.

    "ఏమండీ ? కనబడటంలేదేం? అనడిగాడు నాదముని.

    రవీంద్రభారతిలో ఓ నృత్యం ప్రదర్శన ఇవ్వటానికి నిర్ణయం జరిగింది. ఈ ఏర్పాటుల్లో ఉండిపోయాను.

    "మీరు ప్రదర్శన ఇస్తున్నారా? గుడ్, ఎప్పుడు?"
   
    విరాజి అర్ధంకాక ప్రశ్నార్ధకంగా చూసింది.

    "త్రిపురతో అరంగ్రేటం ఇప్పించాలని ఎప్పట్నుంచో అనుకుంటున్నాముకదా? దానికోసమని నేను కూడా రవీంద్రభారతి బుక్ చేశాను. మీ ప్రదర్శనకు సరిగ్గా పదిహేనురోజులు ముందు ఆ తేదీ.

    విరాజి అతని ముఖంలోకి చూసింది. అతనేప్పట్నుంచో త్రిపురతో అతంగ్రేటం ఇప్పించాలనిఉవ్విళ్లూరుతున్నడని ఆమెకు తెలుసు. అతని ముఖంలో ఆతృత , ఉత్సాహం త్రిపురతో ఎప్పుడెప్పుడు ప్రదర్శన ఇప్పిద్డామనే ఉత్కంఠ  __ చూసి తేదీ వాయిదా వేయించటానికి ఆమె మనస్సు అంగికరించలేదు.

    "అలాగే చేద్దామండీ తప్పకుండా" అంది.

    "మీరు రెండింటికీ స్ట్రెయిన్ తట్టుకుంటారా?"

    "తట్టుకుంటానండి__" ఆత్మవిశ్వాసంతో.

    "మీలోవున్న ట్యూలెంట్ నాకు తెలుసు. త్రిపుర నాట్య జీవితంమీద నేనెన్నో ఆశలు పెట్టుకున్నాను. ఈ ఆరంగేట్రం మీ అపూర్వమైన ప్రదర్శన అయితీరాలి."

    "చేసితీర్తాను" అంది విరాజి పట్టుదలగా .

    ఆ రోజునుంచీ విరాజీ చాలా బిజీ అయిపోయింది. క్షణం తీరికి ఉండడంలేదు ఉదయం ఎనిమిది గంటలనుంచీ పన్నెండి౦టివరకూ త్రిపురతో సాధనచేయించడం, అక్కడ్నుంచి యింటికి చేరుకొని రాత్రి పన్నెండుదాకా బ్యాలే హారల్స్ ! త్రిపురలో యిన్నాళ్ళబట్టి చూడలేని అద్భుత కౌశల్యాన్ని యీ కాసిని రోజుల్లో ఆమె సందర్శించగలుగుతోంది. ఒక్క చిన్న మూవ్ మెంట్ దగగ్రకూడ విరాజి రాజీపడడంలేదు. నాదమునిగారు తనకొక గొప్ప బాధ్యత వప్పచెప్పారు. తనమీద గొప్ప విశ్వాసముంచేరు. తన కర్తవ్యాన్ని అణుమాత్రమైనా స్థాయి తగ్గకుండా నిర్వహించి తీరాలి. త్రిపురను ఓ గొప్ప కళాకారిణిగా కాంతికిరణంగా  తీర్చిదిద్దగలగాలి. అలాగే యిన్నాళ్ళూ తన మనసులో వున్న ఆవేశం ఉద్రేకం , ఉప్పున లాంటి భావద్వేగం వీటికో అద్భుతమైన రూపమిచ్చి తనేమిటో యీ ప్రపంచానికీ తెలియచెప్పాలి. ఈ లోకంమీద విరుచుకుపడాలి.

    క్షణక్షణానికి క్రొత్త క్రొత్త అభిప్రాయాలు స్పూరిస్తూ వుండేవి. ఎంత రాత్రయినా అప్పటికప్పుడు కూర్చుని తనకొచ్చినకొత్త భావాలకు సాహిత్యరూపాన్నిచ్చేది. తను అనుకున్న అపెక్ట్ వచ్చేవరకూ గౌతమ్ ని ఊపిరిసలప నిచ్చేదికాదు.

    అలాగే తోటిఆర్టిస్టులతో భంగిమలు చేయించేటప్పుడు రాజీపడకుండా ఒక రకంగా హింసపెట్టేసేది.

 Previous Page Next Page