Previous Page Next Page 
కదానాయికి పేజి 21

   
    " అమ్మాయ్ ! కాస్త దొడ్డిదాకా తీసుకెళ్లు."

    "అమ్మాయ్! ఈ వేలు పట్టుకులాగవే తిమ్మిరెక్కింది."

    చిన్న చిన్న పనులు  పురమాయించటం, మధ్య మధ్య మంచంలో ఓకునుకుతీయటం, నల్ల మందుఅలవాటువల్ల ఒక్కోసారి భోంజేస్తూ కూడా  ఓ చిన్న కునుకు తీస్తూనే వుంటుంది ఆవిడ.   

     అనుపమ కదలకుండా ఆవిడక్కనే కూర్చోమనచెప్పి వెళ్లింది సుభద్రమ్మ. అవసరనిమిత్తం తప్ప ఆవిడను అంటిపెట్టుకు కూర్చునివుంది. అనుపమ.

     తన పెళ్ళిగురించి ఊరికివెళ్ళింది. తల్లి అని తల్లిదండ్రుల సంభాషణబట్టి గ్రహించింది అనుపమ.

    "మధ్యాహ్నందాకా పిచ్చిగా ఆలోచిస్తు కూర్చుంది."

    "పెళ్లి చేసుకుంటే ఇక్కడ నుంచి అత్తవారింటికి వెళ్లి పోవాలి."

    "పెళ్లి చేసుకోకపోతే ఏం పోయింది?"

    " పెళ్ళంటే ఎలాచేస్తారు? ఎందుకు?"

    ఉన్నట్టుండి  పెళ్ళి ఆలోచన చెదిరి రాజు గుర్తుకొచ్చాడు అనుపమకి రాజు తలువుకిరాగానే శరీరం  పులకరించినట్లయింది. "రాజూ! రాజూ!" అనుకుంది ఒకటికి పదిసార్లు.
   
    "రాజు తో మాట్లాడుతుంటే ఎంత తియ్యగా వుంటుంది. రాజు చెప్పినట్లు కబుర్లు ఎవరూ చెప్పరు. ఇప్పుడు రాజు ఎలాగున్నాడో? రాజుని చూచి తను చాలా రాజులయింది. శెలవుల్లో ఓ సారి రాజు వచ్చి రమ్మని కబురు చేస్తే వెళ్ళలేకపోయింది. బయట చేరిరెండోరోజు అప్పుడు మరోసారి పండక్కివస్తే బలరామయ్యగారి పెరట్లో కలుసుకున్నారు. రాజు ఎన్ని విశేషాలు చెప్పాడో పట్నం గురించి.

    పట్నంలో ఎలా  వుండేది. మనుషుల మధ్యనుంచే రైళ్ళు, వెళ్ళటం గురించి చెప్పాడు. కార్లల్లో , రైళ్ళలో చాలామంది మనుషులు ఎక్కుతారుట. ఒక్కమనిషి చాలుట నడపటానికి . వారం వారం కొత్త సినిమాలు వస్తాయిట,ఎన్ని సినిమాలు చూచినా విసుగు పుట్టదట. తను చాలా సినిమాలు చూచాడుట. రెండుసార్లు పరిక్షలు పాస్ అయ్యాడుట. అమ్మాయిలు, అబ్బాయిలు కలిసి చదువుతారుట. కలిసి మాట్లాడకుంటారుట. తను చదివేదాన్ని బడి  అనరుట. కాలేజీ అంటారుట. కబుర్లు చెపుతూ మధ్యలో...

    " అనూ బాగా ఎదిగిపోయ్యావు. నువ్వెంత అందంగా వున్నావో తెలుసా?" అన్నాడు రాజు.

    "నువ్వూ ఎదిగిపొయ్యావా రాజూ? నువ్వూ అందంగా వున్నావా?" అని వంటనే అడిగింది తను.

    రాజు నవ్వాడు "నీవు పెద్దదానివయ్యావు. అలాగే నేను పెద్ద వాడినయ్యాను. ఎత్తు,   లావు, బుల్లిబొజ్జ నాతోపాటు అన్నీ పెరిగాయి. నా చెయ్యి పట్టుకుచూడు,ఎంత  లావుగా వుందో? చిన్నప్పుడు సన్నగా వుండేది." అంటూ రాజు తన చెయ్యి ఇచ్చాడు.   

    రాజు  చెయ్యి నున్నగా ఇంత లావు లేకుండావుండేది. ఇప్పుడు బాగా లావుగా ఉంది.చేతినిండా వెంట్రుకలు ఉన్నాయి. రాజు చెయ్యి నిమిరిచూస్తుంటే తమాషాగా ఉంది. తలకేగాని చేతులకు  వెంట్రుకలుంటాయా? మొగాళ్ళకి కొదంరి కుటంటాయిట.

    తన చేతులు నిమురుతూ కూర్చున్నాడు రాజు.   

    " అనూ! పాలరాతు సౌందర్యం, గులాబీరంగు, నవనీతం లాంటి మృదుత్వం అన్నీ నీచేతిలో ఉన్నాయి. నీ మృదువైన చేతులు వర్ణించటానికి కవినై పుట్టకపోవటం నా దురదృష్టం.చేతులను వర్ణించటం చాతగాని నేను శరీరాన్నే మి వర్ణించగలను?  రెప్పలార్పకుండా చూడటం తప్ప!" అంటూ ఏమిటేమిటో మాట్లాడాడు రాజు.   

    రాజు మాట్లాడుతున్నదేమిటో తనకొక్కటీ అర్థంకాలేదు. మెచ్చుకుంటున్నాడని మట్టుకు తెలుసుకోగలిగింది. రాజు తన చేతులు నిమురుతూంటే హాయిగా వుంది. చేతులు  నిమురుతూ ఎంత సేపు మాట్లాడాడో?

    రాజు లేవటంతో తనూలేచి  ఇంటికి వచ్చేసింది.  ఇంకా వుందామనిపించినా "చీకటి పడుతున్నది వద్దు!" అన్నాడు రాజు.

    బలరామయ్యగారి పెరట్లో  రాజుని కలుసుకున్నట్లు మర్నాడు అమ్మకు తెలిసి తిట్టింది. పెద్దయిన తరువాత ఆడపిల్లలు మొగపిల్లను కలుసుకోకూడదట. ఎందుకంటే ? చెప్పదు. నీకు తెలీదు తప్పు అంది. యితఫా రాజుని కలుసుకున్నట్లు తెలిస్తే చంపిపారేస్తానంది. రాజు, నువ్వు ఏం చేశారంది? ఏం చేస్తారు కబుర్లు చెప్పుకున్న్రారు.ఆ మాట చెప్పినా ఏమిటేమిటో తిడుతూనే వుంది. ఆ రోజంతా.   

    మరోసారి శెలవల్లో రాజు వచ్చి కబురుచేస్తే వెళ్ళటం పడనేలేదు. ఆ రోజు ఉమా వాళ్ళింటి కెళ్ళివస్తానని చెపితే, ఎక్కడికీ వెళ్ళనక్కరలేదు. ఇంట్లోనే కూర్చో  అంది. తను ఇంట్లోనే వుండిపోయింది. తను రానందుకు  రాజు ఏమనుకున్నాడో?

    తనకి పదహారేళ్ళు, రాజుకి పందొమ్మిది నిండుతాయిట.  ఎంత పెద్దయ్యారేమిటీ? కాస్తేగా, రాజు తను కలుసుకుని మాట్లాడుకుంటే తప్పేమిటో? అసలేం తప్పులేదు.పట్నం వెళ్ళకముందు రాజు తను కలిసి ఆడుకోలేదా? మాట్లాడుకోలేదా? రఘుపతిగారికి, నాన్నకి ఏదో పోట్లాట వచ్చిందిగా అందుకని  అమ్మ రాజుతో మాట్లాడవద్దంటున్నది అంతే.  ఆ సంగతి చెప్పకుండా రాజుతో  మట్లాడవద్దు తప్పు అంటున్నది.   

     "అమ్మాయ్! కాసిని మంచినీళ్ళు తెచ్చి పెట్టు." అని ముసలమ్మ గారి మాటతో అనుపమ ఆలోచనా స్రవంతి తెగింది.   

    అలావాటే కాబట్టి వంటింట్లోకెళ్లి గ్లాసుతో మంచినీళ్ళు తెచ్చిచ్చింది. అనుపమ."

 Previous Page Next Page