"పెద్దడాక్టర్లు ఎంత పెద్ద జబ్బునయినా కుదురుస్తున్నారు అత్తయ్యా?"
"ఎంతమంది డాక్టర్లు చూచావు? ఎంతమంది జబ్బు పడ్డవాళ్ళు బాగుపడటం చూచావు. ?అబ్బో రాజు పెద్దపాడయిపోయాడు." అంది రాజేశ్వరమ్మ.
అత్తయ్య నవ్వుతుంటె రాజు సిగ్గుతో ముడుచుకుపోయాడు.
"ఫో అత్తయ్యా! నవ్వుతావు. రోజు పేపరు చదవటం లేదేమిటీ? నేను డాక్టరు చదివితే నువ్వు లేచి తిరగ్గలిగేటట్లు చేస్తాను. చూడు.
"అప్పటిదాకా నీ అత్తయ్య బతికేవుంటే , నువ్వు చదివినందుకైనా లేచి తిరుగుతారా రాజూ!"
"ఛా... ఏం మాటలని రాజేశ్వరీ?"మందలించాడు రఘుపతి. వెంటనే రాజువైపు తిరిగి "నీకు డాక్టరు చదవాలంటే , బాగా చదివి అన్నింటిలో మంచి మార్కులు తెచ్చుకో, నేను చదివిస్తాను ఎంతపెద్ద చదువయినాసరే"అన్నాడు.
రాజు తల తాటించాడు " అలాగే" అన్నట్లు.
మునసబుగారి మూడోకొడుకుని ఓసారి పెద్ద జబ్బుచేస్తే పెట్టారు. క్రితం రోజు పట్నం పంపిన చినరెడ్డి డాక్టరుని వెంటబెట్టుకుని అప్పుడొచ్చాడు. డాక్టరు పరీక్షచేసి ఇంజక్షనిచ్చాడు. అప్పటికప్పుడు చల్లపడ్డ శరీరం వేడిఎక్కటం కిందపడుకోపెట్టినవాడిని మంచంమీద చేర్చటం జరిగింది. డాక్టరు సలహాపై పట్నం తీసుకెళ్లి నెలరోజులు హాస్పిట
ల్ లో వుంచి వైద్యం చేయిస్తే. పిడిరాయిలా తిరిగివచ్చాడు. అదిచూచాడు. రాజు. అప్పటినుంచీ డాక్టరంటే దేముడితో సమానం రాజుకి. డాక్టరు కావటం గొప్పవిశేషం . రాజు తొమ్మిదేళ్ళ వయసులో జరిగిన సంఘటన ప్రభావమే , తనూ డాక్టరు కావాలని అంతరంగంలో పదిలపరుచుకున్న గట్టి కోరిక.
"చదివితే డాక్టరు చదివిస్తా" నన్న మామయ్యమాట అమృతావాకులా వినిపించింది రాజుకి.
" రాజూ!అన్నీ జాగ్రత్తగా చూచుకో. పట్నంలో దొంగలభయం జాస్తీట. కాస్త ఏమరిపాటుగావుంటే చాలు చేతికందింది ఎత్తుకెళతారు. కమ్మగా కబుర్లు చెప్పి మోసం చెస్తారుట. హాస్టల్లో బాగుండదని వెంకటప్పయ్యగారి మనవడ్ని సీతాపతిని వేరేగది అద్దెకు తీసుకొని వుంచుతున్నారు. సీతాపతి నాయనమ్మని కూడా పంపుతున్నారు వండిపెట్టటానికి. పెద్దవాళ్ళతో మాట్లాడాను. నీవూ సీతాపతితో చదువుకుంటూ వాళ్ళగది లోనే వుందువుగాని.డబ్బు అవసరమయినా, సంగతులేమయినా ఉన్నా వెంటనే ఉత్తరం రాస్తుండు." రఘుపతి వివరంగా చెప్పాడు.
"అలాగే మామయ్యా!" అన్నాడు వినయంగా రాజు.
"ఇదిగో -పట్నంవెళ్ళిన మోజులోపడి సినిమాలు, షికార్లకు ఊరేగితే ఊరుకోను. బాగా చదువుకోవాలి. బుద్దిమంతుడివి అనిపించుకోవాలి. నీగురించి పిచ్చిగా ఏదన్నా వినాన్నా? డొక్క చీల్చేస్తాను." రఘుపతి అంతలోనే మారిపోయి కఠినంగా అన్నాడు.
"అలాగే మామయ్యా!" అన్నాడు రాజు.ఎప్పటిలాగా మామయ్య కేకలకి, కోపానికి దడవక మామయ్య మనస్తత్వన్ని అర్థం చేసుకుని.
రాజేశ్వరమ్మ మాత్రం వూరుకోలేదు.
"ఏ నిమిషాన ఏ తీరుగా మాట్లాడుతారో భగవంతుడికి తెలియాలి. ఇంతకుముందు దాకా వివరంగా చెప్పి ఇంతలో వుగ్ర నరసింహమూర్తి రూపం దాలుస్తారేమిటి?" అంది రాజేశ్వరమ్మ.
"నీకు తెలీదు రాజేశ్వరీ! రాజు వయస్సులో నాకు తెలియవున్నట్లయితే చదువుకుని గొప్పవాడినయ్యేవాడ్ని." బాధగా అన్నాడు రఘుపతి.
" అహా! నాకు తెలియదులెండి. చదువుకుంటేనే గొప్పవాళ్ళవు తారని, ఇప్పుడు మీరేదో చిన్న వారయినట్లు అనవసరం అపొహ. నలుగురి నోటంట మంచివాడనిపించుకున్నావాడు గొప్పవాడు. నలుగురి నోళ్ళల్లో నానినవాడు చిన్నావాడు."
ఏ మనాలో తెలియక- "నీకు తెలీదులే రాజేశ్వరీ!" అన్నాడు రఘుపతి.
అత్తయ్య చెప్పింది. నిజమనిపించింది రాజుకి.
"నీకు కావలసినవి సర్దాను. మళ్ళీ ఓసారి చూడు ఏమన్నా మరిచి పొయ్యానమేమో? నేను అలా బయటికి వెళ్ళస్తాను. కావలసింది ఏమన్నావుంటే రాగానే గుర్తుచెయ్యి. మళ్ళీ ఉదయమే అంటే కుదరదు. వింటున్నావురా రాజూ! నే చెప్పింది?" రాజు రాజేశ్వరమ్మ వైపు చూస్తువుండటం గమనించి అడిగాడు రఘుపతి.
"ఊ...." అన్నాడు రాజు.
రఘుపతి కుర్చీలోంచి లేచాడు. "జానకిరామయ్యగారు కబురంపించారు. అలా వాళ్ళింటిదాకా వెళ్ళొస్తాను రాజేశ్వరీ!" అన్నాడు కూర్చీని ప్రక్కకు జరిపి.
రఘుపతి గడప దాటిన అయిదు నిమిషాల దాకా మౌనం వహించి "అత్తయ్యా! ఓ సారి బయట్క్ వెళ్ళొస్తాను." అన్నాడు రాజు.
"ఇప్పుడెందుకురా, సామాను సరీగా ఉన్నాయో లేదో చూచుకోకూడదూ?" అంది రాజేశ్వరమ్మ.
"ఇప్పుడే వచ్చేస్తానుగా, మామయ్యతో చెప్పకేం అత్తయ్యా!? అన్నాడు రాజు.
రాజేశ్వరమ్మ చిన్నగా నవ్వుతూ "అయితే,ఇప్పుడు బయటికెళ్ళి ఏం ఘనకార్యం చేసిరావాలేంటి?" అంది.
ఆదివారం సాయంత్రం అనుపమ వస్తుంది. తప్పక కలుసుకోవాలి. కలుసుకుని తను చదువుకోటానికి పట్నం వెళ్లుతున్నట్లు చెప్పాలి. అని మూడు రోజుల నుంచి అనుకుంటున్నాడు. రాజు ఆదివారం వచ్చింది. సాయంత్రం అయిదయినా మామయ్య ఇంట్లోంచి కదలలేదు. ఇంట్లోంచి ఎలా బయటకు వెళ్ళాలా అని ఉదయం నుంచి ఆలోచిస్తున్నాడు. రఘుపతి బయటికి వెళ్ళటంతో వీలు చిక్కింది.