Previous Page Next Page 
కదానాయికి పేజి 16

    ముత్తయిదులు రావటం దరివంపరచి అనుపమను కూర్చోబెట్టటం మరోగంటలో పూర్తయింది.   

     పల్లెటూరులో ఏది సవ్యంగా జరపకపోయినా ఊరుకోరు. నోరు తెరమనిచెప్పి గడ్డి పెడతారు.  సుభద్రమ్మ తెలిసినందరినీ  సాయంత్రం పేరంటంకి పిలిచింది.

    అనుపమకు తెలీని భావాలు ఎన్నో వేధిస్తున్నాయి. "సమయం వచ్చినప్పుడు అదే తెలుస్తుంది ఏ విషయమైనా?" తల్లి అన్న మాటగుర్తుంది. పెద్దమనిషి కావటం ఏమిటో తెలిసింది. తెలియలేదు, సగంఅర్థమయి మిగిలేని కక్కలేని అవస్థలో పుత్తడిబొమ్మలా కూర్చుంది దరివం మధ్యలో.   

    ఉమ,అలివేణి, నీరజ , శారద ముందుగా వచ్చేశారు పేరంటానికి.

    "ఇవాళ మీరు అడుకోటానికి వెళ్ళరా?" అంది అనుపమ.

    " ఉహూ! పేరంటం వచ్చాముగా ఇక్కడే వుంటాము. పేరంటం అయేటప్పటికి పొద్దుకూకిపోతుంది" అంది ఉమ.

    "వెంకట్ ,అవాధాన్లు, శేఖరం వాళ్లు వస్తారా?"

    "ఛీ మొగవాళ్ళెక్కడయినా పేరంటం వస్తారేమిటి! నవ్వుతారు"

    "మరి" పెళ్లిళ్ళకి మొగాళ్లొస్తారుగా?" కరణంగారింట్లో పెళ్ళప్పుడు అనుపమ వెళ్లింది. ఆసంగతి గుర్తుండి అడిగింది.   

    "పెళ్ళిళ్ళకు మొగాళ్ళు వస్తారు.ఇలాంటి పేరంటానికి రారు. ఆడవాళ్లు మాత్రమే వస్తారు."

    బిలబిలమంటు పేరంటాళ్లు రావటంతో పిల్లల నోళ్లు మూతపడ్డాయి.   

    "సుభద్రమ్మ వదినోయ్! తొందరగా పెళ్ళి పప్పణ్ణం కూడా పెట్టే సేయ్"

    "కుందనం బొమ్మలా వుందర్రా , మన అనుపమ!"

    " ఒక్కొక్కళ్ళ మొఖాన సమర్తకళ వుండదు. బాలసీతమ్మ వారిలా కళకళ లాడుతూ వుంది అమ్మాయి. మాయదారి దేముడు  ఒక్క నిముషం కళ్ళు మూసుకున్నాడు గాని లేకపోతేనా, యీ వూరి మొత్తంలో యీ అంద మేది?"

     "ఇహపై సుభద్రమ్మ అక్క నెల నెలా కనిపెట్టి వుండాలి. పాపం దానికా తెలియదాయె!"

    పేరంటాళ్ళు తలో విధంగా మాట్లాడుతున్నారు. సుభద్రమ్మ మనసులో ఏముందో దేముడికి తెలియాలి. పెదవులచిరునవ్వు చెదరనీ కుండా తనూ మాట్లాడుతున్నది సందర్భంబట్టి కొన్ని మాటలు దాటవేస్తున్నది.
   
    చిమ్మిరి తొక్కటానికి పెద్ద ముత్తయిదువులు లేచారు. దొడ్లో వున్న  చిన్న రోలు దొర్లించుకు తీసుకువచ్చారు. కొందరు రోకళ్ళకి పసుపు కొమ్ముని దారంతో కట్టేరు.   

    ఎదురుగా జరుగుతున్న తతంగం అనుపమకు తెలియటంలేదు.ఆదివారం సాయంత్రం రాజు వస్తాడు. తన్ని తప్పక రమ్మాడు. రాజు పరిక్ష పాసు అయ్యాడు.ఈ వూళ్ళో తరువాత  చదువు లేదు. పట్నం వెళ్ళి పోతున్నాడు. మంచి మాట చెపుతానన్నాడు. అదేమిటో ? తను పెద్ద మనిషయినట్లు రాజుకి తెలుస్తుందా? ఉమ,  అలివేణి అందరూ ఇక్కడే వున్నారు. ఎలా తెలుస్తుంది? ఎవరు చెపుతారు? ఎట్లాగో అట్లా తెలిస్తే  బాగుండును. రాజు  నా కోసం వచ్చి చాలా సేపు ఎదురు చూస్తాడేమో,ఎలా?

     అనుపమ శరీరం ఇక్కడ, మనసు అక్కడ వుంది.

    " నేచెప్పినట్లు, మాట్లాడకుండ కదలకుండా కూర్చుంది. పిచ్చి తల్లి అనుకుని తృప్తిపడింది సుభద్రమ్మ.

    పేరంటాళ్ళు చిమ్మిరికి కావలసిన బెల్లము , నువ్వుపప్పు కొబ్బరి కలిపి దంచటానికి రోకళ్లు  ఎత్తారు.

    పాట ఎత్తింది ఒకమె. అందుకున్నారు పాటలమీద మోజున్న కొందరు సుందరాంగులు.

    శ్రీ రమణి భుషితకు సీతవై పుట్టి....
    కూరిమి జనకులకు కూతురై పెరిగి... సువ్వీ.... సువ్వాలలే
    ........    ......    .......
    ........    ........    .......
    గురువారము నాడై తె కూడు సంపదలు,
    శుక్రవారము నాడైతె సుదతి సుఖపడు.... సువ్వీ సువ్వాలలే,
    శనివారము నాడై తె సతి పేదారలు
    ఆదివారము నాడై తె అతివ రోగిష్టి.... సువ్వీ. సువ్వాలలే.

                                8

    "బావా!బావా!నాన్న నిన్ను పిలుస్తున్నాడు" చుక్క మామిడి తాండ్ర తింటూ గదిలోకి వచ్చి చెప్పింది.

    మంచంమీద నుంచి లేవబోతున్న రాజుని చెయ్యి పట్టి ఆపేసింది రాజేశ్వరమ్మ. "చుక్క తల్లీ! నాన్నగారిని ఇక్కడికి రమ్మని చెప్పు" అంది.

 Previous Page Next Page