కధానాయకి
:__కురుమద్దాలి విజయలక్ష్మి
కథానాయకి
కథానాయకి "అనుపమ" అందాలభరిణి. మనుషులే కాదు. విధి కూడా అనుపమపట్ల నిర్థక్షిణ్యంగా ప్రవర్తించింది. అమాయకురాలయిన అనిపమ తనఅందమే తనని కాటేస్తుంటే మూగగారోదించటం తప్ప, కాటేసే వారిని కన్నెత్తి చూడలేదు. లేఖలు అక్కరలేదు తనువులుదూరమయినా చిన్ననాటి చెలిమి పెరిగి పెరిగి మహావృక్షమైస్థిరంగా బలంగా నిలిచి వుంటుంది. ఏనాడో దూరమైనవారు దగ్గరయి, వారి మనసులు విప్పిచెప్పుకుంటే ,శరీరంమీద విషపుకాట్ల తాలూకు గుర్తులున్నా, అవివారిని దూరంచేయవు. మరింత చేరువుకావటానికి తోడ్పడు తాయేగాని , రాజుచెప్పిందాకా అనుపమకి ఇంత చిన్న విషయం తెలియదు. తెలియంగానే అనుపమ ఏం చేసింది? ఏమి నిర్ణయం తీసుకుంది? అది తెలుసు కోవాలంటే ఆ "ఆకథానాయకి" చేతికి తీసుకుని చదవాల్సిందే.
1
సాయంత్రం అయిదుగంట లయింది.
బలరామయ్యగారి దొడ్లో పిల్లలంతాచేరారు. దాగుడుమూతలు ఆడిఅలసిపొయ్యారు. ఆ పూటకు ఆటచాలించి కబుర్లు చెప్పుకుంటు కూర్చున్నారు.
కాగితంతో చుట్టి పట్టుకొచ్చిన పప్పుచెక్క తుంచి కాస్త పెట్టింది
" సరోజ ఎందుకు రాలేదే ఉమా" రమ పరికిణితో ముఖానచమట తుడుచుకుంటు అడిగింది.
"గోపీ వచ్చాడు. అందుకని వాళ్ళమ్మ పంపించనంది సరోజను."
"గోపీ వస్తే సరోజ రూకూడదా ఆడుకోటానికి?" అనుపమ అడిగింది.
" నీకేంతెలియదు . గోపీ అంటే సరోజమామయ్య. సరోజని వాళ్ళ మామయ్యకిచ్చి పెళ్ఫి చేస్తారుకదా! మరి. వాళ్ళ మామ య్య ఎదుట సరోజని ఎక్కడికి పడితే అక్కడికి పంపిస్తారేమిటి?" పెద్ద ఆరిందలా చేతులు తిప్పుతూ చెప్పింది ఉమ.
"అర్ధమయినట్టుగా తలఆడించి " అహ! అంది అనుపమ."
"సరోజ పెళ్ళి మామయ్యతో ఎప్పుడవుతుందే ఉమా?" అవధాని చొక్కాచేతికి ముక్కుతుడుచుకుంటు అడిగాడు. పదేళ్ళ అవధానికి ఆడకబుర్లు కావాలి.
రామం, వెంకట్ , శేఖరంకూడా అమ్మాయిలతో ఆడుకుంటారు గాని అవధానిలా ఆడవాళ్ళ మాటలు మాట్లాడరు. అవధాని అడిగిందానికి అందరూ పక్కున నవ్వారు.
" వాళ్ళమామయ్య చేసుకున్నప్పుడు సరోజ పెళ్ళి అవుతుంది."కదూ నవ్వుతూ అంది ఉమ.
అవధాని మూతిముడుచుకు కూర్చున్నాడు.
"ఇవాళ్ళమనతో ఆడుకవటానికి శారద రాలేదుకదూ?" ఉన్నట్టుండి అడిగింది అనుపమ.
"అవును, ఇవాళ శారద రాలేదు. "
"ఎందుకని శారద రానట్లు....?"
"శారద మామయ్యకూడ ఊరునుంచి వచ్చాడేమో, శారదను పెళ్ళి చేసుకోవటానికి."
తలో మాట అన్నారు. విని అవధాని తల అడ్డంగా వూపాడు.
"శారద ఎందుకురాలేదో నాకు తెలుసుగా?"
"మీరు నవ్వుతారు, నేను చెప్పను."
" మేమెవ్వరం నవ్వం. అవధాన్లు మంచివాడు చెపుతాడు చూడండి. ఉమ అంది.
ఉమ గడుసుది, అందరిలో పెద్దది. అడిగింది ఉమ కాబట్టి చెప్పవచ్చని అనుకున్నాడు అవధాని .పైగా ఉమ తనని మంచివాడనికూడ అంది.
"శారదవాళ్ళమ్మ పొద్దున మాయింటికి వచ్చింది. శారద పెద్ద మనిషయింది. దరివంపరచాలి రమ్మంది. పెద్దమనిషి కావటం ఏంటమ్మా? అని అడిగితే మా అమ్మ తిట్టింది." చెప్పాడు అవధాని.
ఉమ మొహం ఎర్రపడింది.
ఆడపిల్లలు, మొగపిల్ల ఒకరిముఖం ఒకరు చూచుకున్నారు.
"అమ్మయ్య నామాటలకు ఎవ్వరూ నవ్వలేదు" అవధాని తృప్తి పడ్డాడు. కాసేపాగి అడిగింది. రమ."సుబ్బులు పెద్దమనిషయింది. పెద్ద మనిషియిందిగా ఆడుకోటానికి వస్తుందో రాదో?"
" రాదు, వాళ్ళమ్మ పంపించదు."
"అవును. ఇంక శారద మనతో ఆడుకోటానికిరాదు" ఉమ దిగులుగా అంది.
మౌనంగ వీళ్ళ మాటలు వింటూకూర్చుంది అనుపమ.
"ఉమ, రమ,సుజాత ,వీళ్ళందరికన్నా శారద మంచిది. తనేంమాట్లాడినా నవ్వదు. అప్పుడే శారద ఎందుకు పెద్దమనిషయింది. పెద్ద మనిషి కాపటం అంటే ఏమిటో? ఉమని అడిగితే చెపుతుందిగా!
అనుపమ ఆలోచించింది. కాసేపు ఉమని అడుగుదామా? వద్దా? అని తటపటాయించింది.చివరికి ధైర్యం చేసింది.
"పెద్దమనిషి కావటం అంటే ఏమిటే ఉమా?
మొగపిల్లలు అనుపమవైపు దొంగచూపులు చూచారు. ఆడపిల్లల బుగ్గలు ఎర్రబడ్డాయి. దీనికేం అడగాలో తెలియదు,ఉమ లోలన అనుకుంది."తనడిగింది వినపడ్డదో, లేదో అని మరోసారి అడిగింది అనుపమ.