"నీ పేరు నర్సయ్యలే?" అంటడిగిండు చంద్రం.
"అవ్. నీ కెరికె నెనా?"
"మీ నాయన సెప్పిండు."
"నీ పేరు?"
"సెంద్రం."
"మంచిగుంది."
"మీ నాయన పేరు?"
"సిలివేరు కాడెయ్య. మాయమ్మ పేరు మూదమ్మ. పున్నమ్మ మా యక్క" అంట సెప్పిండు నర్సయ్య. "ఈ ఊర్ల సాలోండ్లు లెస్సగున్నరు. పింజర్లు కూడ శానున్నయి. రేషం నేసెటోండ్లు కూడున్నరు. అప్పటికి సూపిస్త కద?" అన్నడు.
నర్సయ్య చంద్రంను తోవకు తోలుక బోయిండు. అమ్మను, అక్కను సూబిచ్చిండు.
ఈదమ్మ, సరిబయల్ల, బండమీద పడుగు పొందవెట్టి, గుడ్డ పిడ్సె సేత బట్టుకోని గెంజి పెడతన్నది. కుండల పిడిసె ముంచా, పడుగుమీన అద్దా, దబ్బ దబ్బ కొడ్త ఉన్నది.
గాడ పున్నమ్మ బయల్ల గూటం పాతినది. ఊడ్తె పన్నినది. తాడు లాక్కోని, బిర్రుకోసానికి కొన్కి కట్టె వెట్టింది. ఊడ్తె లడ్డపట్టెల కెల్లి గూటం దన్క తాడు బిర్రుగుంజింది.
యీదమ్మ పడుగుకు గెంజి నెట్టినంక ఊడ్తె తాన తెచ్చింది. పున్నమ్మ, పడిగెనకోల అందుకోని ఊడ్తె గొల్చుకాండ్లకు తలిగిచ్చింది. ఇద్దరు పడుగు పట్టుకోని సరిగుంజ దిక్కుకు సావుకపోయిన్రు. సాపినంక, పడుగుల పై కోలున్నది కద, ఆ కొలను సరిగుంజ గుధులకు తలిగిచ్చిన్రు. అట్ల పడుగు సాపటం అయింది. సాపినంక సల్రు, బిగు లేకుంట తాడు బిర్రు గుంజిన్రు.
నర్సయ్య, చంద్రం యిద్దరాడకు బోయిన్రు. యీదమ్మ, పున్నమ్మ చంద్రంను మంచిగ సూసిన్రు.
పిలగాండ్లిద్ధరు పడుగు సేత బట్టుకోని యీడి కెల్లి ఆడికి సేతుల్త సాదకం సే సిన్రు. పడుగ్గెంజి రాల్నది. ఇద్దరు కలిసి ఆండ్లతాన పోగు పోగు ఏరిన్రు. పున్నమ్మ, యీదమ్మ కుంచె పట్టుకోని, యిద్దరు సెరొక దిక్కు నిలవడి పడుగుల యీడి కెల్లి ఆడికి కుంచె నెట్టుకుంట పోయిన్రు.
పడిగెన కోలమీద గెంజి అంటకుండె దిక్కును వాండ్లంటరు కద? ఆడ సిన్నకుంచెత నర్సయ్య దూబిండు.
పడుగారెతప్పుడు, ఆరు పదునుమీద యిర్లుకుంచె ఏసిన్రు. ఎడమశేత్త పిడిసె తీసుకోని కుడిశేత్త వాండ్ల కుంచె తీసుకోని పడుగుమీద అలుకేసిన్రు. నడమ నడమ అండ్లకాడ లాకలు జరిపిన్రు. కచ్చు లేసిన్రు. కచ్చి కచ్చి నడమ బొల్లు సేసిన్రు.
సరి తీర్వ అయినంక అండ్లల్ల లాకలు దుస్సేసి మొలకచ్చి ఏసిన్రు. ఏపినంక, సరిగుంజ దిక్కు కెల్లి ఊడ్తె దిక్కుకు యిద్దరు పట్టుకోని సరి ముట్టుకోని యింట్లకు తెచ్చిన్రు.
చంద్రం అన్ని సూసిండు. ఒక్కక్క పని ఎట్లెట్ల, అంత సూసిండు, మంచిగ సూసిండు.
సాలోండ్ల పిలగానికి యియ్యి కొత్తకాదు. అయినగాని, చంద్రం ఎన్నడు కాని యిట్ల దగ్గిరుండి సూడలే.
సరి తీర్వయెతలికి అంబటాలయింది.
"గెంజి తాగుదురు రాన్రి" అన్నది యీదమ్మ.
నర్సయ్య చంద్రంను కూడ గొంచు బోయిండు.
"గెంజంత ముందుగల్నె తాగుతనేంది" సెంద్రయ్యా? ఇగ్గొ, కొంచెం బువ్వ పెడ్తపట్టు" అన్నది పున్నమ్మ.
చంద్రంకు కొంచెం సిగ్గయింది.
"పర్వలే, సెంద్రయ్యా! నేను అక్కను కద? పెడ్తె తినాలె" అన్నది.
చంద్రం బువ్వ కలుపుకున్నడు. ముందు రేత్తిరి మిగిలిన దొగ్గలికూర బువ్వల యేసింది. "పుంటికూర పచ్చడి ఎయ్యాలి?" అంటడి గింద.
"పుంటికూర అందరోళ్ళె ఎక్కవ తింటరులే?" అంటడిగిండు నర్సయ్య.
"అవ్ గోంగూరంటరు వాండ్లు. పచ్చడి మంచిగుంటది కద?" అన్నది పున్నమ్మ.
"అందరోళ్ళెసలు?" అంటడిగిండుచంద్రం.
"అందరల ఉండెటోల్లు! బుడ్డపైస లొచ్చినయిలే, అందర పైసలు, అయికూడ వాండ్లు తెచ్చినయే" అన్నడు నర్సయ్య.
"మనం కామా?"
"అట్లెట్ల? మనం అందరోల్ల మెందు కయితం? తెలంగానోల్లం!" అన్నడు నర్సయ్య.
"కాదు కద? మా ఊర్ల గురువన్నడూ-'అందర, తెలంగాన అలగలగు లేదూ, మనమంత ఒక్కట్నె; మనమంత ఒక్క దేశంలనె ఉన్నం; మనం తినేడిది బువ్వ ఒక్కటే మనం పలికెడిది బాస ఒక్కటే' అంట" అన్నడు చంద్రం.
"హౌవ్వా, అక్క?" అంటడిగిండునర్సయ్య.
"నిజం, నర్సయ్యా! ఈ వూర్ల, ఆ వూర్ల ఉండెటి సాలోండ్ల మంత ఒక్కటే కద? అట్లనే దేశంల ఉండేటోండ్లంత ఒక్కట్నే. ఏండ్లు సుట్టపోండ్లు, వీండ్లు లాతోండ్లంట ఏమి షరకున్నది? అంద రొక్కటే, తమ్ముడా! అందరు మనుసులె" అన్నది పున్నమ్మ.
"అట్లనా? నా కెరికెలేకుండే! మా బడిల పింగాండ్లంటే నిజమనుకున్న!" అన్నడు నర్సయ్య.
ఇద్దరు తిని లేపిన్రు.
"కండెలు పడతం వస్తదా, సెంద్రయ్య?" లంటడిగింది పున్నమ్మ.
"లేదక్క!" అన్నడు చంద్రం.
"గింతనే రావొద్దొ?" అంట నగిండు నర్సయ్య.
"లే, లే. వస్తది కాని, యింట్ల నే నెప్పుడు చెయ్యలే."
"చెయ్యకుంటే యింట్ల పనెట్లయితది?"
"ఏమొ? నా కెరికెలే!"
"అచ్చ పోనీ గాని, యిప్పుడు సెయ గల్దువా?" అన్నది పున్నమ్మ.
"నేనున్న కద? సేయిపిస్త" అన్నడు నర్సయ్య.
"అట్లయితే యీడ కూసున్రి. నూలు పంటెలు, డబ్బలు తెచ్చిస్త" అన్నది.
"అక్క శాన మంచిది!" అన్నడు చంద్రం.
"అవ్! ఇంక పదేను దివాల్ల లగ్గమయితది అక్కకు" అన్నడు నర్సయ్య.
"ఈ వూర్లనా?"
"అవ్! మా అక్క లగ్గందంక ఉంటవా?"
"ఉంట."
"మా యింట్లనే ఉంటవా?"
"మీ నాయన ఉండమంటే ఉంట."
"ఉండమంటనే అన్నడు కద? ఎప్పటి కీడస ఉండాలె. మా వూర్లనె ఉండాలె. యిన్నవా?"
"నీ తానె ఉంట" అన్నడు చంద్రం.
అక్క పెండ్లి దగ్గరకొస్తంటే నర్సయ్యకు ఉషారెక్కవయింది.
నర్సయ్య చంద్రంకంటే కొంచెం సిన్నడు. వానికి అన్నలు, తమ్ములు ఎవల్లు లేరు. అక్క ఉన్నది. యిప్పుడు చంద్రం ఉన్నడు.
చంద్రంకు అక్కమాట గురెక్కువ. నర్సయ్యెంబడి ఎప్పటికి అక్కతానె ఉంటడు. అక్క తానె పని నేర్పతడు. నర్సయ్యెంబడి తింటడు. నర్సయ్యెంబడి పండ్తడు.
అక్క పెండ్లికి యింట్ల తిరణాల లెక్కనే అయింది. లగ్గం రోజు ఎప్పుడొస్తదంట నర్సయ్య, చంద్రం కండ్లల్ల వత్తులేసుకు సూస్తన్నరు.
అక్కకు మేన సుట్టరికమున్నది, వాండ్లలనె పెండ్లి సేస్తరు. మేన సుట్టరికం లేకుంటే ముందుగాల పిలగాని ఇల్లు సూసెతందుకు పెద్దోండ్లు పోతరు. ఇప్పుడెసల్లు పోలే.
ఒక దినం పిలగావోండ్లు పప్పన్నాని కొచ్చిన్రు. వచ్చి, పిల్లను మెచ్చుకొని పోయిన్రు.
పిల్లకు తీగ, దుద్దులు, కడియాలు, పట్టీలు, పీతాంబరాలు పెట్టెతందుకు నిశ్చయమయినది. పిల్లవానికి ఎండి మొలతాడు, బటువు, పట్టంచు కుప్పణం జోడ, కుప్పణం కాండ్వ, రుమాలు, కాసు పెట్టెతందుకు వీండ్లు నిశ్చయం చేసిన్రు.
లగ్గం రోజు వచ్చింది. పిల్లకొరకు పిలగానోండ్లు వచ్సిన్రు. ఊరుబయట కోట మసెమ్మ గుడితాన ఉన్నరంట కబురొచ్చింది.
పిల్లోళ్ళు రొండు సాపలు తెచ్చి గుడిముంగల సెట్టుకింద ఏసిన్రు. పిలగానోండ్లు కూసున్నరు. మల్ల లేసి మల్ల కూసున్నరు.
పిల్ల ఊర్ల పెద్దసెట్టి తాంబాళం పట్టుకోని పిల్లగాని దౌరు పెద్దసెట్టికి ముందుగాల బొట్టు పెట్టిండు. తరవాత యింటి అల్లుండ్లకు పెట్టిండు. తరవాత దూరం కెల్లి వచ్చి నోండ్లకు పెట్టిండు.
మల్ల, పిల్లోళ్ల ఊరు పెద్దసెట్టి లేసి అట్లనే సేసిండు.
అయినంక పిల్లోళ్ళు, పిలగానోండ్లత యిల్లు నింపుకున్నరు.
బంతి లేసింది.
బాపనాయన్ని పిలిసిన్రు. పిల్లకు తాంబాళం పెట్టిచ్చిన్రు. ఆకులు, పోకలు, పండ్లు, అయిదు కుడకలు, అయిదు మడుపులు తెల్లయి యిచ్చిన్రు. పెండ్లిపిల్ల పున్నమ్మకు తాంబాళం సీరా కట్టిపిచ్చిన్రు. మొత్తం పైటకొంగుత ఒడి పట్టిపిచ్చిన్రు. తోడి పెండ్లి పిల్లను కూడ పున్నమ్మతానకు తెచ్సిన్రు. ముగ్గురు ముత్తయిదులు మూడుసార్లు బొట్టుపెట్టి పున్నమ్మ ఒడి నింపిన్రు. ఎనక దోసిడి, తల్లి దోసిడి, ముత్తవదోసిడి అంట మూడు దోసిండ్ల పోకలు యిప్పిచ్చిన్రు.
తక్కెడు పోకలు, కొబ్బెర కుడక ఊర్ల కులస్తుల కిచ్చెతందుకు పెద్ద సెట్టికిచ్చిన్రు. వరసన ఆయన అందరికి పంచిండు.
పిలగానింట్ల లగ్గమయితది.
పెండ్లి పిల్లను తీసుకోని సుట్టాల్త తరలి, పిలగాని ఊరు బయటి కొచ్చిన్రు.
పిలగానోండ్లు ఎదురు పోయిన్రు. పసుపు, కుంకం, పోకలు, నివాళి తీసుకోని ముత్తయిదులకు పసుపు, కుంకం పెట్టిన్రు. మగవాండ్లకు పోక లిచ్సిన్రు.
జాలాటయినది. పిల్లోళ్ళత పిలగానోండ్లు యిల్లు నింపుకున్నరు.
గలంలోని కొచ్చినంక పిల్లని, పిలగాన్ని ఒక్కతాన ఉంచి, మిత్తితీసి, పిల్లకు పొత్తెల్లె కట్టిపిచ్చి తీసకపోయి లగ్గంమీద కూసొ బెట్టిన్రు. ముగ్గురు ముత్తయిదు లొచ్చితాళిబొట్టు, బాసింగాలు మేళంత తెచ్చి పెట్టిన్రు. నల్లపూసలు, నీళ్ళు తెచ్చిన్రు. పిలగాని అక్క, బావ అవిరెండ్లు, గరిగెముంతలు తెచ్చిపెట్టిన్రు.