లగ్గం మీద కూసున్నరు. బాపనాయన లగ్గప్పోలు రాసిండు. మంత్రాలు సదివిండు. పుస్తె కట్టిపిచ్చిండు. తలవాలు పోసుకున్నరు.
ఇయన్ని సూస్తంటే చంద్రంకు మంచిగ పొద్దుపోతున్నది. పిల్ల, పిలగాని కాలు తొక్కి నప్పుడు సాటుగ నవుకున్నడు.
వాకిట్ల, పిలగాడు ఏళ్లత మట్టి దున్నిండు పిల్ల పత్తిత్తుల మట్టిల ఏసింది.
ఆడబిడ్డ గుడ్డ పరిసి "బిడ్డ నిస్తవా, పడ్డ నిస్తవా?" అన్నది. అందరు నవుకున్నరు.
సుక్క సూబిచ్చిన్రు.
ఆ దినం, ముత్తాలమ్మకు ఒక్కపొద్దున్నరు.
పిలగాడు అలక వోయిండు.
అంత ముత్తాలమ్మ గుడితాన పోయిన్రు. ఆడ, ముత్తాలమ్మ ముంగాల పున్నమ్మను బావ ఎత్తుకున్నడు. అందరు బావను సూసి నగిన్రు.
"మంచి గున్నదిలే?" అన్నడు నర్సయ్య.
"అవ్" అన్నడు చంద్రం.
గుడితాన అక్క, బావ సద్ది తిన్నరు.
లగ్గం అయినంక తెల్లారి, ఏర్నాల బంతి పెట్టిన్రు. ఒక్క యిస్తార్ల పున్నమ్మ, బావ బువ్వ తిన్నరు.
ఆయాల్నే యాటలు కోసి, యార్నాల బంతిల మాంసంకూర వండిన్రు. అందరికి కల్లు తాగిపిచ్చిన్రు. సందెకాడ బండ్లు కట్టుకోని అందరు పిల్లింటికి బయిలెల్లిన్రు.
ఊర్ల ఊరేగింపయినది.
చంద్రం, నర్సయ్య అక్కతానె ఉన్నరు.
తల్లి గుడి ముంగల అందరాగిన్రు. అక్క, బావ యిద్దరు లోపలికి పోయిన్రు. చంద్రం, నర్సయ్య యిద్దరు ఎంబడెపోయిన్రు.
ఆడ, తల్లి యిగ్గిరం ముంగల పిల్లకు, పిలగానోండ్లకు ఆకు పోకలు అందిపిచ్చిన్రు.
అక్క నోట్ల ఆకు మడిసి పెట్టింది ముత్తయిదు. సేతుల్త తాక్కుండ, పెదాల్త అక్కనోట్ల ఆకు అందుకున్నడు బావ.
అందరు లెస్సగ నగిన్రు. చంద్రం కూడ నగిండు. నర్సయ్య కూడ నగిండు.
"పున్నమ్మ బుగ్గలు కొరికేవు, పిలగా!" అన్నది ఎనక్కెల్లి ముసలామె ఒకామె.
బావ నవుకున్నడు.
మల్ల ముత్తయిదు, బావ నోట్ల ఆకు పెట్టింది. అక్కను అందుకొమ్మన్నరు.
అక్కకు సిగ్గయింది.
'అవు మల్ల! అంతమందిల మగని నోట్ల ఆకెట్ల అందుకుంటది?' అనుకున్నడు చంద్రం.
అక్కను అందరు తొందర సేసిన్రు. ముత్తయిదులు నడుము పట్టుకొని ముందుకు వంచిన్రు. ఎట్లనో, సిగ్గుపడతనే, బావ నోట్ల ఆకు అందుకున్నది అక్క.
"పిలగాని పెదాలు ఎంగిలి సేస్తవు, పిల్లా!" అన్నది యింకొక ముసలామె.
ముసలామెలు, ముసలామెలు ముచ్చటగ నవుకున్నరు.
ఆకు పోకలందుకున్నంక కజ్జూరపండ్లు తినిపిచ్చిన్రు. లగ్గం అయినంక యీరంగం సేసిన్రు. కడ్గాలు సదువుత డేగాట ఆడిన్రు.
అక్క పెండ్లి అయింది.
పెండ్లి నాలుగు దినాలు చంద్రం, నర్సయ్య ఉసారుగ తిరిగిన్రు.
పెండ్లి అయినంక పిల్లను, పిలగాన్ని ఒకటి సేస్త మనుకున్నరు. కాని, పున్నమ్మ ఆయాల్నె దూరంగుంది.
పెండ్లి అయినంక పిల్లను, పిలగాన్ని ఒకటి సేస్త మనుకున్నరు. కాని, పున్నమ్మ ఆయాల్నె దూరంగుంది.
పెండ్లి అయినంక వారం దినాలదంక యింట్ల మొగ్గం సామాండ్లు మూలపడి ఉన్నయి.
చంద్రం కు ఏమి చేసెతందుకు తోచటంలే. ఒక్కడు మూల కూసుంటే అమ్మ, నాయన, దోస్తులు అందరు యాదొస్తున్రు. ఈడ నే బయం లేకున్న గాని, ఎప్పటికి అట్లనే వాండ్లు యాదొస్తంటే శాన బయిమయితన్నది. ఇంటి మీకి మనుసు పోతన్నది. అక్క పెండ్లి అయితన్న దినాల్లన్ని ముత్తాలు పెండ్లి అయినట్లనే ఉన్నది.
'ముత్తాలును సూడక యిన్ని దినాలు ఎన్నడు కాలే. అవు. తను లేకుంటే ముత్తాలు ఎవలతో ఆడుకుంటది?' చంద్రం అనుకున్నడు. 'అమ్మను, నాయన్ను, ముత్తాల్ను, దోస్తుల్ను అందర్ని యిడిసి యీడ ఉంటమెందుకు?'
ఎంబడె లక్ష్మయ్య మామ గురుతొచ్చిండు. ముత్తాలు బటువు యాడుందంటే ఏమి సెప్పాలె? యాడనో పొడగొట్టిననంటే నమ్ముతడా? నమ్మకున్నగాని, పిలగాడు సేసిండంట ఊకుంటడా? నాయనత సెప్పి బొక్క లిరగ్గొట్టిస్తడు. అమ్మ ఏడుస్తది. ముత్తాలు ఏడుస్తది. దోస్తులు నగుతరు. నిజంగ. బటువు తీసుకోని ఊర్లపొంటె పారిండంట, అందరు దొంగల సూస్తరు.
అయ్యన్ని అట్లుండనీ, యిట్ల సారొచ్చినందుకు గురువెట్లూకుంటడు? 'ఏమి చెయ్యాలె మల్ల? ఏమి చెయ్యాలె?' అంట ఊ సొంచా యిచ్చిండు.
చంద్రంకు ఏమి చేసెతందుకు తోసలే. రేత్తిర్లల నరసయ్య పక్కన పండుకోని జామంత ఏడుస్తనే ఉంటడు. మల్ల మరుసటి దినం దయిర్నె మొస్తది. ఉసారుగ పన్ల దిగుతడు. ఇంట్ల అందరకు అబద్ధాలె చెప్పి దినాలు గడుపుతన్నడు.
రోజుకు, రోజుకు చంద్రం శాన మారుతన్నడు. సాలె పనంటే ఎనక ముదాము యిష్టం లేకుండే. సదువుకుంటేనే గొప్పనుకున్నడు. సాలె పని చేసెటోండ్లంత ఎర్రోళ్ళంటనే అనుకున్నడు. ఇప్పు డెరికె అయింది, కష్టంలనె దేముడున్నడంట!
చంద్రం యిప్పుడు పని దొంగ కాదు.
ఏ పని సెయనీ, మనసు ఒక్కతాన వెట్టి సేస్తెనే అంత మంచిగయితది. లేకుంటే ఏ పనన్నగాని, మొత్తం ఖరాబయితది. చేసిన కష్టంకు తగిన లాబం లేకున్నప్పుడు ఏమి లాబం అంటరు మల్ల! హవు. అందుకోసానికే, మన పనికి తగిన లాబం ఎట్లా తెచ్చుకొనాలె అంట సొంచాయించుకొనాలె కాని, పని దొంగలయితే మొదాలె నష్టం కద?
ఊర్లల్ల, అన్ని జాగాల్ల అన్ని రకాల పన్లు చేసెటోండ్లున్నరు. అవసలోండ్లున్నరు. బంగారం పని సేస్తరు. తమ్మతోళ్ళు డోలు వాయిస్తరు. రెడ్లోళ్ళున్నరు, కాపిరం సేస్తరు. చెలుగోళ్ళున్నరు. చేపలు పడతరు. బోయో ళ్ళున్నరు. పండ్లమ్ముతరు, మేనాలు మోస్తరు. బెస్తోళ్ళున్నరు. చేపలు పడ్తరు. ఎరికలోళ్ళున్నరు. పందులను కాస్తరు. బుట్ట దాసరోళ్ళు బుట్టలమ్ముతరు; జీడిగింజలు, దూది తెచ్చి అమ్ముతరు. సాతానోళ్ళు అడుక్కుంటరు. మాల వాసరోళ్ళు మాలోండ్లకు పెండ్లి చేయిస్తరు. బైనోళ్ళు ఊరు దేవతలను కొలుస్తరు. డక్కలోళ్ళు డక్కలోయించుకుంట తిరుగుతరు. బేగరోళ్ళుంటరు, సచ్చినోళ్ళను బొందల పెట్తరు. దొమ్మరోళ్ళు ఆటాడతరు. సేవకోళ్ళు దొర్లయిండ్లల్ల కొలువు సేస్తరు. జెలిగలోళ్ళుంటరు. అవసలోళ్ళ జెల కడిగి బంగారం ఏరుకుంటరు. ఈరముష్టోళ్ళు కోమట్ల నడుక్కుంటరు. యిప్రయినోదులు బాపనాయన్లతాన యిద్దెలు సేస్తరు. సాదనాసూరులు సాలోళ్ళ తాన సేస్తరు. ఒగ్గోల్లు కతలు సేస్తరు. ఇంక మేలోళ్ళుంటరు. మేదరోళ్ళుంటరు. కంచరోళ్ళుంటరు. అందరు యిష్టమున్న లేకున్న, కష్టమయిన కాని వాండ్ల పనులు చేస్తనే ఉంటరు. ఒక్కసారి తప్పేడిది లేదు కద? ఉన్న పని చేసుకుంటనే, కష్టం తగ్గేటందుకు నాయానికి కోషిష్ చెయ్యాలె. కోషిష్ చేయకుంటే సచ్చినోండ్ల లెక్క మనం ఎప్పటి కట్లెనే ఉంటం. అందుకోసానికి పన్లు యిడిస్తే బువ్వ పెట్టెటో డెవడు?
కొందరకు పన్ల కష్టం లేకున్నగాని లాబం ఎక్కువ వస్తన్నది! అట్లెట్ల మల్ల? వస్తన్నది నిజమే కాని, ఒక్క పొద్దుల అందరు దొరలు కావాలంట పన్లు యిడిసి కూసుంటే మొదాలు బువ్వ పోతది.ఎనక సిరి, లాబం కనిపియ్యదు. అందుకోసానికే, మనం కష్టం చెయ్యమంట అనొద్దు. 'కష్టంకు తగిన లాబం రావాలె' అనాలె. లాబం రావాలంటే కొంచెం బుర్రల సరుకు కావాలె, అంటే, తమ పన్లనే, జర మంచిగ కనిపిచ్చెతందుకు కొత్త కొత్త నమూనాలు ఎట్లెట్ల చెయ్యాలంట సొంచాయించాలే. ఎనక సిరి, ఎవరన్న కొత్త నమూనాలు దింపుత ఉంటే-అయి ఎట్లెట్లున్నయి, ఎట్ల సెయ్యాలే, ఏమి కతనంట సూడాలె. తాతల సంది సేస్తన్న పన్లకాని, కొత్త తరీక పన్లకాని జర తొందరగ అయ్యేతందుకు, మంచిగ అయ్యేతందుకు కోషిష్ చెయ్యాలె. మన పనిత మందిని మెప్పియ్యాలె. మంది మెచ్చితే గిరాకీ పెరుగుతది; గిరాకి పెరిగితే లాబ మొస్తది! అట్ల!
4
సంకురాత్తిరి పండు గొచ్చినది.
ముత్తాలు పొద్దుగాల్నె లేసింది. గలంల ముగ్గులు వెట్టింది. దొడ్ల ఆవులతాన పెండ తెచ్చి కడపపైన గొంతెమ్మలు సేసింది. నాలుగు పక్కల నలుగు పెద్దయి పెట్టి, సుట్టు వరసగ సిన్నయి పెట్టింది. గొంతెమ్మకు పూజసేసి, నయేద్దం పెట్టింది. కండ్లు మూసుకొని, సేతుల్త దండం పెడుత గొంతెమ్మకు మొక్కుకున్నది.
"ఏమిటి మొక్కినవు, కోడలా?" అంటడిగింది సుంకులమ్మ.
ముత్తాలు తలెత్తి సూసింది. అత్తను సూసెతలికి సిగ్గయినది.
సుంకులమ్మ ముత్తాల్ను దగ్గిరకు తీసుకున్నది.
"ముత్తాల పందిట్ల ముగ్గు లెయ్యంగ రతనాల పందిట్ల రంగు లెయ్యంగ
ముత్తాలు మెడల నే పుస్తె కట్టంగ!"
అత్త గుండె నప్పుడ్ల, బావ పాటనే యినిపించింది.
అంతలనే, అత్త కండ్లల కెల్లి నీల్లు పడినయి.
ముత్తాలు కండ్లెత్తి సూసింది.
"నీ పూజ లేమిటికె, ఎర్రి పిల్ల? దేశాలకు పోయినోడు యాడి కెల్లొస్తడు? మీ నాయన నీ కొరకు ఏరె పిలగాన్ని సూస్తన్నడు, బిడ్డా! శాన గొప్పోడంట! పోనిలే. నువ్వు సుకపడితే నా కంతె సాలు!" అన్నది.
అన్నదే కాని సుంకులమ్మ కండ్లంట నీల్లు వస్తనే ఉన్నయి.
"యాడున్నడో ఏందో, ఎర్రి పిల్లడు? నేను కాని, నాయన కాని ఏమన్న మంట పోయిండు?"
బటువు గొంచుపోయిండంట ముత్తాలు అత్తకు చెప్పలే. లచ్మయ్య కూడ గమ్ము నూకున్నడు. పిలగాడు ఊరిడిసి పోయిన దెందుకొరకో ఎవల్లకు ఎరికె కాలే.
"లోపలికి రా, అత్త!" అన్నది ముత్తాలు.
"నాయన నిదర లేసిండు?" అంటడిగింది సుంకులమ్మ.
"లే! అమ్మున్నది. రా!" అంట లోపలికి అత్తను గొంచుపోయింది.
"మీ మామకు పెయ్య మంచిగ లేదుకద? మందుకోసానికి పైసలు కావాలె. అమ్మను అడుక్కుపోవాలంటొచ్చిన, బిడ్డా!"
"మామ కింక తక్కువ కాలే?"
"ఏమి తక్కవనో, ఏమి కతనో? తక్కవ యిదంట చెప్తనే ఉన్నరు, నెల రోజుల సంది అట్లనే ఉన్నది కద?"
"మామ మంచాయిన, అత్తా!" అన్నది ముత్తాలు.
ఆ మాటత సుంకులమ్మకు గుండె నిండింది. ముత్తాల్ను సేతుల్ల తీసుకోని ఏడిసింది. "ఈ మనసు మంచిది, బిడ్డా! నేను సచ్చి నీ కడు పున పుడత" అన్నది.
ముత్తాలు తల్లి వాకిట్ల కొచ్చింది. ఆడ బిడ్డను లోపలికి గొంచుపోయింది.
సుంకులమ్మ పైసలు అడుక్కోని పోయింది.
జర సేపటికి లచ్మయ్య నిద్దర లేసిండు. ముకం గిట్ట కడుక్కోని నాష్టం చేసెతందుకు కూసినెతలికి సంగం కిష్టయ్య వచ్చిండు.
"ఏంది, కిష్టయ్యా? మీ సంగం ఎట్ల నడుస్తన్నది?" అంటడిగిండు లక్ష్మయ్య.
"ఏమి సంగమొ, ఏమి కతనో! సూసి, సూసి నాకు యాష్టాస్తన్నది, లచ్మయ్యా!" అన్నడు కిష్టయ్య.
"అట్ల?" అంట సురుగ్గ సూసిండు లక్ష్మయ్య.
ఇంట్ల కెల్లి ముత్తాలు పల్లెంల నాష్టతెచ్చి కిష్ణయ్య కిచ్చింది.
"చెప్పవూ?" అన్నడు లక్ష్మయ్య.
"నీ కెరికెనే ఉంటది గాని, సంగం ముచ్చట సెప్పెతందుకే వచ్చిన మీ బావను పెసిడెంటు సేసిన్రు కద? వానికి సంగం పని ఏమి ఎరికె లేదు రాజయ్యను వైసు ప్రెసిడెంటన్నరు. మీ బావ పేరు సెప్పి, ఆయన శెక్రం తిప్పుతన్నడు."
"సెక్కరట్రివు నువ్వేమి సేస్తన్నవు, మల్ల?"
"లచ్మయ్యా! నా మాట వాండ్లింటంలే! ఇర్వై నెంబరు దోవతులు తొమ్మిది జోడలకు పదమూడు రూపాలు కూలిచ్చిన. అట్లెట్ల? యింక రావలంట ఒక్కటే లొల్లి సేసిన్రు. పట్నం బోయి నూలుబేళ్ళు తెస్తె, నే నండ్ల లాబం సేసుకుంటున్ననంటున్రు. సుట్టాలకు, యిష్టమున్నోళ్ళకు మంచి సర్లు యిస్తన్ననంట, కూలెక్కవ యిస్తన్ననంట, సంగం ఆఫీసు మా యింట్ల పెట్టుకోని కిరాయి తీసుకుంటన్న నంట మొత్తుకుంటున్రు."