"ఏమిటికి?" అన్నడు రుశి.
"ఏమిలే! రేపు ముత్తాలు పుట్టిన రోజు కద? అందుకోసానికి, మిమ్ముల బంతికి పిల్సె తందుకొచ్చిండు."
చంద్రం యింకేమి యినలే.
ఏలు సూసుకున్నడు. సేత్త తడుంకున్నడు. ముత్తాలు బటువు సెయిజారి పోయింది! యాడపడ్డదో, ఏమొ!
వాకిలి దాటి దొబ్బున బయలెల్లిండు. యాడ ఆదుకున్నదో మల్ల, ఆడికే వోయిండు.
సీకట్ల రాయి తెల్లగ మెరుస్తదంట ఎరికెనె వానికి. ఆటలాడిన జాగాల్లల్ల దేవులాడిండు. ఎక్కడ కనిపియలే. మాలి పటేలింటి వాకిట్ల యాష్టొచ్చి కూసుండు.
మల్ల సడాకు మీకొచ్చిండు. సిన్న దీపం కనిపిచ్చింది.
దీపం దాపుకొచ్చింది.
నాగయ్య కనపడ్డడు. దేము డొచ్చినట్లే మనసుల మొక్కుకున్నడు.
"నాగయ్యా! జర దీపమిస్తావు?" అన్నడు.
"ఏమిటికి?" అంటడిగిండు నాగయ్య.
"లె, నా జెవుల పైసలు పడిపోయినయి యిప్పుడే దేవులాదుకుని యిస్త!"
"జల్ది తెస్తవా, మల్ల?"
"తెస్తవన్నకద?"
"మీ మామ కార్కానాల కండెలు పెట్టేతందుకు పోతన్న ఆడికి తెచ్చిస్తవా?"
"ఆడికెట్ల, నాగయ్యా?" అంటడిగిండు చంద్రం.
"మల్ల ఏమిచెయ్యాలె? ఈ దీపం మీ మామనె యిచ్సిండు యాడవెట్టినవంటె ఏమి సెప్పాలె?"
"అయితె తెస్తలే" అన్నడు చంద్రం.
దీపం తీసుకోని ఊర్ల తిరిగిన అన్ని జాగాల్లల్ల దేవులాడిండు. బటువు కనిపియలేదు.
చంద్రంకు సెవఁట్లు పట్టినయి.
ముత్తాలు బటువు తను పొడగొట్టిండు. రేపొద్దుగాల మామ సూస్తడు. బటువేడున్న దంటడు. అత్త ముత్తాల్నడుగుతది, ముత్తాలు, బావకిచ్చిననంట సెప్తది. సెప్తనె పారొస్తది. బావేడంట అమ్మనడుగుతది. ఎందుకొరకంట నాయన అడుగుతడు. 'సెంద్రిగాడు ముత్తాలు బటువు తీసుకున్నడంట కద? యాడున్నడు?' అంట మా మొస్తడు. అప్పుడు నాయన మొగ్గంల కెల్లి లేస్తడు. దండెదురు తీసుకో నొస్తడు. అప్పుడు......
చంద్రం దొబ్బున లేసి కూసుకున్నడు. దీపం తీసుకోని మామింటి దిక్కుకు బోయిండు.
కార్కానాల కిటికీతాన నిలవడి పిలుస్తుండు, నాగయ్య.
చంద్రం పోయిండు.
"నీకోసానికె సూస్తున్న!" అన్నడు నాగయ్య. "మీమామ యిప్పుడే యీడకొచ్చిండు. పైసలు దొరికినయా?"
"లేదు" అన్నడు.
"అచ్చ! రేపు పొద్దుగాల మబ్బుల్ల లేసి ఊరంత సూద్దం. నేను కూడొస్తలే!" అన్నడు నాగయ్య.
"ఎవలాడ?" అంట లచ్మయ్య వాకిట్ల కొచ్చిండు.
చంద్రం మామను సూసిండు.
కాళ్ళల వొనుకు పుట్టింది. పెయ్యంత సెవఁట పట్టింది. మామ దగ్గిరి కొస్తండగనే దొబ్బున ఆడికెల్లి ఉరికిండు.
లచ్మయ్య, నాగయ్య తానొచ్చిండు.
"ఎవలు?"
"సెంద్రయ్య!"
"ఇగ్గో, సెంద్రిగా! యీడ రార!" అంటరి సిండు లచ్మయ్య.
చంద్రం ఎవక్కు తిరగలే. ఉరుక్కుంట ఉరుక్కుంట పారిండు.
మల్ల మామ పిలిసిండు.
బటువుకోసానికె పిలుస్తున్నడంట, బయం యింక ఎక్కవయింది. గుండె దడదడలాడతన్నది. ఊరిబయట మర్రికాడికి పోయిండు.
'బటువు లేకుంటే యింట్ల కెట్ల పోత?' అనుకున్నడు. 'ఇంట్లకు పోతె బటువుత పోవాలె! లేకుంటే పోయెడిదేలేదు! ఇంటికి పోకుంటే మల్ల ఏమ్చెయ్యాలె?' మర్రికింద బండమీద కూసుండు.
సెట్టుమీద పిట్టలు కూస్తున్నయి. తల మీకెత్తి సూసిండు. ఆ సీకట్ల, మరిసెట్టుమీకి వడెతట్టె కనిపించింది.
ఆడికెల్లి మల్ల పారిండు.
ముంగల సీకటి. ఎనక సీకటి. అన్ని దిక్కుల సీకటి. గుండెల్ల బయం. కాళ్ళల్ల దడ. కండ్లల్ల నీల్లు!
'ఏమన్నకాని, బటువు కనిపియకుంటే యింట్ల కెట్ల పోతడు? నాయన బొక్క లిరగదంతడు!'
చంద్రం ఏడుస్తుండు.
ఏడుస్తనే నడుస్తన్నడు.
కడుపుల ఆకలి. పైన సలి. సుట్టు సీకటి కాళ్ళల్ల దడ.
చంద్రం అంగిత ముకం తుడుసుకున్నడు. తుడుసుకొని మల్ల నడుస్తనే ఉన్నడు.
ఎనక్కెల్లి ఎలుగు పారింది. చంద్రం తిరిగి సూసిండు.
రొండు దీపాలు కనిపిచ్చినయి. దొబ్బున సెట్టు సాటుకు తప్పుకున్నడు. లారొచ్చింది. జయ్యిమంట దూసుకపోయింది.
చంద్రం మల్ల బాట పొంట నడుస్తండు.
'లారోళ్ళు సూడకుంటం మంచిగయింది!' అనుకున్నడు చంద్రం.
నడుస్తనే ఉన్నడు.
లారి దీపాలు ఎన్కకెల్లి కనిపిస్తనే ఉన్నయి. దీపాలు పారతనే ఉన్నయి. చంద్రం నడుస్తనె ఉన్నడు.
దీపాలు ఆగినట్ల ఉన్నయి. చంద్రం నడుస్తనే ఉన్నడు.
లారి, బాట పక్కకు ఆగి ఉన్నది. లారిమీద కట్టెల్లెక్క కనిపిస్త ఉన్నయి. చంద్రం సిన్నగ సివ్వలు పట్టుకోని లారెక్కిండు.
'లారి దొరకడం మంచిగయింది' అనుకున్నడు చంద్రం. కట్టెలుమంచిగసదురుకోని కూసుండు.
లారిలకెల్లి మాటలినిపిస్తన్నయి.
"యాడున్నరు మల్ల?"
"ఇగ్గొ యీడనె! భాయి దిక్కుకెల్లి వస్తన్నరు కద?"
'ఎవలో, ఏమొ!' అనుకున్నడు చంద్రం.
పక్కకు సూసిండు. సెట్ల మాటుకెల్లి దివ్వె కనిపిస్తన్నది. రొండు నీడలు నడుస్త వస్తన్నయి. చంద్రం అట్లనే సూస్తండు.
నీడలు లారితానొచ్చినయి. లారిల కూసున్న వాండ్లిద్దరు కిందకి దుంకిన్రు, నలుగురెందొ సెవులు కొరుక్కున్నరు. వచ్చినోండ్లిద్దరు నవుకున్నరు.
వచ్చినోండ్లల ఆడామె ఉన్నది. మొగాయన దీపం పట్టుకొని ఆమె మొగంల సూసిండు.
ఆమె నగింది. ఆయన నగిండు. ఇద్దరు గల్లుమంట నవుకున్నరు.
చంద్రం వాండ్ల నప్పుడే మంచిగ సూసిండు. కండ్లు గిర్రలంతసేసి సూసిండు.
ఆమె తండల లంబడామె! ఆయన పేట దొర!
ఇద్దరు లారిల లోపల కెక్కిన్రు, దిగిన వాండ్లు దీపం తీసుకున్నరు. దీపం ఎలుగుల రూపాలు ఎంచుకున్నరు. వస్తమంట సెప్పి ఎల్లిన్రు.
లారి కదిలింది.
చంద్రం మంచిగ సివ్వ పట్టుకొని కూసున్నడు. 'లంబడ లక్ఖి, పేటదొర యాడ కెల్లొచ్చిన్రు? యాడ బోతున్రు? ఆమె తండల కెల్లెట్లిచ్చింది? పేట దొరత ఏమిటికి పోతున్నది?'
లారి జోరుగ పోతున్నది.
చంద్రం ఎన్నుల సలి పుట్టింది. ముడుసుకుని కూసున్నడు.
సుట్టు సీకటి!
లారి పోతున్నది.
'లక్ఖి, పేట దొర సీకట్ల యాడికి పోతున్రు? ఏమో? ఏందొ?' చంద్రం కండ్లు మూసుకున్నడు. లారి జోరుగ పోతున్నది.
లంబడ లక్కి, పేట దొర దార్ల యాడ దిగిన్రో ఏమొ వానికి ఎరికెలే.
మబ్బుల్ల నిదర లేసిండు.
లారి ఆగింది. యాదొ ఊరు!
చంద్రం లారి దిగిండు. ఎవరు తన్ని సూడలే! మంచిగయిందనుకున్నడు. ఊర్ల బోయిండు.
సొరకట్టల్త అవ్వలు వాకిండ్లు నూకుతున్నరు. కాపులు కావిండ్లు బుజాని కేసుకోని పొలాలకు పోతున్రు. సెట్లమీన పిట్టలు, కొలువుకు బోతన్నయి. భాయితాన ఆడవాండ్లు నీలు చేదుకుంటున్నరు. బాసన్లు ఏసుకొని తోమ్కుంటన్నరు. ఆవులు, బర్లు దాన తింటన్నయి.
చంద్రం పోతన్నడు.
మల్ల ఒక్కతాన నిలుసున్నడు. 'ఇప్పుడేడకి పోవాలె? ఏమి చెయ్యాలె?' అంటనుకున్నడు. యావసెట్టుకాడికెల్లి పుల్ల యిర్సుకుని పండ్లు తోముకుంట భాయికాడ బండమీనె కూసుండు.
"ఏందిర, నర్సిగ, యీడ కూసున్నవ్? అక్క పడుగు తడుపుతున్నది. జల్ది పోరాదు?"
చంద్రం వూకున్నడు.
"పలకవూ?"
చంద్రం లేసి నిలుసున్నడు.
"జల్ది పోయి ఊడ్తెగిట్ట పన్ను మల్ల!" అంటరిసిండు.
అంత మసక మసగ్గనే ఉన్నది. సరిగ కనిపియటంలే.
"నా పేరు సెంద్రం!" అన్నడు.
"అట్లనా? మా పిలగాడి లెక్కనుంటె అట్లనుకున్న!"
"ఫర్వలేదయ్యా?" అన్నడు చంద్రం.
"యావూరు?"
"పట్నం కెల్లొచ్చిన."
"ఎవరున్నరీడ? సుట్టాలున్నారు?"
"లే."
"నాయన యాడున్నడు?"
"ఎరికెలే!"
"ఏమి పని సేస్తడు?"
"మొగ్గం పని."
"ఏమిటోల్లు?"
"సాలోండ్లం!"
"అట్లనా?" అన్నడాయన.
నర్సిగాడు యాప్పుల్ల నములుకుంటొచ్చిండాడకీ.
"ఎవలు, నాయన?"
"సెంద్రమంట. సాలోళ్ళ పిలగాడు! పట్నం కెల్లొచ్చిండు."
"ఎవలింటికి?"
"మనింటికె!" అన్న డాయన.
చంద్రం పానం లేసొచ్చింది.
"అట్లనా? పడుగులు సేస్తం. పోదాం పా!" అంట సెయిపట్టుకున్నడు నర్సిగాడు.
చంద్రం పెద్దాయిన కాల్మొక్కిండు. కండ్లల నీలొచ్చినయి.
"ఫరవలే! ఈడ నీకేమి బయంలే! మంచిగ పని నేరిస్తె సవుకారుతాన పింజర మొగ్గ మిప్పిస్త" అన్నడు.
చంద్రం, నర్సయ్య భాయికాడ ముకాలు కడుక్కొని ఊర్లకు పోయిన్రు.
* * *