సాలెగురువు యింటితాన అరుగుమీద మంది కూసుని ముచ్చట్లాడుకుంటున్రు. వాండ్లల ముత్తాలు మామ బావనారుశి కూడ ఉన్నడు. ముత్తాలు పోత ఉంటే రుశి పిలిసిండు.
"యాడ బోతున్నవు, కోడలా?" అంటడిగిండు.
"ఇంటికి బోతన్న."
"ఈడ రారాదొర"
"ఎందుకు, మామ?" ముత్తాలు మామ తా నొచ్చి నిలుసుంది.
"కూసొ, బిడ్డా!"
ముత్తాలు కూసున్నది.
"ఆసుబోసుడు నేర్పినవా?" అన్నడు.
"మరాసునా?"
"లే, లే! శెయ్యాసుమీన!"
"నేర్పిన, మామా!"
"అట్లయితే, మంచిగ మొగ్గం జొరుమల్ల!"
ముత్తాలు నగింది.
"లచ్మయ్య బిడ్డ మొగ్గం జొరతమెందుకు?" అన్నడు సాలె గురువు.
"సాలె బిడ్డ అయినంక నేర్వకుంటే ఎట్ల? రేపు లగ్గమయినంక మగనికి సాయం చెయ్యకుంటే నేనక మెట్లయితది? ఏమి తింటది మల్ల?" అన్నడు రాజయ్య.
"లచ్మయ్య, బిడ్డను పెద్ద సవుకార్ల యింట్ల మూకుంద పేదోల్లకిస్తడా?" అన్నడు యింకోకాయిన.
"నిజం మాటన్నవు!" అన్నడు బావనారుశి.
"లచ్మయ్య కిప్పుడే కండ్లు మీద కెల్నెయంటావు?" అన్నడు రాజయ్య.
"ఎల్లనా మల్ల? చిన్నతనంల ఎట్లెట్ల సేసినదీ, ఎట్ల బతికినదీ యాడకెల్లి యాడుంటది? ఊర్ల నూరు మొగ్గం నేపిస్తండు. ఇంక, దగ్గిర దగ్గిర ఊర్లల్ల కూడ మాలు యిస్తంటడు. బేరగాండ్లొస్తరు; వీనితాన సరుకంత కొంత్సుబోతరు. ఇంట్లడుగు బయట పెట్టకుండ, సిటికెల్ల పన్లన్ని సేయిపిస్తడు. ఏలు గడిస్తడు. అసొంటోని బిడ్డకు మొగ్గం జొరత మెందుకు?"
ముత్తాలు అట్లనే కండ్లిప్పి వాండ్లను సూస్తున్నది. నాయన నిట్లంటం ఆమెకు మంచి గనిపియలె. రుశి ఆమె ముగం సూసిండు.
"ఇగ పో, బిడ్డ! మల్లపొద్దుగాల ఒత్తువులే!" అన్నడు బావనారుశి. ముత్తాలు గరువ పట్టుకొని ముద్దు పెట్టుకున్నడు.
ముత్తాలు యింటికి పోయింది.
"లచ్మయ్య మంచిగ సంపాయిచ్చిండంటలే?" అంటడిగిండు రాజయ్య.
"నేను సెప్పెడిదేమున్నది? అందరు సూస్త న్నదె కద" అన్నడు రుశి.
"అట్ల కాదూ. ఊర్ల అందరి కెరికెనెగాని, వానికి నువ్వు బావయితవుకద? నీకు జర సాయం చెయబన్లే? మనాళ్ళకు మనం సెయకుంటె బయనోళ్ళు యాడకెళ్ళి చేస్తరు? ఏలకేలు కూడబెట్టుగుంటుండు. గంత సాయం చేసెతందుకె కష్టమయితాది?" అన్నడు.
"ఇగ్గో, రాజయ్యా! ఎవని యిష్టం వానిది. ఎవని కష్టం వానిది. బామ్మర్ధి దర్మం సేత్తె తీస్కనెతందుకు నాకేటవుసరం? రెక్కల సత్తు వున్నది. పని సేసుకుంటన్న. వాని తానబోయి నేనెందుకు అడుక్కుంట?"
"అది నిజమే! నూలు గిట్ట అగ్గువకు యియ్యచ్చుకద? లేకుంటే, నేసినాటికి కూలి మంచిగ యియ్యచ్చు కద? నీ అసాంటోనికె ఇయ్యకుంటే మంది కెట్లిస్తడు?"
"వాని పైసకు నాకాస లేదు, రాజయ్యా!" అన్నడు రుశి.
"అచ్చ! నీకు లేకుంటే పాయె! నీ దొక్కటే మొగ్గం. ఊర్లనే యింక నూరు మొగ్గా లున్నయికద? వాండ్ల కష్టం సూడొద్దా? సరకారు దిక్కుకెల్లి లచ్చలకు లచ్చలు రూపాలొస్తున్నయికద? అందం దిక్కున సీరాల్ల, గుంటూర్ల, ఎంకటగిర్ల, దర్మారంల నేతగాండ్లంత కలిసి సంగాలు పెట్టుకున్నరు. సరకారు దిక్కుకెల్లి రూపాలొస్తయి. పెసిడెంటు, సెక్క రట్రి అంట-లెక్కలు రాసుడు, సంగం పని చూసుడు చేసెతందుకు పెద్ద మనసుల్ని ఎన్నుకుంటరు. వాండ్లు ఒక్కతాన సంగం ఆపీసు పెట్టుకోని, నరకాసు రూపాల్త నూలు కొని దాస్తరు. మన అసాంటి నేతగాండ్లు అండ్ల మెంబర్లుంటరు కద, వాండ్లు ఆడికెల్లి నూలు తెచ్చుకుంటరు. సీరలు, దోతులు, కాండ్వలు, రుమాండ్లు, వొల్లెలు, తుమాండ్లు గిట్ట నేస్తరు. అప్పుడు సంగం దిక్కుకెల్లి పనాండ్లకు సనుగుకింతంట సెప్పి కూలిస్తరు. అట్లా నూలు తీసుకొనుడు, నేసుకొనుడు!" అన్నడు సాలె గురువు.
"అట్ల కూలి, లచ్మయ్య కూడిస్తన్నడు కద?' అన్న డింకొకాయిన.
"అగ్గో అదె తెలుసుకొనాలంటన్న లచ్మయ్య కూలిస్తడు కాని, మన కష్టంకు తగినంతుంటదా? ఉండదుకద! సంగంల అట్ల కాదు. పనాండ్లంత ఎంత కూలి కరారు సేస్తె అంత గిడతది. కష్టంకు తగినంత దొరుకుతది. కూలి పెంచాలన్న సంగంల అందరు కలిసి అనుకుంటే పెరుగుతది. లచ్మయ్య యిట్ల యిస్తడా? ఆయన ఎంతనుకుంటే అంతనే! ఎక్కువ కావాలె అంటే, పన్లకెల్లి ఎల్లగొడ్తడు. నువుకాకుంటే నీ అసొంటోళ్ళు శానమందున్నరులే పొమ్మంటడు. ఏమిసెయ్యాలే? సచ్చి సచ్చి సేత్తనే ఉంటం. గ్గా సమగులన్ని ఆయన మంచిగ, పేటల, పట్నంల లాబానికి అమ్ముకుంటడు. లాబంల మనకేమన్న యిస్తడా? యీడు. సంగంల అట్ల కాదు కద! సాలుకంత వచ్చిన లాబం మెంబర్లు అందరికి పంత్సతరు."
"అంటే, మనం కష్టం సేస్తె మనదె లాబమంటవా?" అంటడిగిండు రాజయ్య.
"అవ్, మల్ల!" అన్నడు గురువు.
"ఇదేందో మంచిగుందన్నా!"
"ఏందనుకున్నవ్, మల్ల?"
"అయితే మనం సంగం పెట్టుకుంటే సరకారు దిక్కుకెల్లి రూపాలొస్తయి!"
"వస్తయంట సెప్తున్నకద?"
"అయితే పెట్టరాదో?"
"నువ్వు నేననుకుంటేనే అయితాది?"
"మల్ల ఎవలు సెయ్యలె?"
"మనాండ్లంత కలవాలె."
"కలవరా?"
"కలుస్తరులే! లచ్మయ్యకు తెలకుంట సిన్నగ శురు చెయ్యాలె."
"అట్లనే సేద్ధం, లేకుంటే పగబడతడు."
"గ్గదె సెప్పెడిది."
"అయితే, యిట్ల సెయ్యాలె. రుశి అన్నను పెసిడెంటు సెయ్యాలె. నువ్వు సెక్కరట్రుం డాలె. సంగం మంచిగ నడపాలె!" అన్నడు రాజయ్య.
"నాకేమిటికి, రాజయ్య? సదుకున్నాయన్ను వెట్టున్రి" అన్నడు రుశి.
"నీ సదువు సాల్లె, మామ!" అన్నడు రాజయ్య.
"నీకేమెరికర? పుట్టిన సంధి మొగ్గం దాటి రానోన్ని సంగం పన్లు నాకేమెరికె?"
"అచ్చ! అదంత ఎనకసిరి సూస్తంకాని, ముందుగల మనాండ్ల నందర్ని కట్టుకరావాలె. నూలు పున్నమొస్తున్నది కద! అప్పటికందరం కూసుని మాటాడుకుందం" అన్నడు సాలె గురువు.
"హవ్! అట్లా సేస్తెగాని యీ సవుకార్ల జోరు తక్కువ కాదు."
"వన్నెలేసుడు, ఆసువోసుడు, పడుగులు సేసుడు, తీర్వయిన సనుగులు అంగండ్లల అమ్ముడు-అన్ని సంగం దిక్కుకెల్లె జర్గుతయి."
"పనంత మల్ల సౌలత్ అయితదన్న మాట?"
"మల్ల?"
"మనదెట్లపోయిన కాని, మన పిలగాండ్లు సుకపడతరు! 'నెయ్యి, బువ్వ' అన్నరుకద."
"ఎంత నేసినగాని సాలెపన్ల ఏమున్నది, రాజయ్య? సచ్చెదంక సగం గుంత; సచ్చివంక నిండుగుంత! అంతనెకద?" అన్నడు గురువు.
"అగ్గో! మల్ల అట్లంటవూ?" అన్నడు రాజయ్య.
"లే లే! ఉన్నమాట సెప్తన్న!"
"పుట్టిన సంధి మనం చెయటంలే! అట్లనే మన పిలగాండ్లు!"
"వాండ్లు మన లెక్క కాదు, రాజయ్య! దునియ తరీక మారత ఉంటే, పిలగాండ్లు కూడ మార్తనే ఉంటరు. మనం సేసెడి కష్టం వాండ్లు సెయలేరు. ఎవకటి రోజులే యేరుగ్గా మనుసులే యేరు ఏమంటన్న? అంటే, మన పిలగాండ్లు మనకంటే జర సురుకయిన వోండ్లు. ఇండ్ల కష్టం యిప్పుడే మనపన్ల సూస్తన్నరు కద? సూస్త వాండ్లెట్ల దిగుతరు? కొలువులు సేసుకుంటమంట సదువుకు పోతున్రు. నువ్వు కొట్టిన, సంపిన గాని, యినెటోండ్లెనా?"
"కష్టమున్నదంటనె మనం మంచిగుండెతందుకు సంగం పెడతన్నంకద?" అన్నడు రాజయ్య.
"అందుకోసానికే, ముంగల మనం అన్ని తయ్యారు సేసుకునాలె; మంచిగ నడిపియ్యాలె; సౌలత్ సూపియ్యాలె!"
"అప్పటిదంక అట్లనే యిడవాల్నా?"
"ఏమయితది? సదువుకుంటరు."
"అప్పటికి సదువేమి పెడ్తది?"
"ఇగ్గో, రాజయ్యా? ఏపన్ల ఉన్నగాని మనిసయినాడికల్ల సదువుండనే ఉండాలె, ఎంతనో అంత! లేకుంటే సురుకయినవోడల్ల మోసం చేస్తనే ఉంటడు. మన బతుకెట్ల నడవాలె, పన్లెట్ల మంచిగ సెయ్యాలంట నేర్పెడిది సదువు. అయినంక, సుస్తుగాకుండ జర కష్టం సేసెతందుకు అలవాటు కావాలె. ఏపన్లకాని, కష్టం లేకుంటే ఎట్లయితది? కష్టం సెయకుంటనే అందరు పెద్దోండ్లయితారు? అందుకోసానికి కొంచెం సదువు కావాలె. శాన పని కావాలె. రొండుంటనే యీ యాల్రేపు బతగ్గలుగుతరు. అందుకోసానికె, మన సంగం తయారయెదన్క పిలగాండ్లను సదుకొనిస్తెనే మంచిగయితది!" అన్నడు గురువు.
పొద్దు జారత ఉండంగ అంత లేసిన్రు.
"నూలు వున్నంమాట యాదుంచుకో, మామా!" అన్నడు రాజయ్య.
"మంచిది!" అన్నడు రుశి.
రుశి యింట్లకు బోయెతలికి సుంకులమ్మ దీసోడ తాన కూకుని కండెలు పడతన్నది.
"ఆడు రాలేదులే?" అంటడిగిండు.
"లే!" అన్నదామె.
"వచ్చినంక, వానిసెత రేత్తిరంత కూసొవెట్టి నువ్వు కండెలు పట్టిపించకుంటే మల్లమొకం సూసెడిది లేదు" అన్నడు రుశి.
సుంకులమ్మ మాటాడలే.
రుశి మల్లా మొగ్గలం కూసుని నేసకంశురు చేసిండు.
"గెంజి తాగుతవా?" అన్నదామె.
"ఆడు రావాలె" అన్న డాయన.
చంద్రం వచ్చిండు. వాకిట్ల సీకట్ల నిలుసున్నడు.
"లచ్మయ్య వచ్చి పోయిండు" అన్నది సుంకులమ్మ.