Previous Page Next Page 
ముత్యాల పందిరి పేజి 6


    ఎన్నెల మంచిగ పడుతున్నది. కుర్వ మీకెల్లి అడివంత కనిపిస్తున్నది.
    చంద్రం నెగడు తాన కాసుకొనకుండ, కుర్వ కొసాకెల్లి దవ్వున అడివంత సూస్త అట్లనే నిలుసున్నడు. అట్ల, అంత సూస్తుంటే వాని మనుసు  నిండినట్ల ఉన్నది.
    మబ్బుల్ల లేసి అందహ్రు పాపనాశంల తానాలు సేసిన్రు. మయేశరునికి మొక్కుకున్నరు. అమ్మకు మొక్కుకున్నరు. సిరసెక్ర మున్నది. దాన్కి మొక్కుకున్నారు. బజన సేసిన్రు, పాటలు పాడిన్రు.
    కొండమామిడి సెట్టుకింద పొయ్యి సేసిండు గురువు. అంబటాకుల బువ్వొండి అందరికి వెట్టిండు.
    పిలగాండ్లు కోతులను పిలుసుకుంట, కూసుని ముచ్చట్లాడుకున్నరు.
    "ఈడికెల్లి తలుపుల కుర్వ ఉన్నది. గాడ పెతాపరుద్రుని కోటున్నది. కోసెడు దవ్వు మున్ననూరుకు మెట్లున్నయి. అట్ల నడుసు కుంట పోతె, అదికూడ కోసెడుంటది."
    "పోదమా?" అన్నడు నాగయ్య.
    "నువ్వెనా, వొచ్చెటోనివి?" అన్నడు గురువు. అందరు నగిన్రు.
    "అట్ల సూసుకుంట పోతే యియ్యాల యిండ్లకు పోయెడిదెట్ల? మల్లెన్నడన్న వత్తంలే. ఇంక యివండి సెప్త. ఈడికెల్లి లొద్దిలోయకు పోతే ఆడకూడ శివున్ని మొక్కుకుంటరు. ఆడికెల్లి నల్లమలల్ల సిరిసెయిలంకు బొయ్యారంలంగ బాటున్నది."
    "నువ్వు పోయినవా, మామ?" అంటడిగిండు చంద్రం.
    "పోతే యీడికెల్లొస్తనా, మల్ల?" అంట నగిండు గురువు.
    "కుందేళ్ళు నిప్పు డేమి చెయ్యాలె?" అన్నడు నాగయ్య.
    "నీతన్న ఉన్నియు. కింద ఊర్లకెల్నంక ఏం చేసెడిది నేన్చెప్త కాని, గుడి ముంగలకు తేకు! నువ్వు పట్ట్టిన కుందేలు కెన్ని కాళ్ళున్నయిరా?"
    "నాల్గెకద!" అన్నడు చంద్రం.
    "మూడయితే లేవుకద!" అంట నగిండు గురువు.
    అంత నగిన్రు.
    కొండకెల్లి దిగుతుంటే కురవంత గుర్రం నాడ లెక్క కనిపిచ్చింది చంద్రంకు.
    అందరు కురవ దిగొచ్చిన్రు.
    కింద సెంచుల గూడెమున్నది. సరకారు అడివిల వాండ్లు కాపుంటరు. వాండ్లతన్న పెద్ద పెద్ద జాగిరాలున్నయి, గుర్రమంత ఎత్తుకు. సుట్టు మంచె లేసుకొని నడమ గుడిసేలు కట్టుకున్నరు. పక్కకు నీల్లకుంట ఉన్నది. కుంటతాన యిప్ప పూసెట్లున్నయి. సెంచోండ్లకు యిప్పపూ సార శాన యిష్టం!
    వాండ్ల యిండ్లు, వాండ్ల మంచెలు, మంచి నీలకుంట, యిప్పపూసెట్లు సూస్తుంటే చంద్రంకు శాన ముచ్చటయింది.
    కొంచెం దవ్వుల లంబడోల్ల యిండ్లున్నయి. సెంచోల్ల యిండ్లకంటే యియి జెర పెద్దయి.
    లంబడోళ్ళ తండ సిన్నది. అందరు ఒక్కతానె ఉంటరు. పొద్దంత అడివిలకెల్లి కట్టెలు తెచ్చుకుంటరు. దాపుల పల్లెకు, పేటకు బోయి అమ్ముకుంటరు. గోనెపట్టలు నేస్తరు. పొరకట్టలమ్ముతరు. పండ్లమ్ముతరు. కాపిరంకూడ సేస్తరు. పొద్దంత తండ కాలిగుంటది.
    ఆడికొచ్చెతలికి వాండ్లకు దూప అయింది. నీలు కావాలె. యాడికెల్లొస్తయి?
    బాట పక్కకున్న యింట్ల గలుగల్లుమంట నప్పుడయినది. ఆడొక ఆడామె ఉన్నదంట ఎరికయి, వాకిట్ల పోయి, "ఓ లక్కీ!" అంట పిలిసిండు.
    లంబడామె యింట్ల కెల్లొచ్చింది.
    "ఏందయ్య?" అన్నది.
    "పిలగాండ్లకు జెర నీలు తాపిస్తవా?" అంటడిగిండు.
    "తెస్త! యీడ కూసున్రి" అన్నదామె. లోపలికి బోయింది.
    "ఈమె నీ కెరికనెనా, మామ?"
    "లే" అన్నడు గురువు.
    "మల్ల పేరెట్ల తెలుసు?"
    "గ్గదంటావు? లంబడోళ్ళల మొగోండ్లను నాయక్ అంట, ఆడోండ్లను లక్కి అంట-ఎవల్లనన్న అట్లా పిలవచ్చు."
    "అయేం పేర్లు? అట్లున్నయి?" అన్నడు చంద్రం.
    "అట్లనే ఉంటయి మల్ల, సోమ్ల, నాన్య, లచ్చ, బీక్య, వాల్య- యిట్ల మొగోండ్ల పేల్రుంటయి."
    "ఆడోళ్ళయి?"
    "మిర్యాలీ, చాందీ, లక్కి- యిట్లుంటయి. ఇంటిపేల్రు యింక తమాసగుంటయి. కాట్రా వత్, డా క్రావత్, ఘుఘులొత్, బాండావత్, బాణోత్, జాటోత్..."
    "ఏంది, దొరా! మా పేల్రు నేర్ స్తన్నవు?" అంటడిగింది లక్కి. నీల్ల కడ్వత బయలెల్లింది.
    "ఈ పిలగాడడుగుతుండు."
    "ఏమిటికి? లగ్గం సేసుకుంటడా, నన్ను?" అంట నగింది లక్కి.
    చంద్రంకు సిగ్గయింది.
    "సేసుకుంటడు గాని, నిన్ను సూస్త సిగ్గయి తుండు."
    "అట్లెట్ల మల్ల? నన్నుసూడు. నీ కండ్లకు మంచిగ లేన? నీ పేరేంది?" అన్నది.
    "చంద్రం" అన్నడు.
    "చాందీ! పేరు మంచిగుంది. నన్ను సూడు మంచిగ మల్ల! ఎట్లున్న? మాయాసం మంచిగ లేదా, అయ్య? నెత్తికి కప్పుకునెడిది ఏమంటరో ఎరికెనా?"
    "నువ్వె సెప్పరాదు?" అన్నడు గురువు.
    "టూక్రి అంటం, మా బాసల. మదిరా వన్నెల యిది సాడి. సెవులకు జుమ్కాల లెక్కసున్నది సూడు. ఇది టోప్లి. పక్కకు గొల్చు మాదిరుండెడిది ఆడ్కాట్. టోప్లి మీదుండెడిది గూగ్రి. సెవులకెల్లి కింద యిడిసెడిది కెన్యా. ముక్కుకున్నది భూరియ అంటం. సేతుల కున్నయిలే, యియ్యి గాజులెక్క, బల్యా. ఇది రూపాల గొల్చు, రుప్యర్ హార్. కంటెతీగ మాదిరిది హాఁస్. కాళ్ళకు ఛల్లా. ఇది వాడీ. అది కాచ్. అయ్యి ఫేటియాఁ. మొలకు గజ్జెల లెక్క నుండెడిది ఘూగ్రా. మల్ల రాఁటీ యీడుంటది. అద్దాల లంగలు తొడుగతం. అద్దాల రయికలు తొడుగుతం. మీ వూర్ల పోరిలు మాలెక్క నిట్లుంటరా మల్ల?" అంటడిగిందామె.
    చంద్రం మాటాడలేదు.
    "అట్ల సూస్తవేంది, సిన్నదొత?" అన్నది. "మాయింట్ల ఉంటవా? నువు కొట్టిన కుందేళ్ళు కూరొండి పెడ్త!"
    "స్సీ!" అన్నడు చంద్రం.
    "ఏమట్ల?"
    "నీతాన గబ్బుకొడ్తది!" అన్నడు.
    ఆ మాటత లంబడామె చంద్రంను ముద్దు పెట్టుకోని లెస్సగ నగింది.
    గురువుకూడ నపుకున్నడు.
    "కష్టం సేసెటోలం గబ్బుకంపు కొట్టమా మల్ల? మీలెక్క దొర్లం కాంకద, అత్తరోస నొచ్చెతందుకు?" అన్నది లక్కి.
    "మేం దొర్లం కాము!" అన్నడు చంద్రం.
    "అట్లయితే మనమంత మనుసులమె కద! ఏ కంపుకొడ్తే ఏమున్నది? సెమటోడ్సెటోల్లకు గబ్బు లేకుంటే యాడకెల్లిపోతది, సిన్నదొరా!" అన్నదామె.
    చంద్రం మాటాడలే.
    ఇంతల దవ్వున సెట్టునీడను మనిసి కనిపిచ్చిండు.
    "ఓ పేటదొర! ఈడ రా!" అన్నది లక్కి.
    దవ్వుకెల్లి ఆయన వచ్చిండు.
    "ఇగ్గో. ఈ సిన్నదొరను సూడు. నన్ను లగ్గం సేసుకుంటడంట!" అన్నది.
    "యావూరు?" అంట ఆయన అడిగిండు.
    "ఉయ్యాలవాడ."
    "లచ్మయ్యను గురుతుపడతవా?"
    "లచ్మయ్య మా మామనె!" అన్నడు చంద్రం.
    "అట్లనా?" అంట సూసిండు.
    జెరసేపయినన్క అంత లేసిన్రు. యాటల కొట్టిన కుందేళ్ళను లక్కినే కూర సేసుకొమ్మంట యిచ్చిపోయిన్రు.
    లక్కి, పేటదొర ఏందో నవుకుంట అడివిల బోయిన్రు.
    "ఈల్ల బాసేంది యిట్లుంటంది, మామ?" అంటడిగిండు గురువును, చంద్రం.
    "లంబడి బాస. పైదేశం కెల్లి వచ్చిన్రు. తండలు తండలు యీడనే ఉండిపోయిన్రు. వీండ్ల యాసమంత అదొక తరీక. వీండ్లు బట్టలకు రకరకాల రంగులేపిచ్చుగుంటరు. అయ్యేసెడి వాండ్లను రంగ్రేజోల్లంటరు. లంబడోళ్ళది ఏన్గబలం. తండంత ఒక్కటే కట్టు! శాన కష్టం సేసి బతికేటోల్లు" అన్నడు గురువు.
    "సాలోళ్ళకంటెనా?" అన్నడు చంద్రం.
    "సాలోళ్ళదేమున్నది? మంచిగ యింట్ల, నీడన కూసుని మొగ్గం నేసుకుంటం. వీండ్లు పొద్దంత ఎండలనె బతుకుతరు. నిజము మాట సెస్తె వీండ్లదె పెద్ద కష్టం!"
    అందరు ఊరుమొగమయి పోతున్రు.
    లంబడోల్ల ముచ్చట్లు సెప్పుకుంట పోతున్రు.
    నవుకుంట పోతున్రు.
    ఉరుక్కుంట పోతున్రు.
    ఎండల నడుస్తనె ఎన్నట్లపోయెడి లెక్క ఆడుకుంట పోత్రున్రు. పాడుకుంట పోతున్రు.

                                     3

    "చెమ్మ చెక్క చారెడేసి మొగ్గ
    అట్లు పోయిరంగ! ఆలకించు రంగ!
    ముత్తాల పందిట్ల ముగ్గు లెయ్యంగ
    రతనాల పందిట్ల రంగు లెయ్యంగ!"
    "ముత్తాలు మెడలనే పుస్తెకట్టంగ.
    రతనాల గదువలకు రంగు పుయ్యంగ!
    చెమ్మ చెక్క చారెడేసి మొగ్గ
    చెమ్మ చెక్క చారెడేసి మొగ్గ!"
    "ముత్తాలూ!"
    "ఏంది, బావా?"
    "ఎవురిదే, నీ ఏల్దీ?"
    "ఏందది?"
    "బటువు!"
    "అవ్, బావ! మా అయ్యా సేసిచ్చిండు?"
    "ఏది, సూపియి! మంచిగున్నది, ముత్తాలు! ఇప్పటిదన్క సూపియలేదేం మల్ల?"
    "ఈయాలే పెట్టుకున్న కద?"
    "ఏమిటికి సేపిచ్చిండు?"
    "రేపు నా పుట్టిన రోజు కద? అందుకోసానికి రవ్వలేపిచ్చి సేపిచ్చిండు. మంచిగుందా?"
    "లేదా మల్ల! అండ్ల నీ సేతికి యింక మంచి గుంది."
    "అవ్. మాయమ్మయీయల్నె పెట్టొద్దంట సెప్పింది. 'రేపు నీ పుట్టిన దినం. బిడ్డ, ఆయాల మంచిగ లంగా కట్టుకొని, రయిక తొడుక్కొని జడ్లపూలు పెట్టుకోని, కాల్లకుబండారు, సున్నంత పారాని పెట్టుకోని, అప్పుడు బటువు పెట్టు కొనా'లంట నాయన సెప్పిండు. అందుకోసానికే నాయన సూడకుండ అమ్మనడిగి తెచ్చిన."
    "జెర మంచిగ సూసియి."
    "ఒక్కసారి పెట్టుకొని మల్ల యిస్తవా?"
    "నాతన్న యాడికెల్లి పోతది?"
    "లేలే! కొంచెం సేపున్నంక మల్ల యిస్తవని సెప్తున్న!"
    "అట్లనే!" అన్నడు చంద్రం.
    తన ఏలి బటువు తీసి చంద్రం ఏలికివెట్టింది ముత్తాలు. బటువులరాయి దగదగమంట మెరుస్తున్నది.
    ఇద్దరు ముచ్చటగ సూసుకుని నవుకున్నరు.
    "లగ్గంల యిసొంటియె పెట్టుకుంటరులే?" అంటడిగిండు చంద్రం.
    "అవ్, మల్ల!"
    "మీ నాయన సేపిస్తడా?"
    "ఏమొ, నాకేమెరికె?" అన్నది ముత్తాలు కండ్లు తిప్పుత.
    "బటువు సేపిచ్చకుంటే లగ్గమెట్ల సేసుకుంట?    
    "అవ్, మల్ల!"
    "ముత్తాలు కున్నది కద, నీకేమిటి కంటడా?"
    "ఏమొ! నాకేమెరికె?"
    "అగ్గో ఏమి తెలియని లెక్క అట్ల మాటాడతారు?"
    "ఇంకెట్ల?" అన్నది ముత్తాలు.
    "ఇట్ల!" అంట సెవి కొరికి, నెత్తిమీద ఒక్కటుచ్చుకొని అట్లనే పారిండు.
    "నన్ను కొట్టి పోతన్నవులే! అత్తత సెప్తనుండు!" అంట అరిసింది ముత్తాలు.
    చంద్రం యినలే.
    ముత్తాలు ఆడనే నిలవడ్డది.
    పొద్దు వంగుతున్నది. లంబడోళ్ళు కట్టెల మోపులు అగ్గువకు అమ్ముకుని, పైసలు లంగ జేవుల ఏసుకొని దబ్బ దబ్బ తండదిక్కుకు పోతున్రు. పండ్లమ్మెటోళ్ళు కుప్పలు కుప్పలు యిచ్చేస్తున్రు.
    పొద్దుమీకి ఎట్లనన్న యిండ్ల సేరాలంట తొందర అందర్ల కనిపిస్త ఉంది.
    "నీపేరు ముత్తాలు లే?" అంటడిగిండొకాయన.
    ముత్తాలు పక్కకు తిరిగింది.
    "లచ్మయ్య సేటు బిడ్డవులే?" అన్నడు.
    "అవ్!" అన్నది ముత్తాలు.
    "మీ నాయన ఊర్ల ఉన్నడా?" అంటడిగిండు.
    "లే. పేటకు బోయిండు."
    "అట్లనా? నాకొరకే పోయిండొ'చ్చు. మల్ల ఎన్నడన్న మీ యింటి కొస్తలే!" అన్నడు.
    ముత్తాలు మాటాడలేదు. సిన్నగ నడుసుకుంట యింటి మొగమయి పోయింది.

                                    *    *    *

 Previous Page Next Page