"సరకారు తాన రూపాలు తీసుకోని బంగ్లా కట్టిపిచ్చుకోరాదు?"
"నే నట్లనే అన్న, లచ్మయ్యా! మీ బావనే అడ్డు సెప్పిండు. 'సంగం కోసానికి బంగ్ల కట్టి పిస్తే నేతగాండ్లకేమి లాబం?' అంటన్నడు. పోనీ ఆయన్ని నాకేమిటికి గని, ఈ సెక్కరట్రి తనం యిడ్సి పెట్టాలంట సూస్తన్న!"
"ఇడ్సిపెడతావు? ఏందట్ల, ఆడోళ్ళ లెక్క మాటాడతవు. కిష్టయ్య?"
"ఏమి సెయ్యాలే, మల్ల?"
"జర సొంచాయిస్తే అంత ఎరికయితది."
"అదేందో నువ్వు సెబుతవంటనే వచ్చిన!"
"నాకంత ఎరికెనే! సెక్కరట్రితనం యిడుస్తనంటవు కాని, నీకు లాబం గిట్టలేదంటవా?"
"ఏమంత ఉన్నదని?"
"ఎంతన్న కాని ఉన్నదా, లేద?"
"ఎంత ఉన్నదో నీ కెరికెలే?"
"ఉన్నదిలే! అందుకోసానికే సెబుతన్న. నామీద కచ్చకట్టి రాజయ్య వాండ్లంత సంగం పెట్టుకున్నరు. పెట్టుకున్నరుగాని, నామీద దెబ్బ తియగల్దురా?"
"అట్లెట్ల?"
"ముందుగాల నేను సంగం యిసయాల్ల పట్టిచ్చుకున్లేదు కాని, యిప్పుడిప్పుడంత సూస్తన్న. ఎలా సూసి ఏలు నొక్కితేగాని వీండ్లు లొంగరు. అచ్చ! అదంత పోనియి. నేను చెప్పి నట్ల చేస్తవా?"
"కాదంటనా, లచ్మయ్య?"
"మనం యిద్దరం మల్ల ఒక్కతాన కూసుని అన్నిసాయాలు మాటాడదం. మన ముచ్చట మల్ల మూడోవానికి తెలియద్దు. యిన్నవా?"
"అట్లనే!"
"నే నుండగ నీకేమి ఫికరొద్దు."
"మంచిది" అన్నడు కిష్టయ్య.
* * *
ఆ దినం పొద్దుమీకి, మగని గుండెలమీన సెయ్యేసి సూసింది సుంకులమ్మ. ఆక్కుంట, ఆక్కుంట దమ్ము లేస్తన్నది. పెయ్యంత అట్ల లేస్తన్నది; పడతన్నది.
సుంకులమ్మ మగన్ని పిలిసింది. సేతుల్త కదిపింది. ముకంల కండ్లు గుచ్చి సూసింది.
మగడు కదలలే.
సుంకులమ్మ గుండె దబ్బు మన్నది.
మగని రొమ్ముమీద పడి గొల్లున ఏడిసింది. కొంచెంసేపు అయినంక బావనారుశి సిన్నగ కండ్లిప్పి సూసిండు. సుంకులమ్మ, అట్లనే రొమ్ముమీద పడి ఉన్నది. సిన్నగ దమ్ము పీల్చుకున్నడు.
"సుంకులు!" అంట పిలిసిండు.
సుంకులమ్మ కండ్లింత సేసుకోని సూసింది. మగని ముకం సేతుల తీసుకుని ఏడిసింది.
"ఏందె, ఏడుస్తవ్? నే నేమి కాలేదు కద? గంత జల్ది సస్తానే? నా కిప్పుడు అర్వైఅయిదేండ్లు కద? మా నాయన డెబ్బయ్యేండ్లు బతికిండు కద! ఇంక అయిదేండ్లు బతుకుత. అప్పటికన్న పిలగాడొస్తే, యిగ్గో, యిట్లనే వాని సేతుల్లసస్త! లేకుంటే నీ సేతుల్ల సస్త!"
"ఒద్దు! అసాంటి మాటలంటే నీ ముంగల్దె ఉరోసుకు ముందుగాల నేనె సస్త!"
"ఏంటో! అట్లనుకుంటంగాని సావు, పుట్టక మన సేతుల్ల ఉన్నాదే? ఇది అరుసు జున్నోడు దేవుండ్ల లెక్క పోనియ్ నేను సావనంట సెబ్తున్న కద? పిలగా డొచ్చెదంక నే నిట్లుంటలే! సర్వలే. పో. లెవ్వు. ఆడ సూర్ల తంబాకున్నది తీస్కరా. ఇగ్గో. యిప్పుడు ఒక్క కల్లు బొట్టేసుకుంటే దమ్ము లేస్తదంటనా?" అంటగిండు రుశి.
సుంకులమ్మ మాటాడలే. కల్లు బొట్టు, కల్లు బొట్టంటనే పెయ్యెట్ల సేసుకున్నడో ఆమె కెరికెనే. దినామంత కష్టం సేసివంక జర్ర ఏసుకుంటే పెయ్య దూది లెక్క తేలి కయితది. నిజమేకాని, అట్లనే దినాం, దినాం జరంత మనిసిని తినేస్తనే ఉంటది. అందుకోసానికే సెప్పింది, కల్లు తాగొద్దంట. ఎప్పటి కప్పుడు తాగనంటనే అంటడు కాని, మల్ల పొద్దుమీకి, పనుగు కోసినంక సంగంల యిచ్చిన పైసలు తీసుకోని, అట్లనే ఆడి కెల్లొస్తడు. 'కావల్నంటే, గనుల్లోండ్లత సెప్పి, నీక్కూడ తెప్పియమంటవా?' అంటడు.
సుంకులమ్మ, గుడిసె సూర్లకెల్లి తంబాకు దబ్బ తీసి తెచ్చింది.
పెయ్య సుస్త్ ఉన్నగాని, అట్లనే సిన్నగ మంచం మీన కూసుండు రుశి. మోతుక ఆకుల తంబాకు పాడెం ఏసి సుట్ట సుట్టుకున్నడు. పలుగురాయి మీన జర దూది పెట్టుకోని యిమం ముక్కత కొట్టిండు. అగ్గి అయింది. సుట్ట నోట్ల పెట్టుకోని దమ్ము పీల్సిండు. దమ్ము పీల్సతనే దగ్గొచ్చుండె. కాని జరా సేపట్ల మల్ల తక్కవయింది.
"గెంజి తాగినావె?" అంటగిండు రుశి.
సుంకులమ్మ మాటాడలే.
సిన్న మంచం మీకెల్లి కాలు దించిండు.
సుంకులమ్మ కట్కి నేలమీద పడిఉండే. రుశి ముంగలికి వంగి సూసిండు. ఆమె సూస్తనే ఉన్నది.
"పిలగాని కోసానికి సూస్తన్నవులే?" అంటడిగిండు రుశి.
సుంకులమ్మ మాటాడలే.
"ఒస్తడే! తప్పకుంటోస్తడు. ఎప్పటికి నేను కొడతనంట నామీన కోపం వానికి. అందుకోసానికె, యీ ముసలితనంల నన్నిడిసి ఎల్తడా? ఎల్లిన గాని, యిన్నేండ్లు అమ్మను, అయ్యను సూడకుండుంటడా? కన్నోండ్లమె అయినంకాని, కావల్సినోండ్లమయినమా? పోనియ్. నేను సచ్చినంక యినొస్తడు."
సుంకులమ్మ దొబ్బున లేసి మగని నోరు సేత్త మూసింది.
* * *
సంకురాత్తిరి దాటడంత బావనారుశి బతికి బయటపడిండు. సుంకులమ్మ ఎన్ని దేముండ్లకు మొక్కుకున్నదో ఆమెకే ఎరికె!
సంకురాత్తిరినాడే లక్ష్మయ్య, కిష్ణయ్య మాటాడుకున్నరు కదా? రొండు దినాలయినంక మల్ల కలుసుకున్నరు. సంగంను ఎట్లనన్న మార్సె తందుకు యిద్దరు కూడి ఆలోసన చెప్పిన్రు. నరకాసు దిక్కుకెల్లి వచ్చిన మొగ్గాలు ఎట్లెట్ల పంచాలె? పింజర్లు ఎవలెవలికి సేసిచ్చి యియ్యాలె? ఏ పనొలవల్ల సేసిచ్చాలె? నూలు ఎట్ల తేవాలె? యాడ దాసాలె? పనాండ్లకు కూలి ఎట్లియ్యాలె? సంగం కారియ వర్గంల కెల్లి ఎవల్లను తీసెయ్యాలె? కొత్తోండ్ల నెవలను ఎయ్యాలె? ఎవల నెట్ల గుప్పిట్ల పెట్టుకొనాలె-అంట పథకం ఏసిన్రు.
పేటల సిన్న సేటున్నడు కద, రాములంట? వాన్ని ఎట్లనన్న యిండ్లకు తీస్కని రావాలంట లక్ష్మయ్య కోషిష్ చేస్తుండు. అట్లెందుకు సేస్తండో కిష్ణయ్య కెరికెనే.
రాములు శాన జాగాల్ల తిరుగుతడు. శాన మందిని గురుతు పడతడు. వానికి శాన యాపారాలున్నయి. పేటల, పట్నంల, పల్లెల్ల అన్ని దిక్కుల ఉన్నయి. యాడన్న జాతర్లు గిట్ట జరిగితే, ఆడికి బట్టల ముల్లెలు గొంత్సుబోతడు, దుకనంలు పెడ్తడు. తనవాండ్లంత పెట్టిపిస్తడు. వీండ్లు, వాండ్లు అందరిత దోస్తి చేస్తడు. మంచిగ మాటాడత, తన పన్లు గిట్ట ఏమన్న ఉంటే మంచిగా సేసుకోని, లాబం చేసుకుంటడు. అన్ని పన్లల్ల, అందరు పనాండ్లల్ల వానికి గురుతున్నది, లంబడోళ్ళల కెల్లి లక్ష్మయ్య దంక అందరు వానికి ఎరికెనే.
ఆయన సాలాయననో, కాదో ఎవల్ల కెరికెలే ఎవల తాన వాండ్ల కులమంటడు. ఎన్నడు మొగ్గం గిట్ట నెయ్యలె. నేసెటోండ్లత సేయి పిస్తడు. సేయిపిచ్చి మంచిగ లాబం తీస్కంటడు.
వానికి జర ఆడోండ్లంటే యిష్టమంట సెప్తరు. ఎవల్ల కుండదుమల్ల? అట్లనేనా వీనికి?
అట్ల కాదంట సెప్తరు మంది. పిందోళ్ళత, ఆడివాపల్త కూడ సూసినమంటరు కొంతమంది. ఏమి రాములో, ఏమి కతనో మనకేమెరికె?
రూపాలు మంచిగ సంపాయిచ్చిండు. ఏండ్ల యితే యిర్వయి అయిదే ఉన్నయికాని, బుర్రల సురుకు శానుంది, లేకుంటే లక్ష్మయ్య తానెట్ల చేర్తడు? సేరిండులె గాని, బరోస ఎట్ల సంపాయిచ్చిండు? అగ్గో! గదె మల్ల సురుకంటే!
లక్ష్మయ్య సూపు మల్ల పరుగుంటది. ఎట్ల నన్న తాను సవుకారు కద! సంగం యిసయాలన్ని ఎరికె కావాల్నంటే తనెట్లన్న లోపలికి దూరెతందుకు దారి లేదు. అందుకోసానికి కిష్ణయ్యను, రాముల్ను యిద్దర్నీ ఆడ పెట్టుకోని నాటక మాడియాలంట అనుకున్నడు. అట్ల కాకుంటే తన సవుకారుతనమంత నీలు కారిపోద? నేత గానోండ్లంత సంగం దిక్కుకెల్లి మాటాడితే కొత్త కారకాన మూల పడతది కద?
సెక్కరట్రి కిష్ణయ్య. సంగం దిక్కుకెల్లి మెంబర్లందరకు నోటీసులు పంపిండు, సాలుసరి సబ సెయ్యాలంట, ఆ సబలనే ఎన్నికలు జరుగ తయి. అంతకు ముందుగాల్నె జరగవలసి ఉండే కాని, రుశి పెయ్య మంచిగ లేదంట అందరు వాయిద ఏసిన్రు. అప్పటి కట్లయిపాయ. ఇప్పుడు మల్ల సబ సెయ్యాలంట మెంబర్లు కొంతమంది కోరతరన్నరంటసెప్పి, నోటీసులు పంపిండు.
సబ జరిగె రోజుకు సంగం లెక్కలు గిట్ట అన్ని తయ్యారు నెట్టాలే.
సబ జరిగేనాటికి బావనారుశి పెయ్య శాన మంచిగయింది. ఒక శేతుల కర్ర పట్టుకోని, పచ్చడం కప్పుకోని బయిలెల్లిండు. దార్ల లక్ష్మయ్య కనిపిచ్చిండు.
"ఏంది, బావ, మంచి గున్నవా?" అంటడి గిండు.
"ఇగ్గో, యిట్లున్న! మీ యింట్ల అంత మంచిగున్నరా?"
"ఉన్నరు. పెయ్య మంచిగ లేనప్పుడు యీడకి, ఆడికి పోత మెందుకు?" అన్నడు లక్ష్మయ్య.
"లె, లే! సంగం సబయితన్నది కద?"
"అట్లనా? వస్త మల్ల" అంట జారుకున్నడు లక్ష్మయ్య.
బావనారుశి సంగం ఆఫీసుకు సేరుకునేతలికి ఆడ అందరు కూసునున్రు. రుశి రాంగనే నడుమ ఆయనకు సోటుసేసి కూసోబెట్టీన్రు.
కొంతమంది ముకాలు తిప్పుకున్నరు. కొంత మంది పెయ్యెట్లున్నదంట చేమ మడిగిన్రు.
సబ శురు అయింది. మెంబర్లంత వచ్చిన్రు.
కిష్టయ్య కారెదర్శి నివేదిక సదివిండు. సాలుసరి జమలు, కరుసులు చెప్పిన్రు. లాబం, ఎనక సాలుకంటే శాన తక్కవయింది. ఇన్నేండ్ల సంది మంచిగ నడుస్తన్న సంగం, కిష్ణయ్య సెక్కరట్రి అయినంక ఎట్ల తక్కవయిందంట అడిగిన్రు, మంది. తను సేసిన పన్లన్ని పెసిడెంటుత సెప్తనే సేస్తన్ననంట సెప్పిండు కిష్టయ్య. బావనారుశికి గురుతులేని యిసయాలు ఒకటి రొండు సెప్పి, "ఔనా, కాద?" అంట ఆయనను అడిగిండు.
రుశికి యాదు లేకుండే. ఆ మాటనే సెప్పిండు.
"పెసిడెంటుకెయాదులేకుంటే అట్లెట్ల?" అన్న డొకాయన, అవతలి దిక్కుకు కూసాని ఉండే.
"యాదు లేదంటే మాట సెల్లుతదంట దయిర్నెం. సేసిన తప్పు పన్లు ఒప్పుకొనే టోల్లు యాడున్నరు యీయాల్రేపు?"
ఈ మాటల్త బావనారుశి కోపమయిండు.
వాని కోపంకంటే ముందుగాల దమ్ము, దగ్గు ఉబికొచ్చినది. అందర్ల ఆడ నడమ కూసుంటమే కష్టమయింది. ఎనక్కు గోడకు జేర్లబడి కూసున్నడు.
మెంబర్లంత రుశి ముకంలోకే సూస్తన్రు.
"ఒక్క మాట సెప్పెతందు కీడ కొచ్చిన నేను. సంగం శురు అయిన సంది, ఎట్లనో అట్లా నేను యిండ్ల పని చేస్తనే ఉన్న. పెసిడెంటు గిర్లు, సెక్కరట్రి గిర్లు ఏయి నా కొద్ధంట ముందుగాల సెప్పుంటిని. 'ఫర్వలే. అంత మేము సూసుకుంటం కద? నువ్వు పెద్దమనిసి కనక మాత ఉంటే సాలు' అన్నరు అచ్చ. ఎట్లయిన ఒక్క మంచి పనికొరకు కోషిష్ చేయటం తప్పేందంట చేర్న.
"ఇన్నేండ్లు గడిసినయి కాని, ఎన్నడు ఎవరు నన్నిట్లనలే. పోనీ, అన్నందుకు నా కేమి బాధ లేదు. కితం సంవత్సరం కిష్టయ్య సెక్కరట్రీ అయిండు. పట్నంల సదువుకున్నవోడంట సెప్పి, ఆఫీసు పనుల్ల అంత వానికే స్వాతంత్రం ఇచ్చియుంటి. కిష్ణయ్య ఎట్ల సెప్తే అట్ల చేసి యుంటి, సంతకం యాడ పెట్టమంటే ఆడ పెట్టియుంటి. వాని మంచితనంమీన అప్పటి సంది నాకు నమ్మకమే ఉంటూండే. అందుకోసానికే పెయ్య సుస్తున్న కాని, ఆ నమ్మకం తానె యియ్యాల్టిదన్క పెశిడెంటు గుంటి. కొత్తగ కారెవర్గంలోకి వస్త మనుకున్నవోళ్ళు పాతోళ్ళ మీన ఎట్లనన్న ఇసొంటివి తీస్కచ్చి ఎల్లగొట్టడం సూస్తనే ఉన్నం. మాట లనదలసుకొన్నోళ్ళకి ఎదటోండ్ల మంచితనం జరంతైన కనిపీయదు. మీ రేమనుకున్నగాని ఒక్కటి మాత్రం సెబుతాం. సంగం పేరుమీన ఒక్క పైస కూడ లాబం తీస్కొనలేదు."
"అందరు అట్లనే సెబుతరులే" అన్నడు రాములు.
"ఎట్లన్నగాని కొత్తవాండ్లను తీసుకొనా" లంట అందరన్నరు.
"కొత్తవాండ్లను తెస్తమంటే మాకు కూడ యిష్టమేకాని, యిసొంటి మాటలంటే మంచి గనిపియ్యదు!" అన్నడు బావనారుశి. కోపమంత అట్లనే లోపల పెట్టుకొని అన్నడు.
"పాతోండ్లల ఎవలకు కోపం రాలేదు. నీ కేమిటికి రావాలె?" అంటడిగిండు రాములు.
"రాములు! ఎక్కవ మాటాడకు. నాకు కోపమొస్తే ఊరుకునేది లేదు."
"ఏమి సేస్తవ్?"
"పానాలు తీస్త!" అన్నడు రుశి. కండ్లు ఎర్రగయినయి. కోపం ల మాట మంచిగ రాలే. పెయ్యంత కదిలిపోతున్నది.
"అంతనెనా?" అంట, నగిండు రాములు. "మల్ల జల్ది తియరాదు సూస్తం?"
మెంబర్లల అవతలోండ్లంత నవుకున్నరు. ఇవతలోండ్లు రాములు మీన కోపమయిన్రు. రుశిమీన జాలి పడుతున్నరు.
బావనారుశికి దమ్ము రాడం కష్టమయితున్నది. జరసేపుదంక నోట్ల మాట రాలే.
"ఇన్నేండ్లు బతికి యీయాల్టికి యింటెన కాల సచ్చినట్ల అయింది! అట్లనే కానీండి. నాకు యిశారం లేదు. ఇయాల్రేపు మంచోండ్లను, నాయంగ బతికే టోండ్లను ఎవల్లు గురుతు పట్టలేరు. అట్లనే మీరుకూడా అనుకున్నరు. నోటి కొచ్చినట్లఅన్నరు; గా మాటలే మంచి, సెడు యిశారణ సేసినంక అంటే బాగుండెడిది. మీల శానమంది సంగం పెట్టేతందుకు ముందుగాలే యిష్టం లేనోండ్లె. పెట్టి నంక యిండ్ల లాబం సేసుకుందమంటనే శానమంది వచ్చిన్రు. ఈడున్నోండ్లల ఎవలె సాంటోండ్లో నాకంత ఎరికెనే. అందర్ల రాములు సిన్నోడు. కాని మాట లెక్కవ మాటాడతడు. పెద్దోండ్ల ముంగల బయం గిట్ట ఏమి లేదు. మంచి, సెడు సూడడు. ఇంతకు ఆయన సంగంల సేరి రొండేండ్లు కాలే. అసలు ఈ ఊర్త ఏమి సుట్టరిక మున్నదో, ఏమి కతనో ఎవ్వరి కెరికె లేదు. ఆయన నిజంగ మొగ్గం నేసెడిది, లేనిది తెల్వదు. వాని నియత్ మంచిగ లేదంట శానమంది నాతన్న అన్నరు!"