రాజేంద్రప్రసాద్ తన చేతికున్న పాతకాలం నాటి హెచ్.ఎం.టి. వాచ్ ని అప్పటికి నాలుగవసారి చూసుకున్నాడు.
తొమ్మిదీ నలబై ఐదు ...
అప్పటికే పావుగంట ఆలస్యం....
అందరూ వచ్చారు కానీ రాంగో మాత్రం రాలేదు....
తొమ్మిదీ నలభై ఐదు తరువాత మరొక్క నిమిషం ఆలస్యం చేసినా వెనుకాముందూ ఆలోచించకుండా నోటికి ఇష్టమొచ్చిన తిట్లు తిట్టడంలో ఏ మాత్రం సంశయించడు.
సరిగ్గా, అదే సమయంలో రాంగో ఆఫీసులోకి అడుగుపెట్టాడు.
అడుగుపెట్టీ పెట్టడంతోనే సరాసరి బాస్ రూమ్ లోకి దూసుకుపోయాడు.
రాంగో వైపు...నక్సలైట్ ని చూసినట్టు చూశాడు రాజేంద్రప్రసాద్.
రాంగో ఆ చూపులకు ఏమాత్రం తొణకలేదు. అంతమాత్రానికే బెదిరిపోతే, తన బాస్ మరింత విజ్రుంభించగల మేధావి అన్న సంగతి అతనికి తెలుసు.
"కొంచెం లేట్ అయింది బాస్..."
"అవును లేటయ్యింది... కానీ కొంచెం కాదు.... పావుగంట పావుగంట..."
ఆ పావుగంటకున్న విలువ గురించి....వంద పావుగంటలు ఏకధాటిగా లెక్చరివ్వగలడు....పావుగంట కాదు....ఒక నిమిషం కూడా వృధాగా గడచిపోయిందంటే రాజేంద్రప్రసాద్ చిర్రెత్తిపోతాడు. చివరకు శోభనం రాత్రి కూడా కేవలం పావుగంట మాత్రమే శోభనానికి కేటాయించి మిగిలిన టైమ్ లో ఫైనాన్స్ కంపెనీ లెక్కలు చూసుకున్న ఘనుడు తన బాస్...
ఆయన శోభనం రాత్రుల గురించి...చాటుగా స్టాఫ్ చెప్పుకుంటుండడం ఎన్నోసార్లు విన్నాడు రాంగో...
"మన ఆఫీసులో ఆలస్యానికి స్థానం లేదన్న విషయం నీకు తెలుసుననుకుంటాను"
ఈసారి చాలా సీరియస్ గా వుంది రాజేంద్రప్రసాద్ కంఠం.
ఆయన ఇంకోమాట మాట్టాడకముందే-
రాంగో జేబులోంచి వెయ్యి రూపాయలు డబ్బుతీసి టేబుల్ పై పెట్టాడు.
డబ్బు....!
ప్రపంచాన్ని తన చుట్టూ పిచ్చికుక్కలా తిప్పుకోగల మహత్తర శక్తిగల డబ్బు....తీసుకుని గబగబా లెక్క పెట్టుకున్నాడతను.
"గోవింద రెడ్డి గారి ఆయిల్ మిల్ దగ్గరకు వెళ్ళి వసూలు చేసుకొచ్చేసరికి ఆలస్యం అయింది" చాలా వినయంగా చెప్పాడు.
అతి వినయం ధూర్త లక్షణం అన్నమాట రాంగోని చూస్తే రాజేంద్రప్రసాద్ కు అప్పుడు గుర్తుకు రాలేదు. పైగా విపరీతమైన ఇష్టం పెరిగిపోయింది.
కలెక్షన్స్ వసూలు చేసుకురావడంలో రాంగోని మించినవాళ్ళు తన ఆఫీసులో ఎవరూ లేరన్న విషయం అతనికి బాగా తెలుసు.
"ఆ గోవిందరెడ్డి పేమెంట్ ఎప్పుడూ ఆలస్యమే... ఇలా అయితే బోలెడు ఇంట్రస్ట్ కట్టవలసి వస్తుందని చెప్పు. సర్లే! ఇంకెప్పుడూ ఆలస్యంగా రాకు...వీలయినంత ముందే బయలుదేరి కలెక్షన్స్ వసూలు చేసుకురావాలి"
"వాళ్ళు ఇవ్వడం ఆలస్యం చేస్తే.... తీసుకురాకుండానే వచ్చేయమంటారా?"
"భలేవాడివే! ఇస్తామంటే ఎంతసేపున్నా ఫరవాలేదు..."
"అప్పుడందుకే కాస్త లేటయ్యింది. క్యాష్ బాక్స్ తాళం వాళ్ళ అబ్బాయి దగ్గర వుండిపోయింది రావడంతోనే ఇస్తానని గోవిందరెడ్డి చెప్పాడు. అందుకే వుండి డబ్బు ఇచ్చాక బయలుదేరి వచ్చేసరికి ఈ టైమ్ అయింది..."
సరిగ్గా బేసికల్ గా మనిషి వీక్ పాయింట్ మీద దెబ్బకొట్టాడు రాంగో.
రాజేంద్రప్రసాద్ ఫేసు మాడిపోయింది.
వెంటనే నొచ్చుకుంటున్నట్టుగా ముఖం పెడుతూ...
"ఇట్స్ ఆల్ రైట్ రాంగో... ఈ రోజు రాత్రి నువ్వు హైదరాబాద్ వెళుతున్నావు. రేపు మార్నింగ్ నువ్వెళ్ళేసరికి శ్యామ్ సుందర్ అండ్ బ్రదర్స్ కంపెనీవాళ్ళు క్యాష్ రెడీ చేసి వుంచుతారు... ఈరోజు నువ్వు ఆఫీస్ వర్క్ ఏమీ చేయనవసరం లేదు. వెళ్ళి విశ్రాంతి తీసుకో. రాత్రి తొమ్మిది ముప్పయ్ బస్ కు వెళ్ళు....ఇదిగో ఈ మూడు వందలూ ఖర్చులకు నీ దగ్గర వుంచు..." డబ్బు అందించి, తన దగ్గరున్న అకౌంట్ బుక్ లో రాసుకున్నాడు రాజేంద్రప్రసాద్.
"అలాగే సార్.... డబ్బు తీసుకుని ఎల్లుండి ఆఫీసుకు వచ్చేస్తాను...."
హుషారుగా చెబుతూ వెళ్ళిపోయాడు రాంగో!
* * *
మద్రాసు...
కోడంబాకం ఏరియా...
సులేమాన్ ఇచ్చి వెళ్ళిన రెండు లక్షల రూపాయలతో కిట్టూ ఆకారమే పూర్తిగా మారిపోయింది.
రెండు రోజుల క్రితం వరకూ కిట్టూ ఒక చిల్లర దొంగ.
కానీ ఈ రోజు ఒక అఫీషియల్ పర్సన్ లా దర్జా ఒలకపోస్తున్నాడు.
ఖరీదైన దుస్తులు... షూస్... తలపై టోపీ... చూసిన వెంటనే అతన్ని పోల్చుకోవడం వెంటనే సాధ్యం కాదు...
కిట్టూ రెండు రోజులనుంచీ హాయిగా జల్సా చేస్తున్నాడు. తృప్తిగా త్రాగాడు. తిన్నాడు... అందమైన అమ్మాయిలను ఎక్కువ మొత్తం పోసి మరీ ఎంజాయ్ చేశాడు. మూడవ రోజునుంచీ అతనిలో ఆలోచన మొదలైంది. లక్ష రూపాయలు అడ్వాన్స్ తీసుకుని చెప్పిన పని నెలరోజుల్లో పూర్తి చేయకపోతే సులేమాన్ అంత తేలికగా వదలడు... ఎక్కడున్నా వెదికి పట్టుకుని మరీ కాల్చి పారేస్తాడు...
రాటు తేలిన స్మగ్లర్స్ తో సంబంధాలు వున్న సులేమాన్ తో పెట్టుకుంటే ఎంత ప్రమాదమో అతనికి తెలియనిదేమి కాదు.